Trs kcr - డామిట్.. కథ అడ్డం తిరిగింది -టీఆరెస్ సర్కారుకు షాకిచ్చిన రైతునేత తికాయత్

By Ramana.Damara Singh Nov. 25, 2021, 08:00 pm IST
Trs kcr - డామిట్.. కథ అడ్డం తిరిగింది  -టీఆరెస్ సర్కారుకు షాకిచ్చిన రైతునేత తికాయత్

కొన్ని రోజులుగా తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సాగునీటి సమస్యలు, ఇతర అంశాలపై ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించాలని ఎదురు చూశారు. దానికి కొద్దిరోజుల ముందు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు ప్రకటిస్తూ కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాగా ఆయన ఢిల్లీలో ఉండగానే.. హైదరాబాద్ లో జరిగిన రైతుల ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ తికాయత్ కేసీఆర్ పై దుమ్మెత్తి పోయడం విశేషం. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కేసీఆర్ ను బీజేపీ మిత్రుడిగా తికాయత్ అభివర్ణించారు. దాంతో రైతుల విశ్వాసాన్ని కేసీఆర్ పొందలేకపోయారని స్పష్టం అవుతోంది.

రైతు ఉద్యమం ద్వారా జాతీయ స్థాయికి వెళ్లాలని ప్లాన్..

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పలు ఆంక్షలు విధించడంపై పది రోజుల క్రితం సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పు పట్టారు. పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరుపుతూ.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి మాత్రం ఆంక్షలు విధించడమేమిటని కేంద్రాన్ని నిలదీశారు. ఇదే సందర్భగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. వారి తరఫున పోరాడతామని, పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని, ఉద్యమాన్ని ఎక్కడికో తీసుకెళతామని ప్రకటించారు. ఇందిరా పార్కు వద్ద స్వయంగా ధర్నా చేసి.. కేంద్రానికి 48 గంటల డెడ్ లైన్ కూడా విధించారు.

సదరు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించడంపై స్పందిస్తూ ఉద్యమంలో, లఖిమ్ పూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉద్యమంలో మరణించిన 700కు పైగా రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. అలాగే ఆ కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. జాతీయస్థాయి రాజకీయాల్లో క్రియాశీలం కావాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న కేసీఆర్ రైతులకు మద్దతు ఇవ్వడం ద్వారా.. వారి సానుభూతి పొంది జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యర్థిగా పేరు పొందాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపించింది.

వ్యూహం బెడిసికొట్టిందా?

కేసీఆర్ ఒకలా అనుకుంటే.. పరిణామాలు మరోలా మారాయి. ఢిల్లీ రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేష్ తికాయత్ తెలంగాణ గడ్డ మీదే కేసీఆర్ గాలి తీసేశారు. రైతు ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడి నుంచే ఓ పార్టీ మద్దతు లభిస్తోందని వ్యాఖ్యానించారు. దాన్ని ఇక్కడే అదుపు చేయాలన్నారు. రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అని ఆరోపించారు. బీజేపీకి ఏ టీమ్, బీ టీమ్ ల పనిచేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ఉద్యమంలో చనిపోయిన రైతులకు తెరాస ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల పరిహారం తెలంగాణ రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తికాయత్ వ్యాఖ్యలతో కేసీఆర్ ఒకలా అనుకుంటే.. పరిణామాలు మరోలా మారాయి. ఆయన రైతుల విశ్వాసం పొందలేకపోయారని స్పష్టం అవుతోంది.

Also Read : Ap Farm Policy - సాగు చట్టాల కన్నా ఏపీ వ్యవసాయ విధానమే భేష్‌ విత్తనం నుంచి కొనుగోలు వరకు భరోసా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp