రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఎందుకు సైలెంటయ్యారు..?

By Jaswanth.T Jun. 13, 2021, 10:00 am IST
రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఎందుకు సైలెంటయ్యారు..?

రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందిన పెందుర్తి వేంకటేష్‌ ఆచూకీ ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలకు లభించడం లేదంటున్నారు అక్కడి ప్రజలు. 2009, 2014లో ఎమ్మెల్యేగా పనిచేసిన వేంకటేష్, 2019లో ఓటమి తరువాత నియోజకవర్గానికి దూరమయ్యారంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సైలెంట్‌గా ఉండడం రాజకీయాల్లో సహజం. కానీ అలా సైలెంట్‌గా ఉన్నప్పటికీ తనను నమ్ముకున్న కార్యకర్తలకు టచ్‌లో ఉంటూ జనంలో తమ పట్టును కోల్పోకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే వేంకటేష్‌ ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటున్నారక్కడివారు. ఆది నుంచీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన ఆయన ప్రస్తుతం హైదరాబాదులోనా? బెంగళూరులోనా? ఎక్కడున్నారో కూడా కార్యకర్తల వద్దకూడా సమాచారం లేకపోవడం గమనార్హం.

ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామమాత్రంగానే పాల్గొన్నారంటున్నారు. అడపాదడపా ప్రచారానికి హాజరు కావడం తప్పితే మొత్తం బాధ్యతను ఆయా గ్రామాల్లోని నాయకులమీదే వదిలేసారంటున్నారు. ఆయా ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడానికి నాయకత్వ లోపమే కారణమనే వారు కూడా లేకపోలేదు. 2004 ఎన్నికల్లో వేంకటేష్‌ భార్య అన్నపూర్ణ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన చిట్టూరి రవీంద్ర చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి తరువాత నియోజకవర్గంలో వేంకటేష్‌ విస్తృతంగా పర్యటించారు. ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా స్వయంగా హాజరై జనంతో మమేకమయ్యారు. దీని ప్రభావం 2009, 2014 ఎన్నికల్లో పనిచేసి, ఆయన గెలుపునకు బాటలు వేసిందని చెబుతారు. అయితే వరుసగా రెండు సార్లు గెలివడం తనదైన ప్రత్యేక కోటరీకే వేంకటేష్‌ పరిమితయ్యారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. జనానికి దూరం కావడం వల్లనే 2019లో 30వేలకుపైగా భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.

ఎన్టీరామారావు హయాంలో 1983, 85లో వేంకటేష్‌ కుటుంబానికే చెందిన పెందుర్తి సాంబశివరావు ఎమ్మెల్యేగా పనిచేసారు. అయితే 1989లో సాంబశివరావు ఓటమితో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా వేంకటేష్‌ వెలుగులోకొచ్చారు. కానీ 2009లో వేంకటేష్‌ భార్య అన్నపూర్ణ ఓటమితోనే రాజకీయ జీవితం ప్రారంభమైందని చెబుతుంటారు. ఆ తరువాత వేంకటేష్‌ తనదైన వ్యూహాలతో విజయం బాట పట్టారు. కానీ ఆ విజయాలను నిలబెట్టుకోలేకపోయారని ఆయన వర్గీయులే అంగీకరిస్తుంటారు.

2019లో ఓటమి తరువాత ఇసుక ఆందోళనల్లో ఒకటి రెండు సార్లు పాల్గొనడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుపుతీగ మాదిరిగా కన్పించడం మినహా జనంతో మమేకయ్యే కార్యక్రమాలేవీ వేంకటేష్‌ నుంచి లేవని టీడీపీ నేతలే వాపోతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్న వేంకటేష్‌ ప్రస్తుతం తన సమయాన్నంతా వ్యాపారాలపైనే పెట్టారని చెబుతున్నారు. దీని కారణంగానే నియోజకవర్గంలో కార్యకలాపాలకు విరామం ప్రకటించారంటున్నారు. ఎంతగా జనజీవనానికి దూరంగా ఉంటున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో తోటి నాయకులు కనీసం సోషల్‌ మీడియాలో అయినా కన్పిస్తున్నారు. కానీ వేంకటేష్‌ ఆ విధంగా కూడా చేయకపోవడం విమర్శకులకు పనిచెబుతోంది. ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చి కూడా దాదాపు అర్నెల్లకుపైనే అవుతోందని ఆ పార్టీ నాయకులే గుర్తు చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే రాజానగరం నియోజకవర్గంలో జనం టీడీపీకి మరింత దూరం అవుతారన్న భావన వ్యక్తమవుతోంది. ఇకపైనేనా వేంకటేష్‌ జనంలోకొస్తారేమో వేచి చూడాలి.

Also Read : కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు భవిష్యత్తేమిటో..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp