WTC ట్విన్ టవర్స్,లాడెన్,సద్దాం,ఐసిస్ ,మళ్ళీ తాలిబన్- 20 ఏళ్ళలో జరిగింది ఇదే

By Ramana.Damara Singh Sep. 11, 2021, 01:15 pm IST
WTC ట్విన్ టవర్స్,లాడెన్,సద్దాం,ఐసిస్ ,మళ్ళీ తాలిబన్- 20 ఏళ్ళలో జరిగింది ఇదే

ప్రపంచంపై పెత్తనం కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాద తండాలను పెంచి పోషించే అమెరికా దుర్నీతి అనేక దేశాలను అస్థిరతలోకి నెట్టేసింది. ప్రపంచంపై ఉగ్రదాడులకు ప్రేరేపించింది. కొన్ని సందర్భాల్లో ఈ ఉగ్ర మూకలు అమెరికాను కూడా విడిచిపెట్టలేదు. అటువంటి ఒక భయంకర సంఘటనే 9/11 దాడులు. అది అమెరికా చరిత్రలోనే చీకటి రోజు. అంతకుముందెన్నడు అనుభవించని ఘోరకలిని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ తన ఆత్మాహుతి దాడులతో అమెరికాకు రుచి చూపించింది. ఈ దాడులతో అమెరికాతో పాటు మొత్తం ప్రపంచమే వణికిపోయింది. పాములకు పాలు పోసి పోషించే అమెరికా విధానాలే ఈ ఘోరకలికి కారణం.

ఆ రోజు ఏం జరిగింది?

సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కేంద్రమైన పెంటగాన్ పై అల్ ఖైదా ఆత్మాహుతి దళాలు వరుస దాడులకు పాల్పడ్డాయి. మొత్తం 19 మంది ఉగ్రవాదులు నాలుగు బృందాలుగా విడిపోయి హైజాక్ చేసిన విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లతోపాటు పెంటగాన్ కార్యాలయాలపైకి దూసుకెళ్లి విమానాలను పేల్చివేశారు. ఈ దాడుల్లో 19మంది ఉగ్రవాదులతో సహా 2996 మంది మృతి చెందారు. ఈ దాడులను అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘన్ దేశం నుంచి స్వయంగా పర్యవేక్షించాడు. దాంతో ఒక్కసారి లాడెన్ పేరు ప్రపంచమంతా మార్మోగింది. అమెరికా, యునైటెడ్ నేషన్స్ తో సహా అనేక దేశాలు అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించాయి.

Also Read : సింహాల గడ్డనూ లొంగదీసుకున్నారు..!

ఎవరీ లాడెన్

ఒసామా బిన్ లాడెన్ సౌదీ అరేబియాకు చెందినవాడు. అతని తండ్రి ఆ దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు. 1980 ప్రాంతంలో ఆఫ్ఘన్ లో సోవియట్ దళాలతో పోరాడుతున్న ముజాహిద్దీన్ తీవ్రవాదులకు ఆర్థికంగా అండదండలు అందించడంతో లాడెన్ ఉగ్ర కార్యకలాపాలు మొదలయ్యాయి. సౌదీ నుంచి సూడాన్ వచ్చి 1988లో అల్ ఖైదా సంస్థ ఏర్పాటు చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. దాంతో అతన్ని దేశం నుంచి పంపేయాలని అమెరికా సూడాన్ పై ఒత్తిడి పెంచింది. ఫలితంగా 1996లో సూడాన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు మకాం మార్చాడు. సరిగ్గా అప్పుడే ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన మొదలైంది. తాలిబన్ల ఆశ్రయం పొందిన లాడెన్ అమెరికాపై యుద్ధం ప్రకటించాడు. 1998లో అక్కడి యూఎస్ ఎంబసీపై దాడులకు తెగబడ్డాడు. 2001 సెప్టెంబర్ 11న అమెరికా వాణిజ్య రాజధానినే దెబ్బ తీశాడు. ప్రపంచంలో అత్యంత దారుణమైన ఉగ్ర దాడుల్లో ఇదొకటిగా పేరుపొందింది.

దశాబ్దం పాటు లాడెన్ వేట

9/11 దాడులకు అల్ ఖైదా నేత లాడెన్ కారకుడని నిర్ధారణకు వచ్చిన అమెరికా అతన్ని తమకు అప్పగించాలని తాలిబన్ పాలకులకు అల్టిమేటం జారీ చేసింది. అయితే తాలిబన్లు దానికి తిరస్కరిస్తూ.. లాడెన్ కు వ్యతిరేకంగా తమకు ఆధారాలు సమర్పిస్తే ఇస్లామిక్ చట్టాల ప్రకారం తామే విచారణ జరిపి శిక్షిస్తామని స్పష్టం చేసింది. దాంతో అమెరికా 2001 ఆక్టోబరు ఏడో తేదీన ఆఫ్ఘన్ పైకి నాటో దళాలను పంపింది. టాలిబన్లను తరిమికొట్టి పాలనను, రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. హమీద్ కర్జాయ్ ని అధ్యక్షుడిగా నియమించింది. ఈ పరిణామాలతో లాడెన్ పాకిస్థాన్ కు పారిపోయాడు.

Also Read : మాజీ సీఎం మరదలు - ఫుట్ పాత్ పై దయనీయ స్థితిలో

దశాబ్దం తర్వాత 2011 మే రెండో తేదీన పాకిస్థాన్ లోని అబోతాబాద్ లో తలదాచుకున్న లాడెన్ ను అమెరికన్ నేవీ సీల్ దళాలు దాడి చేసి హతమార్చాయి. అయినా సరే అమెరికా నిన్న మొన్నటి వరకు ఆఫ్ఘన్ లోనే తిష్ట వేసి తన ఆధిపత్యం కొనసాగించింది. అయితే మిగతా అల్ ఖైదా, తాలిబన్ నేతలను అంతమొందించడంలో విఫలమైంది. దాంతో 2002 నుంచే తాలిబన్లు పాక్, ఆఫ్ఘన్ సరిహద్దుల్లో మెల్లగా సంఘటితమై ఉగ్రదాడులు మళ్లీ మొదలుపెట్టారు.

తన స్వార్ధానికే ప్రాధాన్యం

అమెరికా మొదటి నుంచీ తన స్వార్థ ప్రయోజనాలకు ప్రధాన్యమిస్తూ వచ్చింది. ఆఫ్ఘన్ విషయంలోనే కాకుండా పలు దేశాల విషయంలోనే తనకు వ్యతిరేకత ఉన్న చోట ఉగ్రవాదులను, ఆయా దేశాల పాలకుల ప్రత్యర్థులను పెంచి పోషించి తన పెత్తనం కొనసాగేలా రెచ్చగొడుతోంది. గతంలో ఇరాన్ ఇరాక్ మధ్య గొడవల్లో తలదూర్చి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ పై యుద్ధం ప్రకటించింది. 9/11 దాడులకు సద్దాం హుసేనే బాధ్యుడని ఒక దశలో అమెరికా ప్రకటించింది. తర్వాత లాడెన్ కారకుడని తేలడంతో నాలుక్కరుచుకుంది.

అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తలదూర్చి పాలస్తీనా అధ్యక్షుడు యాసిర్ ఆరాఫత్ మరణానికి, తన కంట్లో నలుసుగా మారిన లిబియా అధ్యక్షుడు కల్నల్ గడాఫీ హత్యకు కారణమైంది. ఈజిప్ట్ లోనూ హోస్ని ముబారక్ కు వ్యతిరేకంగా పనిచేసింది. ఆఫ్ఘన్ లోనూ 1980 సోవియట్ దళాల ప్రవేశాన్ని తట్టుకోలేక వాటికి వ్యతిరేకంగా పాక్, ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని గిరిజన తెగలకు పాకిస్థాన్ తో కలిసి డబ్బు, ఆయుధాలు సమకూర్చి ఉగ్రవాదులుగా మార్చింది. అలా ఏర్పడిన సంస్థలే తాలిబన్, హక్కానీ, ఐసిస్ ముఠాలు. ముజాహిద్దీన్లను కూడా ఎగదీసింది అమెరికాయే. గత 20 ఏళ్లుగా ఆఫ్ఘన్ రక్షణ పేరుతో అక్కడే తిష్ట వేసిన అమెరికా అసలు లక్ష్యం ఉగ్రవాదుల అంతం కాదు. ఆఫ్ఘన్ నుంచి అర్థాంతర నిష్క్రమణే దీనికి నిదర్శనం.

Also Read : తాలిబాన్లలో "హక్కానీ" గ్రూప్ ప్రత్యేకం

తాలిబాన్ ప్రభుత్వం

అమెరికా వెనుదిరిగిన వెంటనే తోక ఝాడించిన తాలిబన్లు ఆఫ్ఘన్ను మళ్లీ స్వాధీనం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అయ్యారు. సరిగ్గా 9/11 దాడులు జరిగిన రోజే తాలిబన్ ప్రభుత్వం కొలువుదీరడానికి ముహూర్తంగా నిర్ణయించడం విశేషం. దాంతో ఇది ముగింపు కాదు. అమెరికా తన స్వార్థపూరిత విధానాలు మార్చుకోనంత కాలం దాడులు, విధ్వంసాలు కొనసాగుతూనే ఉంటాయి. మళ్లీ ఎప్పుడో తనకు అవసరం వచ్చినప్పుడో.. తనకు కష్టం వాటిల్లినప్పుడో అమెరికా మళ్లీ రంగంలోకి దిగుతుందన్నది వాస్తవం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp