ఆడుతోంది రఘురామే కానీ ఆడిస్తోంది ఎవరు?

By Gopal.T Sep. 16, 2021, 09:30 pm IST
ఆడుతోంది రఘురామే కానీ ఆడిస్తోంది ఎవరు?

రాష్ట్ర రాజకీయాల్లో నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు ఓ తోలుబొమ్మలా మారినట్టు కనిపిస్తోంది. గత దశాబ్దంన్నర కాలంగా రాజకీయాల్లో ఉంటూ బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల్లో కాస్త క్రియాశీలకంగా పనిచేసినా ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాకపోవడంతో చివరికి మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లోక్ సభ స్థానం నుండి విజయం సాధించారు రఘురామకృష్ణంరాజు.

అయితే సాధించిన విజయం తెచ్చిన సంతోషం ఎక్కువకాలం నిలుపుకోలేకపోయారు ఆయన. గెలిచిన ఆరునెలలలోపే పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసి ప్రతిపక్ష ఎంపీలా మాట్లాడడం, పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని విమర్శిచడం మొదలుపెట్టారు. విమర్శలు కూడా చాలావరకు పసలేనివే అని చెప్పుకోవాలి.

పార్టీ నాయకత్వంపైనా, పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పైనా, చివరికి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైనా  విమర్శలు చేస్తూనే ఉన్నారు. సహజంగానే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మీడియా రఘురామకృష్ణంరాజు విమర్శలకు ప్రాధాన్యత ఆపాదిస్తూవస్తోంది.  అయితే కాస్త లోతుగా చూస్తే గడచిన యేడాదిన్నరగా  రఘురామకృష్ణంరాజు చేస్తున్న విమర్శల స్థాయి, లక్ష్యం చాలా స్పష్టంగానే కనిపిిస్తోంది.విమర్శల్లో సబ్జెక్టు కంటే వెకిలితనమే ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల రఘురామకృష్ణంరాజు వెనుక ఏవో శక్తులు పనిచేస్తున్నాయని, ఎవరి ప్రోద్భలంతోనో ఆయన జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేశారని జనం ఓ నిర్ధారణకు వచ్చేశారు. 

తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో మూడునెలలక్రితం రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టు నిన్న కొట్టివేయడంతో ఆయన స్పందించిన తీరు ఆయన చేస్తున్న తోలుబొమ్మ రాజకీయాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి, పార్లమెంటు సభ్యుని హోదాలో విజయసాయి రెడ్డి తమ కేసుల్లో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణను సిబిఐ సమర్ధించలేదు. సిబిఐ కోర్టు విశ్వసించలేదు. అయితే ఈ కేసు విషయంలో గత మూడునెలల కాలంలో అనేక సందర్భాల్లో రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు చూస్తే చివరినిమిషం వరకూ కేసు తనకు అనుకూలంగానే వస్తుందని, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారం వెనుక రాజకీయ కుట్రలు లేకపోలేదు. 

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై, ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయేలా చేయడం, తద్వారా రాజకీయ సంక్షోభాన్ని ప్రేరేపించడమే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల, వ్యాజ్యాల లక్ష్యం. పైగా రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్న తెలుగు మీడియా ఉమ్మడిగా గత రెండున్నరేళ్ళుగా చేస్తున్న ప్రచారానికి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు భిన్నంగా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయితే, ఆయన జైలుకు వెళితే ముఖ్యమంత్రి పదవి కానీ, అధికారపార్టీ అధ్యక్షపదవి కానీ రఘురామకృష్ణంరాజుకు వచ్చే అవకాశం లేదు. అయినా ఆయన ఈ ప్రచారం విస్తృతంగా, నిరంతరంగా చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఆలోచించాల్సి ఉంది. 

జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం వస్తుందని, ఆ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోగల సామర్ధ్యం మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఎక్కువగా ఉందని, అలాంటి సంక్షోభం కోసమే చంద్రబాబు నాయుడు వేచిచూస్తున్నారు అనేది రాజకీయ చర్చలు చేసే వారందరికీ తెలిసిన విషయమే. పైగా చంద్రబాబు అనుచరగణం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే అభిమాన జనం గత రెండున్నరేళ్ళుగా ఈపరిస్థితిని ఆశిస్తూనే ఉన్నారు.

ఈ రెండున్నరెళ్ళలో లేదా వచ్చే రెండున్నరేళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా జైలుకు వెళ్ళాల్సి వస్తుందనే గట్టి విశ్వాసం చంద్రబాబు అనుచరులు, అనుయాయుల్లో చాలామందికి ఉంది. అలాంటి విశ్వాసమే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల్లో, వ్యాజ్యాల్లో కనిపిస్తోంది. ఇంకోమాటలో చెప్పాలంటే టీడీపీకి, ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడి రాజకీయాలకు ఊతం ఇచ్చేలాగే రఘురామకృష్ణంరాజు చర్యలు ఉంటున్నాయనడంలో సందేహం లేదు. 

ఇప్పటికే ఈ దిశగా కొన్ని ఆధారాలు కూడా లభించాయి. రఘురామకృష్ణంరాజు టీడీపీ నాయకత్వంతో చేసిన ఆర్థికలావాదేవీల  సంభాషణలు కూడా బయటపడ్డాయి. ఈ సంభాషణలు రఘురామకృష్ణంరాజు కానీ, టీడీపీ నాయకత్వం కానీ అంగీకరించకపోవచ్చు. ఓటుకు నోటు కేసులో లభించిన చంద్రబాబు నాయుడు సంభాషణ లాగే కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు సంభాషణ కూడా నిలవకపోవచ్చు. కానీ ఈ సంభాషణలు విన్న ప్రజలు ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చేశారు. ఆడించేది చంద్రబాబు, ఆడేది రఘురామకృష్ణంరాజు అనే స్పష్టత ప్రజల్లో ఉంది. 

ప్రజల్లో ఉన్న ఈ స్పష్టతను చెరిపేసేందుకు లేదా ప్రజలను మభ్యపెట్టేందుకు లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు రఘురామకృష్ణంరాజు తన ప్రయత్నాలను ఇంకా కొనసాగించవచ్చు. తన ప్రచారం మరింత విస్తృతంగా చేయవచ్చు. జగన్మోహన్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్న మీడియా కూడా రఘురామకృష్ణంరాజును మరింత నెత్తికెక్కించుకొని ఊరేగించవచ్చు. కానీ వాస్తవాలు గ్రహించిన ప్రజలు ఈ ఊరేగింపులను ఆదరించే పరిస్థితి కానీ, వారి అబద్దాలను విశ్వసించే అవకాశం కానీ కనిపించడం లేదు. 

యుద్ధంలో ఓ అస్త్రం పనిచేయనప్పుడు మరో అస్త్రాన్ని ఎంపికచేసుకోవడం యుద్ధవీరుల లక్ష్యం. చంద్రబాబు నాయుడు ప్రయోగించిన "రఘురామకృష్ణంరాజు" అనే అస్త్రం ఇప్పటివరకూ పనిచేయలేదు. ఇకపై కూడా పనిచేయదు. ఇప్పుడు చంద్రబాబు యుద్ధవీరుడే అయితే ఆయన చేయాల్సింది విఫలమైన అస్త్రాన్ని ప్రత్యర్థిపై పదేపదే ప్రయోగించడం కాకుండా మరో సరికొత్త అస్త్రాన్ని అమ్ములపొదిలో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.  అలాంటి అస్త్రం తన అమ్ములపొదిలో  లేకపోతే పక్క యోధుడి అమ్ములపొదిలో నుండి అయినా తీసుకోవాలి. ఇవేవీ సాధ్యం కావనుకుంటే 2024లో ప్రత్యక్ష యుద్ధం ప్రకటించేవరకూ వేచి చూడాల్సిందే. అలా కాక యుద్ధంలోపే వివిధ రూపాల్లో వలలు పన్నో, మాటువేసో ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని అనుకుంటే అవన్నీ వృధాప్రయాసలే. 

లక్క ఇల్లు తగలబడి పాండవులు అంతమూ కాలేదు. గోగ్రహణంతో పాండవుల అజ్ఞాతవాసం బయటపడనూ లేదు. బయటపడిందల్లా కౌరవుల కుట్రలే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp