రాష్ట్రపతి పాలన ఆలోచన టీడీపీ నేతల్లో ఎందుకు మొదలయ్యింది..

By Raju VS Jan. 24, 2021, 11:31 am IST
రాష్ట్రపతి పాలన ఆలోచన టీడీపీ నేతల్లో ఎందుకు మొదలయ్యింది..

తెలుగుదేశం నేతలు చాలాకాలంగా కలలు కంటున్నారు. ప్రజలు తమను అధికారానికి దూరం చేసిన తర్వాత దొడ్డిదారిన మళ్ళీ పీఠం ఎక్కాలనే ఆలోచన వారికి ఈనాటిది కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లకే ఆయన మళ్లీ జైలుకి పోతారంటూ విస్తృత్తంగా ప్రచారం చేశారు. జగన్ తర్వాత ఎవరు అంటూ పచ్చ పత్రికల్లో కథనాలు కూడా రాసేశారు. కొందరు మంత్రులు ముఠాలు కడుతున్నారని కథలు అల్లారు. సీన్ కట్ చేస్తే టీడీపీ ఆశలకు, వాస్తవానికి పొంతనలేదని తేలిపోయింది.

ఆ తర్వాత ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా చేయాలని కూడా అడ్డుపుల్లలు వేశారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి సహకారం అందించకపోగా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పీపీఈ కిట్స్ లేవని నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ చేసిన హంగామా నుంచి అనేక ఎపిసోడ్స్ దానికి ఉదాహరణగా నిలుస్తాయి. టీడీపీ నేతల ప్రోద్భలంతో జరిగిన ఇలాంటి ఘటనలను అధిగమించి కరోనా ని కంట్రోల్ చేయడంలో జగన్ సర్కారు సక్సెస్ అయిన తీరుకి ప్రపంచమంతా ప్రశంసలు దక్కాయి.

తాజాగా ఆలయాల్లో దుశ్చర్యలకు పాల్పడుతూ, వాటిని ప్రభుత్వానికి ఆపాదించే పనిని జోరుగా సాగించారు. చివరకు సంతబొమ్మాళిలో సీసీ కెమెరాల సాక్షిగా, సింగరాయకొండలో పాత విజువల్స్ సాక్షిగా పట్టుబడ్డారు. నేరుగా టీడీపీ నేతలు, అందులోనూ అచ్చెన్నాయుడి వంటి వారి అనుచరులు కూడా దొరికిన ఘటనలతో రామతీర్థం వంటి ఘటనల్లో వారి పాత్ర మీద పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఈ పరిస్థితుల్లో మత విద్వేషాలు కూడా రాజేసి రాష్ట్రంలో విభజన రాజకీయాలకు పూనుకున్నారు.

ఎన్ని జిమ్మిక్కులు, ఎంతగా దుష్ప్రచారం, ఎన్ని కుట్రలు పన్నినా పారకపోయినా టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదు. తమకు గిట్టని ప్రభుత్వాన్ని అడ్డుకోవడం, ప్రజాసంక్షేమాన్ని కాలరాయడమే ధ్యేయంగా సాగుతున్నారు. రానురాను జనంలో జగన్ కి పెరుగుతున్న ఆదరణను జీర్ణం చేసుకోలేని స్థితికి చేరుతున్నారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు వస్తాయని నిన్నటి వరకూ జోస్యాలు చెప్పుకుంటూ తమ పార్టీ శ్రేణులను కాపాడుకునే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా రాజ్యాంగ సంక్షోభం, రాష్ట్రపతి పాలనా అంటూ కొత్త ఉపదేశాలు మొదలెట్టేశారు.

రాష్ట్రపతిపాలన ఏ పరిస్థితుల్లో పెడతారు.. ఎందుకు పెడతారన్నది తెలిసి కూడా యనమల వంటి వారి వ్యాఖ్యానాలు విడ్డూరంగా కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. సామరస్య పూర్వంగా సంప్రదింపులతో ప్రభుత్వం, ఎస్ఈసీ వ్యవహరించాలని కోర్టు ఇచ్చిన తీర్పుని పాటించాలని చెబుతోంది. వ్యాక్సిన్, ఎన్నికలు రెండిట్లో ఒక్కదానికే ఆస్కారం ఉందని చాటుతోంది. సుప్రీంకోర్టు ఏది నిర్వహించమని చెబితే దానికే పూనుకుంటామని అంటోంది. అయినప్పటికీ మొండితనంతో, చంద్రబాబు రాజకీయ లక్ష్యాల కోసం నిమ్మగడ్డ వేస్తున్న ఎత్తులతో రాష్ట్రపతిపాలన వస్తుందని టీడీపీ నేతల ఊహలు హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.

ఏడాది క్రితమే ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుబట్టింది. కానీ నాడు వద్దని, నేడు ముద్దని అంటున్న టీడీపీ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థం అయి తీరుతుందనడంలో సందేహం లేదు. కానీ ప్రజలను పక్కదారి పట్టించేలా ఆర్టికల్ 356ని ప్రస్తావించడం టీడీపీ నేతల ఉద్దేశాన్ని చాటుతోంది. నిమ్మగడ్డ ద్వారా వివాదం రాజేసి, ఆ తర్వాత దానిని సాకుగా చూపించి ఇలాంటివి ప్రస్తావిస్తున్నట్టు కనిపిస్తోంది. తామే తగాదా పెట్టడం, మళ్లీ ఏదో జరిగిపోతోదంటూ గగ్గోలు పెట్టడం టీడీపీ అలవాటుగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆచరణలో అంత సీన్ లేదని ఆపార్టీకి ఎప్పటికి అర్థమయ్యేనో మరి...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp