Yanamala Rama Krishnudu - పచ్చపాత దృష్టికి శ్వేతపత్రం ఎందుకు?

By Aditya Oct. 18, 2021, 11:15 am IST
Yanamala Rama Krishnudu - పచ్చపాత దృష్టికి శ్వేతపత్రం ఎందుకు?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ విఫలం అయిందని చెబుతున్న మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఇక అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేయడం ఎందుకో. నలభై ఏళ్ల తన రాజకీయ అనుభవంలో ఏ ప్రభుత్వం ఇంతగా విఫలం కావడం తాను చూడలేదని చెప్పిన ఆయన ఏ ప్రాతిపదికన ఆ నిర్ణయానికి వచ్చారో వివరించి ఉంటే బాగుండేది. ఆదివారం తునిలో విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై వాస్తవ విరుద్ధమైన విమర్శలు చేశారు. రాజకీయ అనుభవమే కాక ఆర్థికమంత్రిగా కూడా పనిచేసిన యనమల తమ పార్టీ పాలనలో అభివృద్ధికి సంబంధించి ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారో చెప్పి ఉంటే జనం సంతోషించేవారు. పోనీ తెలుగుదేశం పార్టీ పాలనకు, వైఎస్సార్‌ సీపీ రెండున్నరేళ్ల పాలనకు అయినా పోలిక చూపించి విమర్శలు చేస్తే జనానికి ఆయన చెప్పేదేమిటో అర్థమయ్యేది. అలాకాకుండా ప్రభుత్వంపై బురద జల్లాలని ఒక నిర్ణయానికి వచ్చేసి, ఇష్టానుసారం మాట్లాడేసి శ్వేతపత్రం అంటూ డిమాండ్‌ ఎందుకు.?

మూడు రంగాల్లోనా? అన్ని రంగాల్లోనా?

అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలం అయిందని చెప్పి మళ్లీ కాసేపటికే విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉందన్నారు. పోనీ అది నిజమే అనుకుందామన్నా అందుకు సంబంధించిన సమాచారమైనా చెప్పలేదు. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం విఫలం అయిందంటున్న యనమల తన కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని పచ్చపాత దృష్టితో చూడలేకపోతున్నారా?

మూడు రంగాల్లో ప్రగతి ఇదీ..

నాడు- నేడు పథకం కింద రూ.16,025 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడులను కార్పోరేట్ విద్యాలయాలను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నది కనిపించడం లేదా? మొదటి దశలో రూ.3,669 కోట్ల ఖర్చుతో 15,715 పాఠశాలలను ఆధునీకరించి ఈ విద్యాసంవత్సరంలోనే అంకితం ఇచ్చిన సంగతి తెలియదా? ఇది అభివృద్ధి కాదా? అమ్మ ఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, విద్యా వసతి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలియదా? ఈ చర్యల వల్ల గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే సర్కారు బడుల్లో 7.84 లక్షల చేరికలు పెరిగాయన్నది విద్యాశాఖ రికార్డులు చెబుతున్న లెక్క.

Also Read : Power Crisis విద్యుత్ సంక్షోభం, విపక్ష టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటీ

నాడు- నేడు పథకంలోనే ఆస్పత్రులను ఆధునీకరించడం, సౌకర్యాలు మెరుగుపరచడం చూడలేదా? డాక్టర్‌ పోస్టులను భర్తీ చేసిన సంగతీ తెలియదా? కోవిడ్‌తో పాటు పలు రోగాలను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చి వైద్యం ఉచితంగా అందించడం వెనకబడిపోవడమా? దేశంలోనే కోవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న విషయం కనిపించదా? ఈ సర్కారు అధికారంలోకి రావడంతోనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు 1.50 లక్షల మంది పర్మినెంట్‌ ఉద్యోగులను,  2.50 లక్షల వలంటీర్లను నియమించింది. జాబ్‌ కేలండర్‌ ప్రకటించి ఖచ్చితంగా శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. ఇవన్నీ 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అన్ని చెప్పుకొనే యనమలకు కనిపించవు.

అప్పుల గురించి తమరే చెప్పాలి.

విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చడమే గాక, తాము పరిమితికి మించి పరపతి ఉన్న చోటల్లా అప్పులు తెచ్చామని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి ఇక అప్పు ఎక్కడా పుట్టదని అప్పట్లో యనమల జబ్బలు చరుచుకున్నారు. ఇప్పుడు సర్కారు అప్పులు చేస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు. అప్పు తెచ్చిన ప్రతి రూపాయికి నిక్కచ్చిగా లెక్క చూపుతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేముందు తమ హయాంలో అప్పులు చేయడం విషయంలో కాని, వాటి ఖర్చు అంశంలో కాని ఎంత పారదర్శకంగా వ్యవహరించారో గుర్తు లేదా? రూ.93,000 కోట్లు ఉన్న అప్పును ఐదేళ్లలో రూ.రెండున్నర లక్షల కోట్లకు పెంచేసి అప్పుడే ఆవిర్భవించిన రాష్ట్రంపై పెనుభారం మోపారు. కరోనా కాలంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. టీడీపీ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తుంటే ఆర్థిక మంత్రిగా అన్నేళ్ల అనుభవం ఉన్న యనమల ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేయడం రాజకీయం కాక మరేమిటి?

శ్వేతపత్రం ఎందుకు.. సమాచార హక్కు చట్టం చాలదా?

రెండున్నరేళ్లలో వివిధ పథకాల సొమ్ము దాదాపు రూ.లక్షా 15 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా జమ అయింది. ఒక్క వర్షానికే కొట్టుకుపోయే రోడ్డు వేయడమే అభివృద్ధా? బడులు, ఆస్పత్రులు, పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించడం అభివృద్ధి కాక మరేమిటి? ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది. కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇక అభివృద్ధిపై శ్వేతపత్రంతో పనేముంది?

Also Read : Power Cuts - కరెంటు పేరుతో విపక్షం కోతలు, విస్మయంతో సామాన్యులు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp