అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఆ ప్ర‌చారాన్ని తిప్పికొడ‌తారా?

By Kalyan.S Sep. 16, 2021, 05:00 pm IST
అమిత్ షా  తెలంగాణ పర్యటనలో ఆ ప్ర‌చారాన్ని తిప్పికొడ‌తారా?

తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌డానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓ రేంజ్ లో ప్ర‌య‌త్నిస్తోంది. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఆ పార్టీ నేత‌లు ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. మ‌రోవైపు.. రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌తో బ‌స్తీలు, గ‌ల్లీలు తిరుగుతున్నారు. అంద‌రినీ ప‌ల‌క‌రించుకుంటూ.. స‌భా వేదిక ఏర్పాటు చేసిన‌చోట‌ల్లా.. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. లోపాల‌ను ఎత్తిచూపుతూ ఆక‌ట్టుకుంటున్నారు.

బీజేపీ నాయ‌క‌త్వం స్థానికంగా ఇంత‌లా దూసుకెళ్తుంటే.. కేసీఆర్ ఢిల్లీ టూర్ ఒక్క‌సారిగా ఆ వేడిని త‌గ్గించేసింది. ఏకంగా తొమ్మిది రోజుల పాటు ఆయ‌న ఢిల్లీలోనే మ‌కాం వేశారు. ప్ర‌ముఖ స్థానంలో ఉన్న బీజేపీ నేత‌లంద‌రితోనూ భేటీ అయ్యారు. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్రంలో ప్ర‌చారం మారిపోయింది. గ‌ల్లీలో ఢీ.. ఢిల్లీలో భేటీ.. టీఆర్ఎస్, బీజేపీతో రెండూ ఒక్క‌టే అనే ప్ర‌చారం తీవ్ర స్థాయిలో కొన‌సాగుతోంది.

ఏదో ఒక రోజు టీఆర్ఎస్, బీజేపీ రెండు క‌లిసిపోతాయ‌ని పేర్కొంటూ గ్రేట‌ర్ కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు కొల‌ను హ‌న్మంత్ రెడ్డి ఇటీవ‌లే పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌చారాన్ని తిప్పికొట్టేందుకు స్థానిక బీజేపీ నేత‌లు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ దీన్ని హైలెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందన్న చర్చ జోరందుకుంది.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17న నిర్మల్‌లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అమిత్‌షా ప్రసంగంపై అంత‌టా ఆసక్తి నెలకొంది. ఆయ‌న ద్వారానే బీజేపీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి బ్రేకులు వేసేలా చేసేందుకు క‌మ‌ల‌నాథులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. గ్రేట‌ర్ ప్ర‌చారానికి వ‌చ్చిన సంద‌ర్భంలో కూడా అమిత్ షా రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో.. లెక్క‌ల‌తో తేల్చి చెప్పారు.

ఒకవైపు అధికార టీఆర్ఎస్‌తో కొట్లాడి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, ప్రజల్లోకి స్పష్టమైన సందేశాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు పంపిస్తున్నారు. మరోవైపు అదే పార్టీకి చెందిన కొందరు నేతలు సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీలు కావడం తమ పోరాటాన్ని నీరుగారుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర నేతలు బలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో.. బీజేపీ కింది స్థాయి నేతలు, క్యాడర్‌లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే విధంగా అమిత్‌షా ప్రసంగం ఉంటోందని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన.. తెలంగాణ బీజేపీ వర్గాలను నిరుత్సాహానికి గురిచేసిన నేపథ్యంలో.. అమిత్‌షా నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కమలనాథులు చెబుతున్నారు. టీఆర్ఎస్‌తో బీజేపీకి ఎలాంటి దోస్తీ లేదనీ, తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బలమైన ప్రత్యర్థిగానే కమలం పార్టీ పోరాటం చేస్తోందనీ కాషాయదళం అంటోంది.‌ ఇదే మెసేజ్‌ను అమిత్ షా ద్వారా ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి పంపాలనుకుంటున్నట్లు కమలనాథులు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో అమిత్ ప్ర‌సంగంపై అంత‌టా ఆస‌క్తి ఏర్ప‌డింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp