అవినీతిని ప్రశ్నించే నైతికత,బాధ్యత మీకు లేదా జనసేనాని?

By Sannapareddy Krishna Reddy Feb. 18, 2020, 08:53 am IST
అవినీతిని ప్రశ్నించే నైతికత,బాధ్యత మీకు లేదా జనసేనాని?

అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు తాను విమర్శించకుండా, ఎందుకు విమర్శించడం లేదో తన పార్టీ వర్గాలకు, అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి తన సృజనాత్మక శక్తికి పదును పెట్టి కారణాలు వెతుకుతాడు పవన్ కళ్యాణ్.

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి, రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసినప్పుడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారి తప్పకుండా చూసే బాధ్యత తనది అనీ, రెండు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీ అమలు పరచేలా తను చూస్తానని, తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానని చాలానే చెప్పాడు పవన్ కళ్యాణ్.

ఆ తరువాత కాపు రిజర్వేషన్ల ఆందోళనలో కానీ, ఓటుకు నోటు కేసు విషయంలో కానీ, ఏర్పేడులో ఇసుక మాఫియా సాగించిన మారణకాండ గురించి కానీ, మహిళా తహసీల్దార్ మీద ఇసుక మాఫియా చేసిన దౌర్జన్యం గురించి కానీ, అమలుకు నోచుకోని అనేక ఎన్నికల హామీల గురించి కానీ ఏనాడు గొంతెత్తి ప్రశ్నించే పని చేయలేదు పవన్.
బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే పాలనలో పట్టు సాధిస్తున్న ముఖ్యమంత్రిని బలహీనపరచకూడదని ఒకసారి, కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీద మాట్లాడకూడదని మరోసారి, ఇది సున్నితమైన విషయం కాబట్టి మాట్లాడనని ఒకసారి దాటవేస్తూ వచ్చారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు తెగదెంపులు చేసుకుని స్వంతంగా పోటీచేసినా అతని ఈ ట్రాక్ రికార్డు చూసి ఓటర్లు విశ్వసించలేదు.

ఇప్పుడు జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పొత్తు లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అయినా కానీ ఆ పార్టీని విమర్శించాలంటే పవన్ కల్యాణ్ ఎందుకో మొహమాటపడుతున్నాడు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర పీఏగా పనిచేసిన వ్యక్తికి సంబంధించిన ఆస్తుల మీద అధికారులు దాడి చేసి వేల కోట్ల అక్రమాస్తులు వెలికితీస్తే ఆ విషయం మీద విమర్శలు చేయకుండా ఉండడానికి చిత్రమైన వాదన చేస్తున్నాడు జనసేనాని.

ఓటర్లు డబ్బులు తీసుకుని ఓట్లేశారు కాబట్టి అలా డబ్బులు తీసుకున్న వారందరూ టెక్నికల్ గా అవినీతి పరులు కాబట్టి వేరొకరి అవినీతి మీద మాట్లాడే హక్కు ఉండదని పవన్ అన్నారు.

సరే వైసీపీ, టీడీపీ పార్టీలు రెండూ డబ్బులు పంచాయి, మీ లాజిక్ ప్రకారం ఆ రెండు పార్టీలకు ఓటేసిన ప్రతి ఒక్కడూ డబ్బులు తీసుకుని ఓట్లేశారు అనుకున్నా, మీ పార్టీ అభ్యర్థులు కూడా అన్ని స్థానాల్లో పోటీ చేశారు కదా. గెలవక పోయినా, అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనా ప్రతి చోట యాభయ్యో, వందో నిజాయితీ పరుల ఓట్లు మీకు వచ్చి ఉంటాయి కదా. అంతేకాకుండా డబ్బులు పంచకుండా నిజాయితీగా రాజకీయం చేసినందువలనే నాకు ఈ దుస్థితి అని మీరే చెప్పుకున్నారు కదా. ఈ విధంగా చూస్తే మీరు నిజాయితీ పరులే కదా!!

నిజాయితీ పరులైన మీరు, మీతో సమానంగా నిజాయితీ పరులైన మీ పార్టీ ఓటర్లు ఈ రాష్ట్ర పౌరులే కదా. ఆ నిజాయితీ పరులైన ప్రజల తరపున, నిజాయితీ పరులైన నాయకుడిగా తెలుగుదేశం పార్టీని ఈ పీఏ అక్రమాస్తుల విషయంలో ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉన్నట్టే కదా!!

ప్రశ్నిస్తా...ప్రశ్నిస్తా అని పదే పదే చెప్పుకోవడం కాకుండా నిజంగా ప్రశ్నించడం మొదలు పెడితేనే ప్రజల్లో మీ మీద విశ్వాసం ఏర్పడుతుంది, ఈసారి ఎన్నికల్లో మరో ఒకటో రెండో సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp