టీఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డికి కాదా?

By Ritwika Ram Jul. 21, 2021, 05:15 pm IST
టీఆర్ఎస్ టికెట్ కౌశిక్ రెడ్డికి కాదా?

మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారు కౌశిక్ రెడ్డి. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో లీక్ అయిన ఆడియోలో ‘టీఆర్ఎస్ టికెట్ నాకే కన్ఫామ్ అయింది’ అని కౌశిక్ రెడ్డి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కానీ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాత్రం.. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా గెలిపించుకుంటానని ప్రకటించారు. టీఆర్ఎస్ అభివృద్ధి చూసి పార్టీలోకి చేరుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అత్యుత్సాహమే కొంపముంచిందా?

రాజకీయాల్లో ఉత్సాహం మంచిదే. కానీ అత్యుత్సాహం కొంపముంచుతుంది. కౌశిక్ రెడ్డి విషయంలో అత్యుత్సాహమే దెబ్బకొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషనే రాలేదు. అప్పుడే ఆయన డబ్బుల పంపకం గురించి ఆలోచించేశారు. టీఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్ అయిందంటూ చెప్పుకున్నారు. ఇక్కడే ఆయన బుక్కయ్యారు. ఈ విషయం బయటికి రాగానే.. కాంగ్రెస్ ముందు షోకాజ్ నోటీసులిచ్చింది. తర్వాత పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక చేసేది లేక తానే రాజీనమా చేస్తున్నానంటూ కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఇంతటితో ఆగకుండా సోనియా గాంధీ, మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి మీద వివాదాస్పద కామెంట్లు చేశారు. పూర్తిగా కాంగ్రెస్ తో కటిఫ్ చెప్పేశారు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా జాగ్రత్త పడింది. కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తామని ఎక్కడా ప్రకటించలేదు.

Also Read : తెలంగాణలో రెండేళ్లలో ముగ్గురు సివిల్ సర్వెంట్ల స్వచ్చంద పదవి విరమణ !

టీఆర్ఎస్ ఆచితూచి...

హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. పలు పార్టీల నుంచి లీడర్లను చేర్చుకుంటూనే ఉంది. కానీ క్యాండిడేట్ ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. ముందు తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ వస్తే.. ఇప్పుడు కౌశిక్ రెడ్డి వస్తున్నారు. రమణకు ఏదో పదవి ఇస్తానని చెప్పారు కేసీఆర్. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎవరిని నిలబెట్టినా గెలిపించుకుంటానని కౌశిక్ రెడ్డి ఇప్పుడు కామెంట్ చేయడం చూస్తే.. ఆయనకు టికెట్ ఇవ్వడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ స్పందించే దాకా అసలు విషయం బయటపడే అవకాశం లేదు.

మరి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?.. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. డజను పేర్లను కేసీఆర్ పరిశీలించారు. కానీ ఎవ్వరినీ ఇప్పటి దాకా ఫైనల్ చేయలేదు. ‘టికెట్ నాకే కన్పామ్ అయింది’ అని చెప్పుకున్న కౌశిక్ రెడ్డి పేరును కూడా పక్కన పెట్టినట్లే తెలుస్తోంది. తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా వినిపించింది. హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలన్నింటినీ ప్రవీణ్ కుమార్ కొట్టిపారేశారు. రాజకీయాల్లోకి వచ్చే విషయంలో క్లారిటీ ఇవ్వకున్నా.. తాను పోటీలో లేనని మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారు.

Also Read : ఈట‌ల హ‌త్య‌కు కుట్ర‌.. ఆ మాట‌ల్లో నిజ‌మెంత‌?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp