కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు...?

By Venkat G Sep. 17, 2021, 08:15 pm IST
కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు...?

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరి వైపు మొగ్గు చూపిస్తోంది...? రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకత్వం మొత్తం సహకరిస్తోందా...? దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి జాతీయ మీడియాలోని పలు రాష్ట్రాల పత్రికల్లో గాని దీని గురించి ఏదో ఒక కథనం రావటం, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసేసుకుంది అని చెప్పడం వంటివి మనం చూస్తూ వస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలి అంటే కచ్చితంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గం డిమాండ్ చేస్తోంది అంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే కచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీకి పనిచేయబోయే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్... కిషోర్ సోనియా గాంధీ ముందు చెప్పారనే కథనం కూడా జాతీయ మీడియాలో వచ్చింది. కానీ అసలు వాస్తవం ఏంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆలోచన ఏంటి లేకపోతే సోనియాగాంధీ ఆలోచన ఏంటి అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు జరుగుతున్న పరిణామాల ఆధారంగా చూస్తుంటే దక్షిణాది మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫోకస్ ప్రధానమంత్రి అభ్యర్థి ని నిర్ణయిస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది గుండెకాయలా ఉంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లేదా వామపక్షాలు ఇబ్బంది పెట్టడం ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాది పార్టీ అలాగే బహుజన్ సమాజ్ పార్టీలో ప్రభావం చూపించడం... మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం పెరగటం... బీహార్ లో ఆర్జెడి ప్రభావం ఎక్కువగా ఉండటం అలాగే జార్ఖండ్ విడిపోయిన తర్వాత శిబూసొరేన్ పార్టీ ఎక్కువగా అక్కడ ఆధిపత్యం కొనసాగించడంతో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఉత్తరాది రాష్ట్రాలకు ఇబ్బంది పడుతూ వచ్చింది.

అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే క్రమంగా భారతీయ జనతా పార్టీ బలపడటం వంటివి కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. దక్షిణాదిలో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాయి. డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం తో తమిళనాడులో యూపీఏ బలం గా కనబడింది. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 2018 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అలాగే జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ దూకుడు ముందు నిలబడలేకపోయారు.
అయితే ఇప్పుడు దక్షిణాదిలో తమ బలాన్ని మరింత పెంచుకోవడం కోసం దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. పీవీ నరసింహారావు తర్వాత దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి లేరు. అందుకే ఇప్పుడు దక్షిణాది విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి కర్ణాటక కాంగ్రెస్ అధినేత కేసీ వేణుగోపాల్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడకుండా కేసి వేణుగోపాల్ పార్టీ అగ్రనేతలు అందరినీ ఒక తాటిమీద ఉంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఆయన పూర్తి స్థాయి లో సహకారం అందించడంతో జాతీయ స్థాయిలో ఆయన్ను అధ్యక్షుడిగా ప్రకటించే ఆలోచనలో సోనియాగాంధీ ఉన్నారని ఆ మధ్య కాలంలో ప్రచారం జరిగింది. తిరువనంతపురం ఎంపీ శశి ధరూర్ నుంచి ఇబ్బందులు రావడంతోనే వెనక్కు తగ్గిందని అయితే ఇప్పుడో శశిథరూర్ ను రాహుల్ గాంధీ అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఒప్పించడంతో ఆయన సైలెంట్ అయ్యారు అని అంటున్నారు. సోనియా గాంధీ కూడా కేసి వేణుగోపాల్ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని ఆయన ను ఖచ్చితంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరగడమే కాకుండా దక్షిణాది సెంటిమెంట్ను కూడా కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా వాడుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు. మరి సోనియాగాంధీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో దక్షిణాదిలో కాంగ్రెస్ ఎంతవరకు బలోపేతమవుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp