యూపీఏ నాయకత్వం మారుతుందా?

By Ramana.Damara Singh May. 12, 2021, 05:32 pm IST
యూపీఏ నాయకత్వం మారుతుందా?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డీయే ప్రభుత్వంపై.. ప్రధానంగా మోదీ నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతున్నా.. ఆ స్థానాన్ని భర్తీ చేయగలనన్న ధీమాను కాంగ్రెస్ కల్పించలేకపోతోంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం రెండు ప్రధాన రాజకీయ కూటముల చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. వీటిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. అయితే ఎన్డీయేకి బలమైన పోటీ ఇవ్వలేని స్థితిలో యూపీఏ కొట్టుమిట్టాడుతోంది. యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ.. ఆమె వారసుడు రాహుల్ గాంధీల నాయకత్వ లోపమే దీనికి కారణమన్న అసంతృప్తి చాలా కాలంగా యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో ఉంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అది మరింత బలపడి నాయకత్వ బాధ్యతల నుంచి వారిద్దరూ తప్పుకొని కాంగ్రేసేతర పార్టీ నేతకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ ఊపందుకుంది.

ఆశలు రేపుతున్న మమత

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తం దేశం దృష్టిని ఆకర్షించి.. ఉత్కంఠ రేకెత్తించిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాషాయ సేన సర్వశక్తులు, అధికార బలం మోహరించినా ధైర్యంగా ఎదురునిలిచి సవాల్ చేయడమే కాకుండా ఒంటరిగా పోరాడి బీజేపీ ఎత్తులను చిత్తు చేసి.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఆ పార్టీ కలలను కల్లలు చేసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు యూపీఏ పక్షాలకు ఆశా కిరణంలా కనిపిస్తున్నారు. ఆమె తెగువ, ధైర్యసాహసాలు, పోరాట పటిమ యూపీఏ కు కొత్త జవసత్వాలు కల్పిస్తాయని, ఎన్డీయే పై పోరాటానికి బూస్ట్ ఇస్తాయని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఆమెను యూపిఏ చైర్ పర్సన్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

సోనియా, రాహుల్ పై సన్నగిల్లుతున్న ఆశలు

2019 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైన మెజారిటీతో బాహుబలిలా కనిపించిన ప్రధాని మోదీ ప్రస్తుతం గాలి తీసిన బాలూన్లా తేలిపోతున్నారు. గత రెండేళ్లలో దేశంలో జరిగిన పలు ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన ఏమంత సంతృప్తికరంగా లేదు. పరాజయాలు వెన్నాడుతున్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ కట్టడి.. ఉచిత టీకా కార్యక్రమం వేగవంతం చేయడంలో వైఫల్యం మోదీ-షా ద్వయం ప్రతిష్టను మసకబార్చి ఎన్డీయే ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుతున్నాయి. ఈ పరిణామాలను క్యాష్ చేసుకొని తన పరిస్థితిని మెరుగుపర్చుకోవడంలో యూపిఏ విఫలమవుతోంది. దీనికి చైర్ పర్సన్ గా ఉన్న సోనియాగాంధీ వృద్ధాప్యంతో, రాహుల్ గాంధీ ప్రణాళికా లోపంతో కాంగ్రెస్ నే గెలుపు తీరాలకు చేర్చలేకపోతున్నారు. ఇక యూపీఏకు ఎలా నేతృత్వం వహించగలరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు వరకు ఒత్తిడి ఉండేది. మమత అద్భుత విజయం తర్వాత ఆమెనే యూపీఏ అధ్యక్షురాలిని చేయాలన్న ఒత్తిడి పెరిగింది.

ప్రాంతీయ నేతలతో మమతకు మంచి పరిచయాలు
మమతకు కాంగ్రెస్ కొత్త కాదు. ఆమె ఆ పార్టీ నుంచి బయటకొచ్చే తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. సంకీర్ణ రాజకీయలపైనా అవగాహన ఉంది. మరోవైపు దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల కలయికతో తృతీయ కూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచన పలు యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం దాన్ని ఆచరణలోకి రానివ్వలేదు. తృతీయ కూటమి వస్తే కాంగ్రెస్ మనుగడ దెబ్బతింటుందన్నది దాని ఆందోళన. అయితే ఇప్పుడు దాదాపు అదే జరగక తప్పేలా లేదు. సోనియా యూపీఏ చైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకోవడమే కాకుండా రాహూల్ కు కట్టబెట్టకుండా చూడాలని భాగస్వామ్య పక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. రాహుల్ కు ఇస్తే గిస్తే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చుకోండి గానీ.. యూపీఏ చైర్ పర్సన్ పదవిని మాత్రం మమత బెనర్జీకి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. మరి దీనిపై అటు మమత.. ఇటు సోనియా, రాహుల్ వైఖరి ఎలా ఉండబోతోందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp