Financial Experts - కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికవేత్తలు ఎందుకు వెళ్లిపోతున్నారు?

By Ramana.Damara Singh Oct. 24, 2021, 08:25 pm IST
Financial Experts - కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికవేత్తలు ఎందుకు వెళ్లిపోతున్నారు?

ఎన్నికల ద్వారా యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర పాలనా పగ్గాలు చేపట్టి ఏడున్నరేళ్లు అయ్యింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2014లో మ్యాజిక్ ఫిగర్ సాధించిన నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ .. 2019 ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలు సాధించింది. 300కుపైగా స్థానాలు గెలుచుకుని మరోసారి సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. అయితే సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ రెండోసారీ మోదీ ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా ఏడున్నరేళ్లుగా ఎదురులేకుండా పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వంలో ఆర్థికవేత్తలు, నిపుణులు మనుగడ సాగించలేకపోతున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడున్నరేళ్లలో దాదాపు పదిమంది ఆర్థిక నిపుణులు రాజీనామాలు చేసి వెళ్లిపోవడం గమనార్హం.

పదవీకాలానికి ముందే కొందరు వెళ్లిపోగా.. వారిలో ప్రభుత్వం ఏరికోరీ నియమించుకున్నవారు కూడా ఉండటం విశేషం. ఆర్థికవేత్తలు సూచనలను పట్టించుకోకుండా బీజేపీ సొంత ఆర్థిక విధానాలు అనుసరిస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని ఆర్థికరంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఉన్న పళంగా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, వడ్డీ రేట్ల సవరణ, పెట్రో ధరలు పెంచుకుంటూ పోవడం, నీతీ ఆయోగ్ ఏర్పాటు, ఆర్థిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడం వంటి నిర్ణయాలు రుచించక ప్రభుత్వం నుంచి ఆర్థిక నిపుణులు వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయిన వారిలో ఇద్దరు రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు, నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు వంటి అత్యున్నత పదవులు నిర్వహించినవారు ఉన్నారు.

రఘురామ్ రాజన్ తో మొదలు

మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో విభేదించి కీలక పదవుల నుంచి ఆర్థిక నిపుణులు తప్పుకోవడం రఘురామ్ రాజన్ తో మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా నియమితుడైన రఘురామ్ రాజన్ 2014లో మోదీ ప్రభత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతూ ఆర్థికాంశాల్లో కఠినంగా ఉండేవారు. వడ్డీరేట్లు తగ్గించాలన్న ప్రభుత్వ సూచనకు అంగీకరించలేదు. ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. దాంతో విదేశాలకు మనదేశ ఆర్థిక సమాచారం లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు పుట్టించారు. దాంతో ఆయన పదవీకాలానికి ముందే 2016లో రాజీనామా చేశారు.

Also Read : Congress Membership - Rules : కాంగ్రెస్ సభ్యత్వం ఇక కష్టమే..! పాత వారి పరిస్థితేమిటీ..?

రాజన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా నియమితులయ్యారు. గుజరాత్ కు చెందిన ఈయన మోదీ మద్దతుదారుగా పేరుపొందారు. ఇతని నియామకంపై విమర్శలు కూడా వచ్చాయి. అటువంటి పటేల్ కూడా ప్రభుత్వ విధానాలతో అసంతృప్తి చెందారు. ఆర్బీఐ మిగులు నిధులను కేంద్రం అవసరాలకు ఇవ్వాలని ఆయనపై ఒత్తిడి వచ్చింది. దాంతోపాటు ఆరెస్సెస్ నేత గురుమూర్తిని ఆర్బీఐ బోర్డు సభ్యుడిగా నియమించడంతో ఉర్జిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. బ్యాంక్ స్వతంత్రతను ఇది దెబ్బతీస్తుందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదవికి రాజీనామా చేశారు.

ఉర్జిత్ స్థానంలో శక్తికాంత్ దాస్ ను రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా కేంద్రం నియమించింది. ఎంఏ హిస్టరీ చదివిన దాస్ ఆర్థికవేత్త కాదంటూ.. ఆయన నియామకంపైనా విమర్శలు చెలరేగాయి. కొంతకాలం మౌనంగా తన పని చేసుకున్న దాస్ ఇప్పుడు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మానిటరీ పాలసీపై జరిగిన సమీక్షలో పెట్రో ధరల పెరుగుదల అంశం చర్చకు వచ్చింది. పెట్రో రేట్లు తగ్గించకపోతే ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఈ సమావేశాల్లో తాను హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన బహిరంగంగానే అసంతృప్తి ప్రకటించారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు దానికి అనుగుణంగా రిటైల్ ధరలు తగ్గించకుండా పన్నులు పెంచేస్తున్నారని ఆయన విమర్శించారు.

అధికారాలు లేని నీతీ ఆయోగ్

రిజర్వ్ బ్యాంకు పరిస్థితి అలా ఉంటే.. మరో అతికీలక ప్రభుత్వ వ్యవస్థ నీతీ ఆయోగ్ విషయంలోనూ ఆర్థికవేత్తలు అసంతృప్తి చెందుతున్నారు. స్వతంత్ర భారత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని మూసేసి దాని స్థానంలో ఎన్డీయే ప్రభుత్వం నీతీ ఆయోగ్ ఏర్పాటు చేసింది. ఆ సంస్థ తొలి ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగరియాను నియమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ చేపట్టిన కార్యక్రమాలను మెచ్చుకోవడం వల్లే పనగరియాను ఆ పదవిలో నియమించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2015లో ఆ పదవి చేపట్టిన ఆయన పదవీకాలానికి ముందే 2017లో రాజీనామా చేశారు. ప్రణాళికా సంఘానికి ఉన్న అధికారాలు నీతీ ఆయోగ్ కు లేవని పనగరియా వ్యాఖ్యానించారు. దానికి ఇది ప్రత్యామ్నాయం కాజాలదని స్పష్టం చేశారు. ఇది సిఫార్సులకే పరిమితమని, కేంద్ర పెత్తనమే ఎక్కువని ఆరోపించారు. అలాగే పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించారు.

Also Read : AP Cabinet -ప్రస్తుత క్యాబినెట్ కి ఇదే చివరి సమావేశం?మంత్రివర్గ మార్పు?

ఇద్దరు ఆర్థిక సలహాదారుల సెలవు

మోదీ హయాంలో ఇద్దరు ప్రధాన సలహాదారులు పదవుల నుంచి తప్పుకున్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్ నియమితులయ్యారు. డిమానిటైజేషన్ ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యంత క్రూరమైన చర్యగా దాన్ని అభివర్ణించిన ఆయన మరో ఏడాది పదవీకాలం ఉండగానే 2018లో రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితుడైన కె.వి.సుబ్రమణియన్ కూడా పది రోజుల క్రితం తప్పుకున్నారు. మరి కొన్నాళ్లలో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే ఆయన సర్వీసును పొడిగించాలని కేంద్రం భావించింది. అందుకే కొత్త సలహాదారు ఎంపిక ప్రక్రియ ప్రారంభించలేదు. కానీ పొడుగింపును వద్దనుకుని మరీ ఆయన రాజీనామా చేయడం విశేషం.

వీరే కాకుండా జాతీయ గణాంక కమిషన్ సభ్యులుగా పని చేసిన సీవీ మోహనన్, జేవీ మీనాక్షి సైతం పదవులు వదులుకున్న వారిలో ఉన్నారు. జీడీపీ గణన విధానాన్ని 2018లో మోదీ ప్రభుత్వం మార్చేసింది. దీనికి వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో పదవులను త్యజించారు.

Also Read : Polavaram -పోలవరం ప్రాజెక్ట్ మీద కేంద్రం వైఖరిలో మార్పు వస్తుందా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp