అన్నాడీఎంకే లో చీలిక రానుందా..? త‌మిళ‌నాట ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

By Kalyan.S Sep. 29, 2020, 07:22 am IST
అన్నాడీఎంకే లో చీలిక రానుందా..? త‌మిళ‌నాట ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

తమిళనాడులో ఎన్నిక‌ల వేడి అప్పుడే రాజుకుంది. రాజకీయ సమీకరణాలు జోరందుకుంటున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ పార్టీలు క‌సర‌త్తు చేస్తున్నాయి. ప్ర‌ధానంగా అన్నాడీఎంకే లో తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరనే అంశం తాజాగా తెరపైకొచ్చింది. ఇదే అంశంపై ఓ నిర్ణయానికొచ్చేందుకు సోమవారం స‌మావేశ‌మైన అన్నాడీఎంకే కార్యవర్గం ర‌సాభాస‌గా మారింది. అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య వాగ్వాదం నడిచింది.

మ‌ళ్లీ నాకే ఇవ్వాలి.. కాదు ఈసారి నాకు ఇవ్వాలి.

త‌మిళ‌నాడు ప్ర‌స్తుత సీఎం పళనిస్వామి మరోసారి తనకే సీఎం అభ్యర్థిగా అవకాశమివ్వాలని పార్టీ సమావేశంలో కోరిన‌ట్లు తెలిసింది. అయితే ఈసారి సీఎం అభ్యర్థిగా తాను బరిలో నిలుస్తానని.. తనకే అవకాశం ఇవ్వాలని పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మొత్తం మీద.. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిని అక్టోబర్ 7న ప్రకటించాలని పార్టీ నేతలు తీర్మానించారు. అయితే.. అక్టోబర్ 7న పార్టీ సీఎం అభ్యర్థిని పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసి ప్రకటిస్తారని అన్నాడీఎంకే డిప్యూటీ కో-ఆర్డినేటర్ కేపీ మునుస్వామి మీడియాకు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

డీఎంకేలో ఆ ప‌రిస్థితి లేదు..

అన్నాడీఎంకేలో నెలకొన్న ఈ పరిణామాలను.. ప్రతిపక్ష డీఎంకే ఆసక్తిగా పరిశీలిస్తోంది. ప్రతిపక్ష డీఎంకేలో సీఎం అభ్యర్థిపై ఎలాంటి తర్జనభర్జన లేదు. 2021లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నుంచి సీఎం అభ్యర్థిగా స్టాలిన్ నిలవనున్నారు. డీఎంకేకు పార్టీపరంగా ఎలాంటి తలనొప్పులు లేకపోవడం అన్నాడీఎంకేతో పోల్చుకుంటే ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. పొత్తులపరంగా కూడా డీఎంకే స్పష్టమైన వైఖరితో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్‌తో కలిసే దాదాపు వచ్చే ఎన్నికల్లో డీఎంకే బరిలో నిలవనుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. సీఎం అభ్యర్థి ఎంపికపై పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య సయోధ్య కుదరని పక్షంలో అన్నాడీఎంకేలో చీలిక వచ్చే అవకాశమూ లేకపోలేదు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం దీనిపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp