తేజ‌రాజుకు, కేటీఆర్ కు లింకేంటి? ఇప్పుడు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు దేనికి?

By Kalyan.S Jul. 29, 2021, 09:15 pm IST
తేజ‌రాజుకు, కేటీఆర్ కు లింకేంటి? ఇప్పుడు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు దేనికి?

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెలుపెవ‌రిది? దీనిపై కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఓ స‌ర్వే జ‌రిపించార‌ట‌. ఆ స‌ర్వేలో ఈట‌ల రాజేంద‌ర్ కు 67 శాతం, టీఆర్ఎస్ కు 30 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని త‌మ పార్టీకి కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ఓట్లు రానున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే, ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ ఓ పేరు అనూహ్యంగా తెర‌పైకి తెచ్చారు. ఆయ‌నే స‌త్యం రామ‌లింగ‌రాజు కుమారుడు తేజ‌రాజు. ఉప ఎన్నిక రాజ‌కీయాల సంద‌ర్భంగా ఆయ‌న‌పై కూడా వెంక‌ట్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక వ్యూహం అంతుచిక్క‌డం లేదు. తెలంగాణ పాల‌న ప్ర‌స్తుతం ఆయ‌న చేతుల్లో ఉంద‌ని ఈ సంద‌ర్భంగా వెంక‌ట్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు దేనికి సంకేత‌మ‌నే చ‌ర్చ తెలంగాణ‌లో జ‌రుగుతోంది.

తేజ రాజు మంత్రి కేటీఆర్ కు స్నేహితుడ‌ని, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే రాష్ట్ర వ్య‌వ‌హారాలు జ‌రుగుతున్నాయ‌ని కోమ‌టిరెడ్డి తాజాగా పేర్కొన్నారు. అయితే, గ‌తంలో మ‌రో కాంగ్రెస్ నేత మ‌ధుయాష్కీ కూడా కేటీఆర్ కు, తేజ‌రాజుకు ఉన్న ఆర్థిక సంబంధాల‌పై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తాజాగా మ‌రోసారి ఆ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజుతో కలిసి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని, తేజారాజు భార్య కాల్ హెల్త్ అనే స్టార్టప్ కంపెనీని కంపెనీలోకి కేటీఆర్ అక్ర‌మ సంపాద‌నను పెట్టుబ‌డులు పెడుతూ విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని నాలుగేళ్ల క్రితం వెల్ల‌డించారు. అలాగే తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ప్రాజెక్టుల‌ను తేజరాజుకు కేటీఆర్ అక్ర‌మంగా అందిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వెల్లువెత్తాయి. వరంగల్‌లో మిషన్‌ భగీరథ కింద 700 కోట్ల కాంట్రాక్టును తేజరాజు కంపెనీకి ఇచ్చారని మ‌ధుయాష్కీ ఆ సంద‌ర్భంగా వెలుగులోకి తెచ్చారు. అయితే, ఆరోప‌ణ‌ల‌పై కేటీఆర్ స్పందించ లేదు.

ప్ర‌స్తుతం కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. స‌త్యం రామ‌లింగ‌రాజు కుమారుడు తేజ‌రాజు రియ‌ల్ ఎస్టేట్‌, ప‌లు కంపెనీల‌కు వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్నారు. సత్యం కంప్యూట‌ర్స్ స్కాంలో రామలింగరాజుతో పాటు ఆయన కుమారుడు తేజారాజుపైనా కేసులు న‌మోద‌య్యాయి. మేటాస్‌ హిల్‌ కౌంటీ కంపెనీకి సీఈఓ ఆయ‌నే. మైటాస్‌ హిల్‌ కౌంటీ పేరుతో ఇళ్ల నిర్మాణాం చేస్తానని చేప్పి మోసం చేశారని ఆయ‌న‌పై గ‌తంలో ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కోట్ల రూపాయలను తీసుకున్న త‌ర్వాత సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయలేద‌ని ప‌లువురు బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదులు చేశారు. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును వాస్త‌వానికి మొద‌ట చేజిక్కించుకున్న‌ది మేటాస్ కంపెనీయే. స‌త్యం కంప్యూట‌ర్స్ స్కాం బ‌య‌ట‌ప‌డ‌డం, ఆ స్కాం డ‌బ్బులు మేటాస్ కు త‌ర‌లించార‌ని ఆరోప‌ణ‌లు నేప‌థ్యంలో మెట్రో ప్రాజెక్టు నుంచి మేటాస్ ను తొల‌గించారు.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేటీఆర్ కు మిత్రుడైన తేజ‌రాజు ప‌లు కాంట్రాక్ట్ లు చేజిక్కించుకున్న‌ట్లు కాంగ్రెస్  నేతలు గ‌తంలో ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ పాల‌నే ఆయ‌న చేతుల్లో ఉందంటూ కోమ‌ట్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అస‌లు కేటీఆర్ కు, తేజ‌రాజుకు లింకేంటి? కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల వెనుక వాస్త‌వం ఎంత‌? అనేది తెలియాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp