బీహార్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. ఓవైసీ లక్ష్యం అదేనా..?

By Srinivas Racharla Oct. 25, 2020, 01:45 pm IST
బీహార్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. ఓవైసీ లక్ష్యం అదేనా..?

ఖాసిం రజ్వీ..ఇత్తెహాదుల్ ముస్లిమీన్..ఈ పేర్లు బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు.1946లో ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ఖాసిం రజ్వీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా "అసఫియా" జెండాను ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరేస్తాం అని విర్రవీగిన మతోన్మాది. స్వాతంత్రానంతరం ఈ సంస్థ ' ఆల్ ఇండియా మజ్లీస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ' అనే రాజకీయ పార్టీగా అవతరించింది.

సింపుల్‌గా ఎంఐఎం అనబడే ఈ పార్టీ హైదరాబాద్ కార్పొరేషన్‌లోని ఓ వార్డు విజయంతో తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టి నగరంలో నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా ఎదిగింది.దేశంలో విస్తరించాలని కలలు కన్నప్పటికీ తెలంగాణ గడప దాటి ఇతర రాష్ట్రాలలో బలపడిన పరిస్థితి లేదు.ఈ మధ్య కాలంలో ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్,జార్ఖండ్,మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఎంఐఎం దిగింది.కానీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒకటి,రెండు ఎమ్మెల్యే స్థానాల విజయంతో సంతృప్తి పడాల్సి వస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎంఐఎం కూడా బరిలోకి దిగుతోంది.ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ జనతా దళ్(డెమోక్రటిక్), సుహేల్‌దేవ్‌కి చెందిన భారతీయ సమాజ్ పార్టీ, జనతా పార్టీ (సమాజ్‌వాదీ)లతో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జత కట్టి సెక్యులర్ మహాకూటమిని ఏర్పాటు చేశారు.ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాజీ బిజెపి నేత ఉపేంద్ర కుశ్వాహాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ కూటమి తెరపైకి తీసుకురావడమే. నరేంద్ర మోడీ తొలి క్యాబినెట్‌లో ఆర్‌ఎల్‌ఎస్‌పి అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా కేంద్ర మంత్రి. పైగా గతంలో ఆయన బీజేపీ టికెట్‌పై చేయడం గమనార్హం.

ముస్లింలు,యాదవుల ఓట్ల చీలికపై ఆధారపడ్డ ఎంఐఎం

బీజేపీకి వ్యతిరేకంగా లాలూ తమ పక్షాన నిలబడతాడని ఎక్కువమంది బీహార్ ముస్లింలు నమ్ముతున్నారు.ఇక్కడి ముస్లింలు లాలూ తప్పితే మరే నాయకుణ్నీ తమ నాయకుడిగా ఊహించుకోరు. ఎందుకంటే బాబ్రీ మసీదు, సీఏఏ బిల్లులపై సీఎం నీతీశ్ కుమార్ ముస్లింల వైపు మాట్లాడలేదు.ఉత్తర భారత దేశంలో బీజేపీ వ్యతిరేక నాయకులలో ఇప్పటికీ లాలూను మించిన నాయకుడు లేదనడం అతిశయోక్తి కాదు.అందుకే బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ మహాఘట్ బంధన్‌కే పోల్ అవుతాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో మతం పేరుతో బీజేపీ వ్యతిరేక ఓటర్లను ఒవైసీ కూడగట్టలేరు. ఇక ఎలాగూ సెక్యులర్ ఓట్లు కూడా ఎంఐఎం పార్టీకి పడవు.

ఈ పరిస్థితిలో ముందుగా ముస్లింలు,యాదవుల ఓట్ల మధ్య చీలిక తేకపోతే ఎంఐఎం కి ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యం లభించడం కూడా కష్టమని ఒవైసీ భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ముస్లిం, యాదవుల మధ్య సంబంధాలు అంత బలహీనంగా లేవు.వాటిపై ఒవైసీ ప్రభావం చూపే అవకాశమే దాదాపు శూన్యం.కాగా ముస్లిం యువతలో ఒవైసీపై సానుకూలత ఉన్నప్పటికీ వారు ఆయనని సెక్యులర్ నాయకుడిలా కాకుండా ఒక ముస్లింలా మాత్రమే చూస్తున్నారు.ఇక సెక్యులర్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుశ్వాహాను ప్రకటించడం వల్ల ఒవైసీకి ప్రత్యేకంగా ఒనగూడే ప్రయోజనమేమీ లేదు.

సీమాంచలే ఓవైసీ టార్గెటా..?

ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే జిల్లాలపై కన్నేసిన ఒవైసీ ప్రధానంగా సీమాంచల్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కిషణ్‌గంజ్‌లో 67.98 శాతం, పూర్ణియాలో 38.46, కథియార్‌లో 44.47, అరారియాలో 42.95 శాతం ముస్లింలు ఉన్నారు. ఎంఐఎం పార్టీ బీహార్ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ సురాజ్‌పురి వర్గానికి చెందినవాడు. కిషణ్‌గంజ్‌లో సురాజ్‌పురి జనాభా 45 శాతం ఉండటం వల్ల గతేడాది అక్టోబరులో జరిగిన కిషణ్‌గంజ్ ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ గెలుపొందింది.దీంతో తొలిసారి బీహార్ అసెంబ్లీలో ఓవైసీ పార్టీకి ప్రాతినిథ్యం లభించడానికి వీరి జనాభా యే ప్రధాన కారణం.అయితే ఈ విశ్లేషణలను ఓవైసీ ఖండించడంతో పాటు అన్ని వర్గాల ముస్లింలు తమ వెంటే ఉన్నారని ఆయన ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అవిభాజిత బీహార్‌లో భాగమైన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు గతేడాది నవంబర్‌లో జరిగాయి. ఆ రాష్ట్రంలోను ముస్లింలు 15 శాతం ఉన్నప్పటికీ ఒవైసీ పార్టీ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది.14 స్థానాలలో ఎంఐఎం పోటీ చేయగా దుమ్రి అసెంబ్లీ సీట్లోనే అత్యధికంగా 24,132 ఓట్లు వచ్చాయి. పైగా ఒవైసీ పార్టీ వల్ల జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అభ్యర్థులు ఓడిపోయిన స్థానం ఒకటి కూడా లేదు.ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఉత్తర భారతంలో ముస్లింలను తన పార్టీ వైపు ఆకర్షించడంలో ఒవైసీ విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

కాగా బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని ప్రకటించుకునే ఓవైసీ సెక్యులర్ ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా కమలం పార్టీకి లబ్ధి చేకూర్చున్నాడని ఎంఐఎం పార్టీపైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలోను ముస్లింలీగ్ రాజకీయాలను బీహార్ ముస్లిములు పెద్దగా ఆదరించలేదు. ఇక బీహార్‌ ముస్లింలు ఒవైసీ పక్షాన నిలబడతారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రస్తుతానికి..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp