అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై నాడే యనమల రూలింగ్

By Krishna Babu Aug. 08, 2020, 06:38 pm IST
అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై నాడే యనమల రూలింగ్

శాసన విభాగం , న్యాయ విభాగం, కార్యనిర్వాహణ విభాగం ఈ మూడిటికి ఎవరి పరిధులు వాళ్ళకి విధిస్తూ, ఒకరి పరిధిలోకి మరొకరు చొచ్చుకుని పోకూడదు అని భారత రాజ్యంగం స్పష్టంగా చెబుతుంది. కానీ న్యాయ స్థానాలకు, చట్ట సభలకు నడుమ మొదటి నుండి వివిధ అంశాలపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ది వికేంద్రీకరణ అంశం అసెంబ్లీ ని దాటుకుని గవర్నర్ సంతకం అనంతరం కూడా న్యాయ స్థానంలో వేసిన పిటిషన్ ఆదారంగా స్టేటస్ కో ఇవ్వడంతో నాయ సమీక్ష మొదలైనట్టు భావించాలి.

ఈ సంధర్భంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను స్పీకర్ గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సంధర్భంగా అసెంబ్లీ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతు కొన్ని కీలక వాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం కొందరు పనికట్టుకుని కోర్టులని తప్పుదోవ పట్టిస్తున్నారని. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై అసలు సెలెక్ట్ కమిటీనే ఏర్పాటు కానప్పుడు బిల్లు అక్కడ పెండింగ్ లో ఉందని కోర్టులో చెప్పడం న్యాయస్థానాల్లని తప్పుదోవ పట్టించడం కాదా అని ప్రశించారు.

ఇదే సందర్భంలో శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యం ఉండకూడదు అని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పిందని , పార్లమెంటు అసెంబ్లీ లు తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించడానికి వీలు లేదని రాజ్ పాల vs లోక్ సభ కేసులో సుప్రీం కోర్టు చెప్పిందని చెప్పుకొచ్చారు. అలాగే 1997లో అప్పటి స్పీకర్ గా ఉన్న యనమల అసెంబ్లీ వ్యవహారల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అని రూలింగ్ ఇచ్చారని ఇప్పటికీ ఆ రూలింగ్ అమలులోనే ఉంది అని దీనిపై యనమల ఏమి చెబుతారని ప్రశ్నించారు.

స్పీకర్ గా యనమల ఇచ్చిన రూలింగ్

1997 సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల అక్రమాలపై అప్పటి అసెంబ్లీ సభాసంఘాన్ని నియమించగా, జ్యోతక్క అనే ఒక మండల ప్రసిడెంట్ అసెంబ్లీ వేసిన కమీటిలో ఉన్న ఒక సభ్యుడికి బొగ్గు గనుల తవ్వకాల అక్రమాలతో సంభందం ఉందని అలాంటి వ్యక్తిని కమిటీలో ఎలా నియమిస్తారు అంటూ ఆర్టికల్ 226ను అనుసరించి మాండమస్ కోరుతూ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖాలు చేయగా , ఆ పిటీషన్ ను పరిశీలించిన కోర్టు సభాసంఘాన్ని నియమించడం పట్ల అభ్యంతరం చెప్పింది. దీంతో ఆర్టికల్ 194 (3) ప్రకారం సభా సంఘాన్ని నియమించే విషయంలో అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం పై అభ్యంతరం చెబుతూ స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు 1997 నవంబర్ 18న అసెంబ్లీలో రూలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ హౌస్ లో తీసుకునే నిర్ణయాలు అలాగే కార్యకలాపాల చట్టబద్ధతను నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు అని వాఖ్యానించారు.

ఎమ్మెల్యే రోజా సస్పెన్స్ పై కోడెల

అసెంబ్లీ సమావేశాల్లో శాసన సభ్యురాలు రోజా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పటి తెలుగుదేశం పాలకపక్షం ఆమెని ఏడాది పాటు శాసన సభనుండి సస్పెండ్ చేస్తు స్పీకర్ గా ఉన్న కోడెల నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయం ఏకపక్షం అంటు రోజా కోర్టులో సవాల్ చేశారు. అయితే రోజాను సభలోకి అనుమతించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సందర్భంగా కూడా అసెంబ్లీ రూల్స్‌లోకి, సభ తీసుకున్న నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకోవడంపై స్పీకర్ తీవ్రంగా స్పంధించి రోజాను అనుమతించకుండానే అప్పీలుకు వెళ్ళి తీర్పుని రద్దు చేయించుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే శాసన సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం పట్ల ఆది నుండి అనేక అంశాలపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో శాసనసభ తీసుకున్న వికేంద్రీకరణ అంశం పై తెలుగుదేశం సభ్యులు, ఒక వర్గ మీడియా కలిసి న్యాయస్థానాల జోక్యం పై అనేక వాదనలు వినిపిస్తున్నా వాస్తవానికి అదే తెలుగుదేశం సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉన్న సమయంలో 1997లో ఇచ్చిన రూలింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp