ఇద్దరు బీసీలకే క్యాబినెట్ బెర్త్ లు ?

By Raju VS Jul. 03, 2020, 04:52 pm IST
ఇద్దరు బీసీలకే క్యాబినెట్ బెర్త్ లు ?

ఏపీలో క్యాబినెట్ విస్తరణ కన్ఫర్మ్ అయ్యింది. ఈనెలలో దానికి ముహూర్తం ఖాయంగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగా జూన్ 3వ వారంలో విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ ఖాళీలు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ సన్నాహాల్లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది ఈనెల 22 న కొత్తగా ఇద్దరికి కల్పించేందుకు రంగం సిద్దం అయ్యిందని సమాచారం.

ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ రెవెన్యూ వంటి కీలక శాఖ నిర్వహించిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్ తో పాటుగా, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. మండలి నుంచి మంత్రివర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారివురికీ మండలి రద్దు జరుగుతుందనే ఉద్దేశంతో పార్లమెంట్ లో ఎగువకు ఛాన్స్ ఇచ్చారు జగన్. ఇప్పటికే ఎన్నికలు పూర్తికాగా త్వరలో వారివురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో తమ మంత్రి పదవులతో పాటుగా మండలి సభ్యత్వాలకు రాజీనామాల చేశారు.

ఆ ఖాళీల భర్తీ విషయంలో జగన్ ఆలోచనపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. క్యాబినెట్ మొత్తం పునర్వీవస్థీకరిస్తారనే అంశం ముందుకొచ్చింది. తొలుత క్యాబినెట్ లోకి తీసుకున్న సమయంలో అందరికీ జగన్ రెండున్నరేళ్ల గడువు పెట్టారు. పనితీరు మెరుగుపరుచుకుని సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అయితే ఇప్పటికీ కొందరు మంత్రులు ఆయా శాఖల్లో పట్టు సాధించలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ అందరినీ కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నారని తాజా అంచనా. అందుకు తగ్గట్టుగా కేవలం ఖాళీలు భర్తీ చేసే దిశలో ఆయన పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. ఇద్దరు బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రులు రాజీనామా చేసిన తరుణంలో వారివురి స్థానాలను కొత్తవారికి కేటాయించే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు ఆశావాహులు ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే శెట్టిబలిజ వర్గానికి చెందిన బోస్, మత్స్యకార వర్గానికి మోపిదేవి రాజీనామా చేసిన తరుణంలో ఆయా సామాజికవర్గాలకే మళ్లీ అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మత్స్యకార వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరు పలాస ఎమ్మెల్యే సిదిరే అప్పలరాజు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి , వాగ్దాటి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఇక తూగో జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ గతంలో 2009లో కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. యానాం మంత్రి మల్లాడి కృష్ణారావు చొరవతో ఆయన కూడా ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. వారిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుందా లేక ఇప్పటి వరకూ క్యాబినెట్ లో చోటు దక్కని సామాజిక వర్గాలు ఛాన్సిస్తారా అన్నది చూడాలి.

ఇక శెట్టిబలిజ, గౌడ సామాజికవర్గాలకు చెందిన వారు కూడా తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో జోగి రమేష్, చెల్లుబోయిన వేణు వంటి వారున్నారు. కానీ కృష్ణా జిల్లాలో ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉండడం జోగిరమేష్ కి అడ్డంకిగా కనిపిస్తోంది. చెల్లుబోయిన వేణు తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక కావడం తో జగన్ ఏం చేస్తారరన్నది చర్చనీయాంశం అవుతోంది. మొత్తంగా రెండు ఖాళీల భర్తీ విషయంలో ఊహాగానాలు మొదలయ్యాయి. జగన్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp