విమర్శిస్తే అర్థం ఉండాలి యనమల..!

By Ritwika Ram Jun. 21, 2021, 01:30 pm IST
విమర్శిస్తే అర్థం ఉండాలి యనమల..!

ఐదేళ్ల కిందట.. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రి పదవులను అనుభవిస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామని సాక్ష్యాత్తూ పార్లమెంటులో ప్రకటించిన హామీని అమలు చేయని బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటూ డబ్బు ఆశజూపింది కేంద్రం. అదే మహద్భాగ్యం అనుకుని కళ్లకు అద్దుకుని తీసుకుంది టీడీపీ. ప్రత్యేక హోదాను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేసింది.
కానీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఇప్పుడు అదే టీడీపీ.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతోంది.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అసలు ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచిందే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ హామీని నెరవేర్చాలని ఉద్యమం చేసిందే వైఎస్ జగన్. ఇవన్నీ పచ్చ పార్టీకి తెలియదా అంటే తెలుసు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమేగా ఆ పార్టీ నేతల పని. ప్రజలకు మంచి చేసినా వారికి చేడుగానే కనిపిస్తుంది. ప్రజల కోసం పోరాటం చేస్తున్నా.. చేయనట్లే కనిపిస్తుంది. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ బాధ్యతను టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీసుకున్నారు. కేంద్రం ముందు జగన్ మోహన్‌రెడ్డి మోకరిల్లారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను దగా చేశారని.. ఇంకా ఏవోవో ఆరోపించారు.

మోకరిల్లింది ఎవరు పెద్దాయనా?

తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకునేందుకు ‘ఓటుకు కోట్లు’ ఇచ్చేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యింది చంద్రబాబు నాయడు. తాను అరెస్టు కాకుండా ఉండేందుకు, ఓటుకు కోట్లు కేసు ముందుకు సాగకుండా ఉండేందుకు కేంద్రంలో తన మిత్రపక్షమైన బీజేపీ ముందు మోకరిల్లింది చంద్రబాబు నాయుడు. ‘ప్రత్యేక హోదా సంజీవిని కాదు’ అని అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అంటే.. వత్తాసు పలకింది ఇదే చంద్రబాబు. హోదాను మించి ప్యాకేజీ ఇస్తామని కేంద్ర చెప్పిందని భుజాలు ఎగరేసింది చంద్రబాబు. హోదా వేస్ట్.. ప్యాకేజీ బెస్ట్ అన్నది ఎవరు.. చంద్రాబాబే. ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరించింది కూడా చంద్రబాబే. ఇవన్నీ నిజం కాదంటారా యనమలా?మరి నిజంగా మోకరిల్లింది ఎవరు? ప్రత్యేక హోదాను ఆటకెక్కించి ఎవరు?

ఆ కేసులు ఎప్పటివో, ఎందుకు పెట్టారో తెలియదా?

ఈడీ, సీఐడీ కేసుల కారణంగానే జగన్ కేంద్రానికి లొంగిపోయారని యనమల ఆరోపించారు. ఈడీ, సీఐడీ కేసులను ఎప్పుడు, ఎవరు, ఎందుకోసం పెట్టారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ లో ఉన్నన్నాళ్లు, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఢీకొట్టనన్నాళ్లు జగన్ పై ఎలాంటి కేసులు లేవు. ఎప్పుడైతే రాజకీయ పోరాటానికి జగన్ సిద్ధమయ్యారో.. అప్పటి నుంచి మొదలైంది వేధింపుల పర్వం. కనీస ఆధారాలు లేకుండా ఎన్నో కేసులు పెట్టి, రాజకీయంగా జగన్ దెబ్బతీసేందుకు ప్రయత్నించింది నాటి యూపీఏ సర్కారు. జైలుకు కూడా పంపింది. కానీ ఎక్కడా తగ్గలేదు జగన్. కేసులకు భయపడలేదు. వణకలేదు.. తొణకలేదు. ఒకవేళ కాంగ్రెస్ ముందు తలదించి ఉంటే.. ఏ ఒక్క కేసు కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఆ కేసులు నిలబడేవి కావు. ఎందుకంటే.. అవినీతి ఆరోపణల్లో నిజం ఉంటే కదా?

అవునా.. యువతకు నష్టమా?

జగన్‌ వ్యవహారంతో రాష్ట్రానికి, యువతకు తీవ్ర నష్టం వాటిల్లిందని యనమల చిలకపలుకులు పలికారు. నిజానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తే.. ఇంతకన్నా పెద్దజోక్ ఇంకోటి ఉండదు. రాష్ట్రానికి, యువతకు ఏ విధంగా నష్టం వాటిల్లిందో కూడా యనమల చెప్పి ఉంటే బాగుండేది. లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చినందుకా? దేశంలోనే రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసినందుకా? కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగిస్తున్నందుకా? గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి పనిని సులభంగా చేస్తున్నందుకా? ఎందుకు యనమల సార్? వీటికి సమాధానాలు చెప్పండి ప్లీజ్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp