అధికారాలను గుర్తు చేస్తేనే సరా..! బాధ్యత లేదా..?

By Jaswanth.T Jan. 23, 2021, 02:20 pm IST
అధికారాలను గుర్తు చేస్తేనే సరా..! బాధ్యత లేదా..?

అధికారంతో పాటే విధులు, బాధ్యతలు కూడా వర్తిస్తాయి. ఇది పౌరులకైనా, రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న అధికారికైనా వీటిని అనుసరించాల్సిందే. ఎక్కడైనా ఒకటి రెండు మినహాయింపులను సంబంధిత వ్యవస్థలు పట్టించుకోవడం లేదంటే.. సదరు వ్యక్తులు తమ విధుల పట్ల ప్రదర్శించిన నిబద్ధతే కారణం. అయితే ప్రతి అంశాన్ని గీసిగీసి బూతద్దంలో చూస్తే మాత్రం అన్ని వైపుల నుంచి ఆక్షేపణలు రావడం సర్వ సాధారణం. ముఖ్యంగా నేను పట్టిన కుందేటికి అన్నే కాళ్ళు అన్న రీతిలో వ్యవహిరంచే వారి పట్ల సొంత శాఖలో సబార్డినేట్‌ ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం అంత్యంత సాధారణంగానే సంభవిస్తుంటుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తనకు ఉన్న అధికారాలను గుర్తు చేస్తూ ఉద్యోగ వర్గాలపై ఒక రకంగా బెదిరింపు ధోరణినే ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా వ్యవహారశైలి పట్ల సర్వత్రా విమర్శలు పోటెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎటువంటి అధికారాలు ఉంటాయో అదే తరహా అధికారాలు రాష్ట్ర సంఘానికి కూడా వర్తిస్తాయంటూ శుక్రవారం నాటి పరిణామాల నేపథ్యంలో నిమ్మగడ్డ గుర్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఈ సమయంలోనే అధికారంతో పాటు నిర్వర్తించాల్సిన విధులు, సదరు పదవిపై ఉన్న బాధ్యతలను కూడా జనం గుర్తు చేసుకుంటున్నారు.

నిబంధనల ప్రకారం చేయాల్సిన పనిని చేస్తే ఎవ్వరూ అడ్డుపడే ప్రసక్తే ఉండదు. అంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా రెండేళ్ళ పాటు అధికారం ఉండగా నిర్వహించాల్సిన ఎన్నికలను అప్పుడే నిర్వహించి ఉంటే ఎవ్వరూ అడ్డుపడి ఉండేవారు కాదు. అలా చేయకపోవడాన్ని గమనిస్తే.. ఒక రకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ తన బాధ్యతను అప్పటి నుంచే నిర్లక్ష్యం చేసినట్టుగానే భావించాల్సి వస్తుందన్న మాట. అదలా ఉంచితే ఇంకా రాష్ట్రంలో కోవిడ్‌ విజృంభించని సమయంలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, సహేతుకమైన కారణం చూపకుండా ఎన్నికలను వాయిదా వేసేసారు. దీనికి ఎటువంటి రీజన్‌ను చూపడంలో కూడా నిమ్మగడ్డ విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల్లో బలంగానే ఉంది. అప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆయనకు అడ్డుపడే ధైర్యం ఉద్యోగ వర్గాలు చేసుండేవి కాదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్నికలు జరగాల్సిందే అంటూ మంకుపట్టు పట్టడం పట్ల మాత్రమే అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదన్నది ఇప్పటికే అనేక ఎన్నికల్లో నిరూపితమైంది. అయినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీతో పాటు, ఉద్యోగ వర్గాలు కూడా ఎన్నికలను వాయిదా వెయ్యిమని కోరుతున్నప్పటికీ నిమ్మగడ్డ తన వైఖరిపైనే మొండి పట్టుదలను ప్రదర్శించడంతో ఆయనకు ఉన్న అపరిమిత అధికారాలతో పాటు విధులు, బాధ్యతలను కూడా ప్రజలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

ఎన్నికలు నిర్వహించాలన్న ఏకైక లక్ష్యం, అధికార హోదాతో ప్రజారోగ్యం, ఎన్నికలు నిర్వహించాల్సిన ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెడతారా? అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.ఎన్నికల నోటిపికేషన్‌ విడుదల సమయంలో గ్లాస్‌ కవర్‌ షీల్డ్‌ వెనుక ఉండి నిమ్మగడ్డ వివరాలు వెల్లడించారు. మరి 30 మంది మీడియా ప్రతినిధులు హాజరైన కార్యక్రమానికే ఇంత రక్షణతో వచ్చిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌... ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఓటు వేసేందుకు వచ్చే ప్రజల రక్షణ పరిస్థితిపై ఆలోచించరా..? ఓటర్‌ స్లిప్పు పంపిణీ, పోలింగ్‌ బూత్‌లో స్లిప్పు తీసుకోవడం, చూపుడు వేలికి సిరా వేయడం, బ్యాలెట్‌ అందించడం, స్వస్తిక్‌ సింబల్‌తో గుర్తుపై ఓటు వేయడం.. ఇలా అధికారులు, ఓటర్లకు మధ్య భౌతికమైన సంబంధం ఉంటుందన్న విషయం నిమ్మగడ్డ గుర్తించడం లేదా..? తమ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు ఇస్తారని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలకు ఎవరు సమాధానం చెబుతారు..?

నిమ్మగడ్డకు అనుకూలంగా వ్యవహరించే రాజకీయ నాయకులు కొన్ని ఉదాహరణలను కూడా లేవనెత్తకపోలేదు. సంక్షేమ పథకాల కోసం అధికార పార్టీ జనాన్ని పోగేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక లాజిక్‌ మిస్‌ అవుతున్నారని చెప్పాల్సి ఉంది. సాధారణంగా సంక్షేమ పథకాలను ఒక గ్రామం పరిధి గానీ, మండల పరిధిలోగానీ పంపిణీ చేస్తుంటారు. కానీ ఎన్నికల విధులకు వెళ్ళాల్సిన సిబ్బందిని మాత్రం డివిజన్‌ స్థాయిగానీ, ఇంకాస్త పై స్థాయిలో అయితే జిల్లాలు మారిగానీ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జనం తిరుగుతున్నారన్నది వాస్తవమే అయినప్పటికీ, వారు ఎంత పరిధిలో తిరుగుతున్నారన్నదాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదన్నది తేలిపోతుంది.

మాకు వ్యాక్సినేషన్‌ అయ్యేంత వరకు ఎన్నికలను ఆపుచేయండి అని ఉద్యోగులు మొత్తుకుంటున్నప్పటకీ నిమ్మగడ్డ చెవికెక్కించుకోకపోవడం చూస్తుంటే.. కేవలం తన అధికారాల గురించి మాత్రమే మాట్లాడుతున్న ఆయన ఉద్యోగుల సేఫ్టీని కూడా ఆలోచించాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

టీడీపీ హాయంలో ఎందుకు నిర్వహించలేకపోయారు? కరోనా ముందు ఎందుకు వాయిదా వేసారు? అన్న ప్రశ్నలకు ఇప్పటిక్కూడా సమాధానం చెప్పని నిమ్మగడ్డ, ఉద్యోగుల ఆరోగ్యం పట్ల, వారి సేఫ్టీ పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో బాధ్యత లేదా? అన్న ప్రశ్నకు కూడా అదే ధోరణిని కొనసాగించడం వివాదానికి కారణమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp