విశాఖలో మరో భారీ ఉద్యమం - వైసీపీ సంచలన ప్రకటన

By Surendra.R Dec. 14, 2019, 06:05 pm IST
విశాఖలో మరో భారీ ఉద్యమం - వైసీపీ సంచలన ప్రకటన

విశాఖలో మరో భారీ ఉద్యమం చేస్తామంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. అధికార పార్టీ ఇలాంటి ప్రకటన చేయడమేంటే సందేహం రావడం సహజం. ఇందుకు కారణం ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే చెప్పాలి.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ 1970 ఏప్రిల్ 10 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటన చేశారు.

కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6, 000 ఎకరాలను 1970లో దానం చేశారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. 1971 జనవరి 20 ఇందిరా గాంధీచేత కర్మాగారం యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

అలా మొదలైన ఉక్క కార్మాగారం ఉత్తరాంధ్రలోని ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ అండగా నిలుస్తోంది. ప్రభుత్వరంగ సంస్ధ అయినటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు సాగుతున్న ప్రయత్నాలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రపంచ దిగ్గజ ఉక్కు ఉత్పత్తి సంస్థ పోస్కోతో భాగస్వామ్యం అవసరమంటూ కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. దీంతో పాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన 3400 ఎకరాల భూమిని పోస్కో సంస్థకు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కార్మిక సంఘాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే విశాఖలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.

రెండు లక్షల కోట్ల విలువైన భూమిని విదేశీ ప్రైవేటు సంస్థలకు రూ.4849 కోట్లకు సెబీ కట్టబెట్టే యత్నం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప గనులు కేటాయించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని కేంద్రం టాటా, జిందాల్ లాంటి ప్రైవేటు కంపెనీలకు గనులు కేటాయించిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే 1970 తరహాలో మరో మారు భారీ ఉద్యమం తప్పదని వీరభద్రరావు హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనే అంశం ఉత్తరాంధ్రలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp