సెకండ్ వేవ్ సైలెంట్ అయ్యేలా చేసింది

By Jaswanth.T Jun. 06, 2021, 10:30 am IST
సెకండ్ వేవ్ సైలెంట్ అయ్యేలా చేసింది

రెండో విడత నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి పుట్టెడు కష్టాలే ఎదురవుతున్నాయి. కారణాలేమైనాగానీ ప్రకృతి కూడా మోడీమీద పగబట్టినట్టే కన్పిస్తోంది. కరోనా సెకెండ్‌వేవ్‌ రూపంలో ముంచుకొచ్చేసింది. మొదటి వేవ్‌ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో స్వరం పెంచిన మోడీ కొంచెం అతి ఆత్మవిశ్వాసాన్నే ప్రదర్శించారని చెప్పాలి. ఇది ఎంతగానంటే ప్రపంచం మొత్తానికి మనం మాత్రమే వాక్సిన్‌ సరఫరా చేయగలం అని చెప్పగలిగేటంతటి స్థాయికి చేరిపోయింది.

అయితే సెకెండ్‌ వేవ్‌ తీవ్రత ఆ స్వరాలన్నింటినీ మూగబోయే విధంగా మార్చేసింది. ఆఖరికి దేశంలో ఉన్న ప్రజలకు కూడా వాక్సిన్‌ పూర్తిస్థాయిలో ఎప్పటికి అందజేస్తారో అర్ధంకాని అనిశ్చిత పరిస్థితిని తీసుకువచ్చింది. దీంతో ముందు చెప్పిన మాటలను అందరి రాజకీయ నాయకుల మాదిరిగానే మోడీ కూడా మర్చిపోయారు. జరిగిపోతున్న నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ప్రశ్నలకు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సిన్‌ విషయంలో నేరుగానే విమర్శకులకు దొరికిపోతున్నారు. అనుచరగణం ఎంతగా కవర్‌ చేయాలని చూస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులను స్వయంగా అనుభవిస్తున్న ప్రజలు వాటిని నమ్మేపరిస్థితుల్లో ఉండడం లేదు. తమ స్వీయ శక్తిని పరీక్షించుకునే నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఇటీవలే వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిసామర్ధ్యంతో పనిచేయించింది. దీంతో ఒక్క రోజులోనే ఆరులక్షల ముప్పైతొమ్మిదివేల మందికి టీకాలు వేయగలిగింది. అంటే రోజుకు ఆరులక్షల మందికిపైగా వాక్సిన్‌ అందించగలిగే సత్తా ఏపీ ప్రభుత్వానికి ఉందని తేలింది. అయితే ఆ స్థాయిలో కేంద్రం నుంచి మాత్రం వాక్సిన్‌ల సరఫరా ఉండడం లేదు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సైతం తమతమ శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకుని విస్తృత టీకా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సిద్ధంగానే ఉన్నాయి. ఆ మేరకు కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్‌ కోటా కోసం ఎదురు చూస్తున్నాయి. ‘‘ఇప్పటి వరకు ఏపీలో వేసిన కోటి వాక్సిన్‌లను ఉచితంగా అందించిన మోడీకి కృతజ్ఞతలు’’ అంటే మోడీ భక్తులు తమ స్వామి భక్తిని ప్రదర్శించుకునే ప్రయత్నం సోషల్‌ మీడియ ఆవేదికగా చేయప్రయత్నాలు చేసారు. అయితే ప్రజల డిమాండ్‌కు తగ్గట్టుగా టీకాలు అందించండి అంటూ అదే వేదికపై విమర్శలు గుప్పుమనిపోవడంతో భక్తుల భక్తి వెలుగులోకి రాలేకపోయింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు టీకాల కోసం ఎదురు చూడాల్సి రావడం ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితే. నిజానికి దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఇది సంభవమే అనుకున్నప్పటికీ ముందు చేసిన అతి కారణంగానే ఇప్పుడు విమర్శల దాడి కూడా ఎక్కువగానే ఉందని ఒప్పుకోవాల్సి వస్తోంది. పోనీ ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని వివరించి, దానిని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలనైనా నిజాయితీగా ప్రజల ముందుకు తెస్తున్నారా? అంటే సరైన సమాధానమే కరువవుతోంది. దేశంలోని అన్ని కంపెనీలు కలిసి నెలకు రమారమి ఎనిది కోట్ల వరకు వాక్సిన్లు ఉత్పత్తి చేసే సమార్ధ్యం కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన దేశంలోని 139 కోట్లకుపైగా ఉన్న జనాభాకు ఎప్పటికీ వాక్సినేషన్‌ పూర్తి చేస్తారు? అన్న సూటి ప్రశ్నకు ఠక్కుమన్న సమాధానం కేంద్రం నుంచి విన్పించడం లేదు.

ఒక పక్క కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే శ్రీరామరక్ష అంటూ నిపుణులు హోరెత్తిస్తున్నారు. డిమాండుకు తగ్గ రీతిలో టీకాలు అందుబాటులోకి రావడం లేదు. ఇటువంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ టీకా పరీక్షను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. నియంత్రణ కేంద్రం చేతుల్లో పెట్టుకుని, టీకాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులను ఏర్పరచడం పట్ల మెల్లమెల్లగా ఒక్కో రాష్ట్రం తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సర్జికల్‌ స్రై్టక్స్‌.. మోడీ మానియా.. దేశంకోసం ధర్మకోసం.. ఇలా ఆపద్ధర్మ ఫార్ములాలు ఎన్ని ఉన్నా ప్రజల నుంచి ఎదురయ్యే అసంతృప్తి నుంచి అడ్డుకోలేకపోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp