కాంగ్రెస్‌ అధ్యక్షుడి కథ కొలిక్కి వచ్చేనా..?

By Kalyan.S Jan. 22, 2021, 11:00 am IST
కాంగ్రెస్‌ అధ్యక్షుడి కథ కొలిక్కి వచ్చేనా..?

దశాబ్దాల చరిత్ర గల జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవ‌డానికి అపసోపాలు పడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. అధ్యక్షురాలిగా సోనియా, అధ్యక్షుడిగా రాహుల్‌.. మళ్లీ సోనియా, మళ్లీ రాహుల్‌.. ఇలా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. మరోసారి గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి అంటూ రకరకాల ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. ఓ రకంగా ఈ చర్చ పార్టీ ఉనికికే ప్రమాదంగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో అయినా అధ్యక్ష పదవికి ఎంపిక కొలిక్కి వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు నాయకులు భావిస్తున్నారు.

ఈనెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ సమావేశాలు పూర్తికాగానే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ మళ్లీ పార్టీ అధ్యక్షుడుగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా పోటీ చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ లో ఏఐిసీసీ ప్లీనరీ జరుగుతుందని, ఈసమావేశంలో రాహుల్‌ కొత్త టీమ్‌ను కూడా ఎంపికచేస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ఈసారి రాహుల్‌ టీమ్‌లో ప్రియాంక గాంధీ, సచిన్‌ పైలట్‌ తో పాటు పలువురు యువ నేతలు వర్కింగ్‌ కమిటీలో ఉంటారని తెలుస్తోంది. ప్రియాంకకు ఉత్తరప్రదేశ్‌ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో కొత్తవారికి అవకాశమిచ్చేలా పలువురు వృద్ధ నేతలు తమ పదవుల నుంచి తప్పుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సంస్థాగత ఎన్నికలు జరిపించాలని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని పార్టీకి చెందిన 23 మంది సీనియర్‌ నాయకులు గత ఏడాది సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. గత డిసెంబరు లో సోనియా ఈమేరకు ఈ సీనియర్‌ నేతలతో చర్చలు జరిపారు. త్వరలోనే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే ఆమె శుక్రవారం వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

ఇదిలా ఉండ‌గా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కు పార్టీ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంద‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం అతనిని ఢిల్లీకి పిలిపించ‌డంతో ఈ ప్ర‌చారం జ‌రుగుతోంది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ మరోమారు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయమై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన అశోక్ గహ్లోత్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుణ్ణి నియమించే విషయమై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం ప్రకారం... రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేని పక్షంలో, ఆ పదవిలో ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే అశోక్ గహ్లోతా పేరు వినిపిస్తోంది. అశోక్ గహ్లోతా నాటి తరం నేతలకు ఈ తరం నేతలను మంచి అనుసంధానకర్తగా ఉంటారని భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp