కులం కార్డుతో ఓటు బ్యాంకు పదిలమా?

By Ramana.Damara Singh Oct. 03, 2021, 07:45 pm IST
కులం కార్డుతో ఓటు బ్యాంకు పదిలమా?

సమకాలీన రాజకీయాల్లో సిద్ధాంతాల స్థానాన్ని ఓటు బ్యాంకు ఎత్తుగడలు ఆక్రమించాయి. పైకి సిద్ధాంతాలు వల్లిస్తున్నా.. ఆచరణలో మాత్రం ఓటు బ్యాంకు పదిలపర్చుకోవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. అందుకే కులం కార్డును తురుపు ముక్కగా వాడుకుంటున్నాయి. వెనుకబడిన వర్గాల సంక్షేమం పేరుతో కుల రాజకీయాలు చేస్తున్నాయి. చివరికి క్రమశిక్షణ, హిందూత్వం వంటి పెద్ద మాటలు చెప్పే బీజేపీ కూడా తన రాజకీయ అజెండాలో కులాన్ని చేర్చడం విశేషం. వచ్చే ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్నాళ్లుగా కుల, ఓటు బ్యాంకు రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి.

కుల పార్టీలు, నేతల వేటలో పార్టీలు

ఉత్తర భారతంలో ఎప్పటి నుంచో కుల రాజకీయాలదే పైచేయి. ఇటీవలి కాలంలో ఆ ధోరణి మరింత పెరిగింది. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కులాల ప్రాతిపదికన పెద్ద సంఖ్యలో పార్టీలు పుట్టుకొచ్చాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి చిన్నాచితకా పార్టీలతో జట్టు కట్టి ఆయా కులాల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఒకవైపు ఓబీసీ కార్డు ప్రయోగిస్తూ మరోవైపు బ్రాహ్మణ వర్గంలో పట్టు పెంచుకునేందుకు ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాదను పార్టీలో చేర్చుకుని.. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది.

జూలైలో జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏకంగా 27 మంది ఓబీసీలకు చోటు కల్పించడం ఓటు బ్యాంకు రాజాకీయాల్లో భాగమే. అదే సమయంలో కూర్మిలు, మత్స్యకార వర్గాల్లో పట్టున్న అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. మళ్లీ అధికారంలోకి రావాలని తపిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ యాదవులు, ముస్లిం వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మరికొన్ని చిన్న చిన్న కుల పార్టీలను కలుపుకోవడానికి మంతనాలు జరుపుతోంది. ఇక దళితులకు ప్రతినిధిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి 2005లో దళితులు, బ్రాహ్మణులతో కలిపి సోషల్ ఇంజినీరింగుతో అధికారం చేపట్టారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయోగం చేయాలని కార్యాచరణ సిద్ధం చేసుకుంది.

కాంగ్రెస్ దళిత రాజకీయం

పంజాబ్ కాంగ్రెస్ విభాగంలో రేగిన సంక్షోభంతో ప్రతిష్ట కోల్పోయిన కాంగ్రెస్ సంక్షోభ పరిష్కారం పేరుతో దళిత కార్డు తెరపైకి తెచ్చింది. ఆ వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీకి సీఎం పీఠంపై కూర్చోబెట్టి.. దళిత నేతను మొదటి సీఎం చేసిన ఘనత తమదేనని ప్రచారం మొదలుపెట్టింది. పంజాబు జనాభాలో దళితులే ఎక్కువ. 32 శాతం వరకు ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యం. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ జాట్ సిక్కు వర్గీయుడు కాగా సీఎం పదవిని దళిత నేతకు ఇవ్వడం ద్వారా ఐదు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు ప్రధాన వర్గాల మద్దతు పొందాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఆకాలీ దళ్, బీఎస్పీల మధ్య పొత్తు కుదరడం, ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతుండటమే కాకుండా దళితుల్లో పట్టు పెంచుకుంటుండటం కూడా కాంగ్రెస్ ఈ ఎత్తు వేయడానికి దోహదం చేశాయి.

మరోవైపు యువ నేతలుగా వెలుగులోకి వచ్చిన కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీలను పార్టీలో చేర్చుకోవడంలోనూ కుల లెక్కలు ఉన్నాయి. దళిత నేత అయిన జిగ్నేశ్ గుజరాత్ ఎన్నికల్లో ఆ వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఉపయోగపడతారు. ఓబీసీ వర్గానికి చెందిన కన్హయ్య కుమార్ చేరిక బీహార్ తోపాటు యూపీలోని ఓబీసీలపై ప్రభావం చూపిస్తుంది.

పాటీదార్లపై బీజేపీ ప్రేమ

గత ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించిన పాటీదార్లను మచ్చిక చేసుకునేందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ రూపానీని పార్టీ అధిష్టానం హఠాత్తుగా తొలగించి తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్ కు సీఎం పీఠం అప్పగించింది. 2017 ఎన్నికల సమయంలో విజయ్ రూపానీయే సీఎంగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆ ఎన్నికలను బీజేపీ ఎదుర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంగా ఉన్న పాటీదార్లు రిజర్వేషన్ల ఉద్యమం ఉద్ధృతంగా నిర్వహించారు. ఆ ఉద్యమంతోనే హార్ధిక్ పటేల్ వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెసులో ఉన్నారు. పాటీదార్లు కూడా కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్న విషయం గుర్తించిన బీజేపీ అధిష్టానం పాటీదార్ వర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న భూపేంద్ర పటేల్ ను తెరపైకి తెచ్చింది. పాటీదార్ సామాజికవర్గానికి చెందిన సర్దార్ ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ వంటి శక్తిమంతమైన సంస్థలకు ట్రస్టీగా ఉన్నందునే.. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారన్న విషయాన్ని పక్కన పెట్టి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp