ఎవరీ బిర్రు ప్రతాప్ రెడ్డి ? బీసీలకు రాజ్యాధికారం దక్కడం చంద్రబాబుకు ఇష్టం లేదా..?

By Kotireddy Palukuri Jan. 17, 2020, 07:40 pm IST
ఎవరీ బిర్రు ప్రతాప్ రెడ్డి ? బీసీలకు రాజ్యాధికారం దక్కడం  చంద్రబాబుకు ఇష్టం లేదా..?

తమది బీసీల పార్టీ, బీసీలే తమ పార్టీకి వెన్నుముక.. అంటూ చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటలను నిజంగానే అంటున్నారా..? లేదా..? రాజకీయం కోసం, ఓట్ల కోసం మాత్రమే అంటున్నారా..? అంటే.. ఓట్ల కోసమే అని తాజాగా జరిగిన ఘటన స్పష్టం చేస్తోంది. ఓట్లు వేయాలి కానీ ఓట్లు వేయించుకుని పదవులు అలంకరిస్తామంటే ఎలా..? అనే విధంగా బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వారికి రాజకీయాధికారం దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నేత, చంద్రబాబు ప్రభుత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్, కేంద్ర మాజీ మంత్రి, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడైన బిర్రు ప్రతాప్‌ రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈ నెల 3వ తేదీన సర్కార్‌ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం వెరసి 59.85 శాతం సీట్లను ఆయా సామాజిక వర్గాల వారికి రిజర్వ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయిన నేపథ్యంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జనాభా ప్రకారం (కులాల వారీగా) స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు నిర్ణయించారు. అయితే బీసీలకు గతంలో కన్నా అధికశాతం రిజర్వేషన్లు దక్కాయి. ఫలితంగా రిజర్వేషన్లు 50 శాతం దాటాయి. దీన్ని సవాల్‌ చేస్తూ బిర్రు ప్రతాప్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలు లేదంటూ వాదించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు బిర్రు ప్రతాప్‌ రెడ్డి పిటిషన్‌ను కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల షెడ్యూల్‌ కూడా రూపొందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ వివరాలను హైకోర్టు ముందుంచింది. ఎన్నికల సంఘం రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ రోజు శుక్రవారం రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడాల్సింది. కానీ తెలుగుదేశం పార్టీ నేత, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జాతీయ ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్‌గా పని చేసిన బిర్రు ప్రతాప్‌ రెడ్డి సుప్రీం కోర్టులో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫలితంగా ఎన్నికల నోటిఫికేషన్‌ పై స్టే విధిస్తూ ఈ అంశాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని సుప్రీం రాష్ట్ర హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటూ అనేక ఏళ్లుగా డిమాండ్లు ఉన్నాయి. ఉద్యమాలు సాగాయి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ కూడా చాలా ఏళ్లుగా ఆ సామాజికవర్గ ప్రజలు, నేతలు వినిపిస్తున్నారు. అయితే బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ వారిని ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శలున్నాయి. ఈ విమర్శలకు బలం చేకూర్చేలా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఆ పార్టీ నేత బిర్రు ప్రతాప్‌ రెడ్డి న్యాయ స్థానాలను ఆశ్రయించడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp