Chandrababu, OTS - ఓటీఎస్‌పై బాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు..?

By Aditya Dec. 06, 2021, 08:45 pm IST
Chandrababu, OTS - ఓటీఎస్‌పై బాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు..?

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తన రాద్ధాంతం కొనసాగిస్తున్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) అంటేనే కాల్ మనీ అంటూ చంద్రబాబు వింతగా నిర్వచించారు కూడా. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. పేదలతో బలవంతంగా కట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ సర్కార్ తెచ్చింది.. ఇళ్లకు ఓటీఎస్ కాదని పేదల మెడకు ఉరితాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చి నేడు మాట తప్పారు, మడమ తిప్పారు అని చంద్రబాబు ఊగిపోయారు.

పదే పదే అవే ఆరోపణలు

చంద్రబాబు, పచ్చ మీడియా ఒక పథకం ప్రకారం ఓటీఎస్‌పై చేస్తున్న దుష్ప్రచారం చూస్తే పరవస్తు చిన్నయసూరి రాసిన కథ గుర్తుకొస్తుంది. ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయడానికి కొనుగోలు చేసి తీసుకెళుతున్న మేకను కాజేయాలనే ఉద్దేశంతో నలుగురు అతడిని మోసగిస్తారు. అతడు తీసుకెళుతున్నది మేక కాదని కుక్క అని ఒకరి తర్వాత ఒకరు పదే పదే చెబుతారు. దీంతో తాను పొరబాటున మేకకు బదులు కుక్కను కొన్నాను అని భావించి ఆ బ్రాహ్మణుడు ఆ మేకను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఆ మోసగాళ్లు మేకను పట్టుకుపోతారు. ‘పదగురాడు మాట పాడియై ధర చెల్లు’ అన్న విషయాన్ని చెప్పడానికి చిన్నయసూరి ఈ కథ రాశారు. అచ్చం అలాగే పదే పదే ఒక అబద్ధాన్ని వల్లిస్తే జనం నమ్మేస్తారనేది పచ్చబ్యాచ్‌ థియరీ. అందుకే ఏదో ఒక అవాస్తవాన్ని పట్టుకొని పచ్చ మీడియాలో కొన్నాళ్లపాటు రచ్చ రచ్చ చేస్తుంటారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని ఒకసారి, డ్రగ్స్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ మారిపోయిందని మరోసారి, ఇప్పుడు ఓటీఎస్‌పై దుష్ప్రచారం. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి మంచి పనులు చేసిన క్రెడిట్‌ రాకుండా చేయడమే పచ్చబ్యాచ్‌ ఉద్దేశమని జనానికి అర్థమైంది. అయినా వీరు తీరు మార్చుకోవడం లేదు. పైగా ఓటీఎస్‌ అంటేనే కాల్‌మనీ అని వ్యాఖ్యానించి చంద్రబాబు తన అసహనాన్ని బయట పెట్టుకున్నారు.

Also Read : TDP, OTP Scheme, Chandrababu - ఓటీఎస్‌కు ఆటంకాలు రాబోతున్నాయా..? చంద్రబాబు వ్యాఖ్యల ఆంతర్యమేమిటి..?

స్వచ్ఛందమని చెబుతున్నా..

ఓటీఎస్‌ అనేది లబ్ధిదారులకు వారి ఇళ్లపై సంపూర్ణ హక్కు కల్పించడానికి ఉద్ధేశించిన పథకమని, ఇది పూర్తిగా స్వచ్ఛందమని ప్రభుత్వం ఎన్నిసార్లు వివరిస్తున్నా పేదలను దోచేస్తున్నారంటూ చంద్రబాబు యాగీ చేస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని.. లేదంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా ఇళ్లు, రిజిస్ట్రేషన్ చేయిస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇప్పుడు ఉచిత హామీలు ఇచ్చేస్తున్న చంద్రబాబు మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో కనీసం పేదల ఇంటి రుణాలపై వడ్డీని ఎందుకు మాఫీ చేయలేదని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పడం లేదు. పేదలపై ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే తన హయాంలో అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా మాట్లాడడం లేదు.

తమరిపై ఎన్ని కేసులు పెట్టాలి?

ఉచిత ఆరోగ్యం అందిస్తామని మాట తప్పినందుకు జగన్ మీద ఛీటింగ్ కేసు పెట్టాలంటున్న చంద్రబాబు వ్యాఖ్య మరీ ఘోరం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 90 శాతం మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి, వైద్య ఖర్చు పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన ముఖ్యమంత్రి జగన్‌పై ఈ తరహా అవాస్తవ ఆరోపణలు చేయడం రాజకీయం కాక మరేమిటని సామాన్యులే ఆశ్చర్యపోతున్నారు. ఉచిత ఆరోగ్యం అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎంపై దుష్ప్రచారం చేయడమే కాక ఛీటింగ్ కేసు పెట్టాలనడం ఏమిటో? ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో 630 హామీలను టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొని, జనంలో ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించారు. పైగా మేనిఫెస్టోను ఎవరూ గుర్తు చేయకుండా ఉండడం కోసం పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు కూడా. మరి ఇంత మోసం చేసిన చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా ప్రజాదరణ పొందడానికి ప్రయత్నాలు చేయాలి గానీ వారిని తప్పుదోవ పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేస్తే వారు గమనించరా? పార్టీ గ్రాఫ్‌ జనంలో వేగంగా పడిపోతున్నా పట్టించుకోకుండా ఇలా కాలం చెల్లిన రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీకే నష్టం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read : Andhra Jyothi, Chandrababu - బాబు చేసిన నష్టానికి ఆంధ్రజ్యోతి ప్యాచ్‌వర్క్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp