ఆగష్ట్ 15 నాటికే వ్యాక్సిన్ వస్తుందా?

By Raju VS Jul. 04, 2020, 07:48 am IST
ఆగష్ట్ 15 నాటికే వ్యాక్సిన్ వస్తుందా?

నిపుణులు ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు?

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కట్టడికి మార్గం సుగమం అవుతోంది. కీలకమైన వ్యాక్సిన్ తయారీలో అనేక దేశాలు నిమమ్నమై ఉండగా భారతీయ నిపుణులు మరో అడుగు ముందుకేశారు. విశ్వమంతా మనవైపు చూసేలా శాస్త్రవేత్తలు సన్నద్దమవుతున్నారు. అందులో భాగంగా వ్యాక్సిన్ తయారీలో కీలకమైన క్లినికల్ పరీక్షలకు అనుమతి దక్కించుకున్నారు. ఇప్పటికే దేశంలో రెండు సంస్థలకు ఐసీఎంఆర్ నుంచి అనుమతులు వచ్చాయి. అందులో ఒకటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ కావడం విశేషం.

కోవాగ్జిన్ పేరుతో టీకా తయారీకి వారికి అనుమతులు వచ్చాయి. విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్ లోని నిమ్స్ సహా దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులలో క్లినికల్ టెస్టులకు వారు సన్నద్దమవుతున్నారు. విశాఖలో ఏకంగా 150 మందిపై ఈ వ్యాక్సిన్ పనితీరు గురించి పరీక్షలు నిర్వహించబోతున్నారు. వాటి పనితీరు పరిశీలించిన తర్వాత ఆగష్ట్ 15 నాటికి వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని ప్రకటించారు.

అదే సమయంలో జైడస్ అనే సంస్థకు కూడా వ్యాక్సిన్ కోసం క్లినికల్ పరీక్షకలకు అనుమతులు లభించాయి. దాంతో దేశంలో అలాంటి అనుమతి పొందిన రెండో సంస్థగా గుర్తింపు పొందారు. జై కోవ్ డి పేరుతో వారు వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నారు. దేశంలో మొత్తం 7 సంస్థలు ఇప్పటికే క్లినికల్ పరీక్షల దశకు చేరుకున్నాయి. వాటిలో ఇద్దరికీ అనుమతులు దక్కడంతో త్వరలోనే దేశంలో వ్యాక్సిన్ కార్యరూపం దాల్చబోతోందనే ఆశాభావం ఏర్పడింది. భారతీ య శాస్త్రవేత్తల పనితీరుని ప్రపంచానికి చాటే రీతిలో ఇది సుసాధ్యం కావడం పట్ల సామాన్యులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే రెండో దశకు చేరిన వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను వీలయినంత వేగంగా పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. దానికి అనుగుణంగా రెండోదశలో పరీక్షలను 1125 మందిపై నిర్వహించేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. అయితే వాలంటీర్లను గుర్తించడం, వారిపై పరీక్షలు చేయడం, ఫలితాలు పరిశీలించండి వంటివి వేగంగా చేయడం వల్ల ఉపయోగం ఏముంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈప్రయోగాల్లో భాగంగా తొలుత 375 మందిపై టీకాను ప్రయోగిస్తారు. వారిని ప్రయోగాశాలలో 14 రోజుల పాటు పరిశీలిస్తారు. ఆ తర్వాత రెండో డోసు అందిస్తారు. మళ్లీ 11 రోజుల పాటు పరిశీలించి వాటి రికార్డులను ఐసీఎంఆర్ కి అందించాల్సి ఉంటుంది. రెండో డోసులు తీసుకున్న వ్యక్తిలో టీకా కారణంగా లభించిన ఫలితాలను ఐసీఎంఆర్ గుర్తించిన తర్వాత టీకాపై తుది నిర్ణయం తీసుకుంటారు.

ప్రపంచంలోని 150 బృందాలు ఈ టీకాల తయారీలో తలమునకలై ఉన్నాయి. అమెరికాలోని మెడెర్సా సంస్థ ఇప్పటికే క్లినికల్ పరీక్షలు ప్రారంభించింది. ఏప్రిల్ లోనే వారు ఆ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం మూడోదశ పరీక్షలకు చేరుకుంది. వచ్చే ఏడాదికి వ్యాక్సిన్ సిద్ధం కాగలదని వారు చెబుతున్నారు. కానీ మనదేశంలో ప్రస్తుతం రెండోదశకు చేరగానే వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ చెప్పడంపై పలువురు నిపుణులు పెదవి విరుస్తున్నారు. హడావిడిగా వ్యాక్సిన్ తీసుకురావాలనే ప్రయత్నం శ్రేయస్కరం కాదని బయోకాన్ సంస్థ కూడా చెబుతోంది. ఇతర పలువురు వైద్య శాస్త్ర నిపుణులు కూడా వ్యాక్సిన్ సంపూర్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందడుగు వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దాంతో వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి తాజా ప్రకటనలు కొంత ఉపశమనం అందించగా, నిపుణులు వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు పెంచుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp