చంద్రబాబుకి మరో షాక్, అచ్చెన్నకి పోటీగా బీదా రవిచంద్ర

By Raju VS Sep. 24, 2020, 10:00 am IST
చంద్రబాబుకి మరో షాక్, అచ్చెన్నకి పోటీగా బీదా రవిచంద్ర

ప్రజల్లో బలం కోల్పోయిన చంద్రబాబుకి ఇప్పుడు పార్టీలో కూడా తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే చంద్రబాబు తనయుడిని పలువురు దూరం పెట్టినట్టే కనిపిస్తోంది. నారా లోకేష్ నాయకత్వాన్ని సహించేందుకు అత్యధికులు సిద్ధంగా లేరనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడి వ్యవహారంలో కూడా బాబు మాట చెల్లుతుందా లేదా అనే సందేహం కనిపిస్తోంది. ఇప్పటికే అచ్చెన్న కుటుంబం నుంచి ఒత్తిడితో చంద్రబాబు అటు మొగ్గుచూపారు. కిమిడి కళా వెంకట్రావుని తొలగించి అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేస్తున్నట్టు లీకులిచ్చారు. ఈనెల 27న అధికారిక ప్రకటన అంటూ కూడా చెప్పుకున్నారు.

కానీ చంద్రబాబుకి షాకిచ్చేలా సీనియర్లు పావులు కదుపుతున్నారు. తాజాగా అచ్చెన్నకి పోటీగా బీదా రవిచంద్రయాదవ్ ని ముందుకు తీసుకొచ్చారు. బీసీలకే టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే బీదా బలమైన నేత అవుతారని వాదిస్తున్నారు. ఇప్పటికే బలంగా ఉన్న శ్రీకాకుళం కన్నా పార్టీ బలహీనంగా ఉన్న నెల్లూరు నేతను అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే పార్టీకి ఉపయోగం అని చెబుతున్నారు. కావాలంటే అచ్చెన్న కుటుంబం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడికి తెలుగు యువత అధ్యక్ష పదవి కట్టబెట్టాలని సూచిస్తున్నారు. కానీ దానికి కింజారపు కుటుంబం ససేమీరా అంటున్నట్టు సమాచారం. ఈ కుటుంబం నుంచి అచ్చెన్నతో పాటుగా రామ్మోహన్ నాయుడు ఎంపీగానూ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా ఉన్నారు. దాంతొ వారి నుంచి బాబుని తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో కాపు నేతను పదవి నుంచి తొలగించే ప్రక్రియ పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తోడుగా అచ్చెన్న అయితే అందరి మీద పెత్తనం చేస్తారనే అభిప్రాయంతో ఉన్న కొందరు ఆయనకు అధ్యక్ష పదవి దక్కుకుండా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కలిసి ఇప్పుడు టీడీపీ బీదా రవిచంద్ర పేరు ముందుకొచ్చింది. యనమల వంటి సీనియర్ నేతలు కూడా ఈ వ్యూహంలో ఉన్నారనే సమాచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది. కారణాలేమయినప్పటికీ ఈ పరిస్థితుల్లో వెంటనే అధ్యక్షుడిని మార్చడం సాధ్యం కాదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. దాంతో ఈనెల 27న అధికారిక ప్రకటన తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం. చివరకు ఈ పరిణామాలు టీడీపీని ఏదిశగా తీసుకెళతాయోననే చర్చ మొదలయ్యింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp