ఒవైసి చూపు ఆంధ్రా మీదికి ఎందుకు మళ్లింది?

By Mavuri S Mar. 07, 2021, 10:00 am IST
ఒవైసి చూపు ఆంధ్రా మీదికి ఎందుకు మళ్లింది?

హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసినా మజ్లీస్ పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు విస్తరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర,బీహార్ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు గెలుచుకుని, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ ఉనికిని చాటుకున్న మజ్లిస్ పార్టీ ఇప్పుడు తన దృష్టిని ఆంధ్ర ప్రదేశ్ మీద పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సై అంటుంది.

ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట
మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మజ్లిస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం కర్నూలు జిల్లా ఆదోని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పార్టీ తరఫున అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరికి వస్తుండడంతో మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ముఖ్యంగా ముస్లింల ఐక్యత మీద ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీంతోపాటు భారతీయ జనతా పార్టీ మీద వాడివేడి విమర్శలకు దిగుతున్నారు.

ఫలితాలు చూసి..
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రస్తుతం తాము నిలబెట్టిన అభ్యర్థులు ఎంతమేర ఎన్నికల్లో సఫలీకృతం అవుతారు చూసి తదుపరి కార్యాచరణ ఉంటుందని మజ్లిస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తే కనుక పార్టీని విస్తరించి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సైతం కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు మజ్లిస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేకమైన అసెంబ్లీ స్థానాలను మజ్లిస్ పార్టీ గుర్తించింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు పశ్చిమ ప్రాంతం, కృష్ణ, గుంటూరు జిల్లా ల మీద ప్రధానంగా మజ్లిస్ పార్టీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

బీజేపీ,ఎంఐఎం సమాంతరంగా ...
గత ఐదు సంవత్సరాల్లో వివిధ రాస్తర్లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసిన ప్రతి చోట బీజేపీ అధికారంలోకి రావటంతో మైనారిటీ ఓట్లను చీలిక తీసుకొని రావటం,మెజారిటీ ఓట్లు బీజేపీ కి అనుకూలంగా పోలరైజ్ కావటానికి ఎంఐఎం దోహదం చేస్తుందని రాజకీయ విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను ఎంఐఎం ఖండించినా, ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉండటంతో ఎంఐఎం మీద విమర్శలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం బలహీనపడటం,అంతర్గత కుమ్ములాటలతో దెబ్బతినటం ,అనేక మంది టీడీపీ నేతలు బీజేపీలో చేరటం తదితర కారణాలతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ హంగామా చేస్తుంది. 2024 నాటికి తాము బలమైన శక్తిగా అవతరిస్తామన్న ధీమా కనిపిస్తుంది. అటు బీజేపి ఇటు ఎంఐఎం ప్రయత్నాలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వాతావరం కొంచం వేడెక్కటం ఖాయం.
అయితే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఆధారంగానే మజ్లిస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలన్న కార్యాచరణను రూపొందించుకునే అవకాశం కనిపిస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp