Vizag steel movement - అది తప్ప ఈ ఉద్యమం పట్టదా? ఒక వర్గం మీడియా 'పచ్చ'పాతం

By Ramana.Damara Singh Nov. 27, 2021, 08:00 pm IST
Vizag steel movement - అది తప్ప ఈ ఉద్యమం పట్టదా? ఒక వర్గం మీడియా 'పచ్చ'పాతం

'చూడూ.. ఒకవైపే చూడు'.. అంటూ ఒక సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ డైలాగులతో గర్జిస్తాడు. ఆ గర్జన రాష్ట్రంలోని ఒక వర్గం మీడియా చెవుల్లో ఇప్పటికీ గింగుర్లు తిరుగుతున్నట్లుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఉద్యమాలు జరుగుతుంటే వారికి ఒక్క ఉద్యమమే కనిపిస్తోంది. తూర్పు ఉద్యమం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. రాష్ట్రంలో ఒక వర్గం మీడియా పచ్చ రంగు పులుముకుని కొన్నేళ్లుగా పచ్చ వార్తలతో పండగ చేసుకుంటోంది. సరే.. ఆ విషయం పక్కనపెడితే తూర్పున విశాఖపట్నంలో ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు దాదాపు 11 నెలలుగా తీవ్ర ఉద్యమం జరుగుతోంది. మరోవైపు అమరావతి ఏకైక రాజధాని కావాలంటూ ఆ ప్రాంత రైతుల పేరుతో మరో ఉద్యమం జరుగుతోంది. ఇటువంటి అంశాలను నిష్పక్షపాతంగా కవర్ చేయాల్సిన బాధ్యతను మరిచిపోయిన పచ్చ మీడియా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని దాదాపు విస్మరించి.. ఒక్క అమరావతి ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది.

ఉక్కు ఉద్యమంపై వివక్ష

ఎంతో మంది త్యాగం, ఎన్నో ఉద్యమాలకు ప్రతిఫలంగా.. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడకు ప్రమాదం ఏర్పడింది. నష్టాల సాకుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమ్మేయడానికి శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. దాంతో ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఉక్కు పరిరక్షణ పోరాట సమితిగా ఏర్పడి 11 నెలలుగా ఉద్యమం నడుపుతున్నారు. పలు రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. దీన్ని ఇంకా తీవ్రతరం చేయాలని రెండు రోజుల క్రితమే నిర్ణయించారు. 289 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కానీ ఇవేవీ పచ్చ మీడియాలో ప్రముఖంగా ప్రచురణకు నోచుకోవడంలేదు. ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక రంగాల్లో రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఉక్కు ఉద్యమ విశేషాలను, వార్తలను కొన్ని ప్రధాన పత్రికలు ఎక్కడో లోకల్ ఎడిషన్లు, జోన్ పేజీలకు పరిమితం చేసి.. కనీ కనిపించనట్లు ఏదో ఒక మూల పడేసి పరోక్షంగా ఉద్యమాన్ని చంపేస్తున్నాయి.

అమరావతికి అత్యంత ప్రాధాన్యం

వేలాదిమందికి జీవనాధారం, రాష్ట్ర ఆర్ధిక రంగానికి ఊతమిచ్చే పరిశ్రమ విషయాన్ని పట్టించుకోని పచ్చ మీడియా అదే సమయంలో అమరావతి ఉద్యమాన్ని మాత్రం విపరీతంగా మోసేస్తోంది. భౌతికంగా లేని రాజధాని కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఉద్యమానికి అత్యంత ప్రాధాన్యమివ్వడం విస్మయం కలిగిస్తోంది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పది రోజులుగా జరుగుతున్న పాదయాత్ర విశేషాలను చిలవలు పలవలుగా మార్చి పెద్ద పెద్ద ఫొటోలతో రాష్ట్రమంతటికీ కవరయ్యేలా ప్రచురిస్తోంది. ఈ ఉద్యమంలో రాజకీయ అంశాలు, ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. ఈ యాత్రకు తెలుగుదేశం ప్రధాన స్పాన్సర్ కాగా.. ఇటీవలే బీజేపీ.. దాని వెనుకే జనసేన కూడా జైకొట్టడమే దీనికి నిదర్శనం. స్టీల్ ప్లాంట్ ఉద్యమం విషయంలో ప్రకటనలు, సంఘీభావాలతో సరిపెట్టి చేతులు దులిపేసుకున్న ప్రధాన పార్టీలు అమరావతి ఉద్యమాన్ని మాత్రం ఓన్ చేసుకుంటున్నాయి. ఆ పార్టీలకు భజన చేసే పచ్చ మీడియా తన బాధ్యతను విస్మరించి ఉక్కును పట్టించుకోకుండా.. అమరావతికే జైకొడుతుండటం విచారకరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read : Cm Jagan ,Central Government - విభజన చట్టంలో హామీ,జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం సై.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp