ఎప్పటికీ ఇంతేనా.... కరోనాను ఏం చేయలేమా?!

By Voleti Divakar Aug. 05, 2020, 08:45 pm IST
ఎప్పటికీ ఇంతేనా.... కరోనాను ఏం చేయలేమా?!

ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు...నివారణ ఒక్కటే మార్గం. ఈ ప్రకటన 90వ దశకంలో విశేషంగా ప్రాచుర్యం పొందింది. రానున్న రోజుల్లో కరోనాకు మందు లేదు. ముఖానికి మాస్కు, భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గం అన్న నినాదాలు కూడా ప్రచారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జీవితాంతం ముక్కుకు మాస్కు, చేతులకు శానిటైజర్ రాసుకుంటూ భౌతిక దూరం పాటించాల్సిందేనా?. ఎప్పటికై ఆప్యాయమైన అలింగనం సాధ్యం కాదా?. అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే టీకాలు, మందులు కనిపెట్టడం అసాధ్యమని సంస్థ డైరెక్టర్ టెర్రోస్ అధనోమ్ తేల్చిచెప్పారు. కరోనాకు సులభమైన, అద్భుతమైన మందును కనిపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు కరోనాకు టీకాలు కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు, పరిశోధనలు జరుగుతున్న సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రజలను ఆలోచనలో పడేసింది.

కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. వేలాది మంది మరణిస్తున్నారు. రోజురోజుకీ వైరస్ విలయం సృష్టిస్తోంది. రానున్న రోజుల్లో దేశంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైరస్ ను కట్టడి చేయడం కోసం స్థానిక ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో తంటాలు పడుతున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు, పడకలు లేక రోగులు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన కరోనాను ఎప్పటికీ కట్టడి చేయలేమనే చేదు వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సిందే. అలాగే కొత్తగా కనిపెట్టే టీకా డోసుల్లో 100కోట్ల డోసులను అమెరికా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలు దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు భారత్ వంటి వర్థమాన, పేద దేశాల ప్రజలకు ప్రాణాంతకంగా మారనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp