ఆచూకీ లేని ఆంధ్రా ఆక్టోపస్‌.. కనపడితే కొడతారనేనా..?

By Kotireddy Palukuri Feb. 19, 2020, 06:27 pm IST
ఆచూకీ లేని ఆంధ్రా ఆక్టోపస్‌.. కనపడితే కొడతారనేనా..?

గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని విషయం హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజకీయం రాజధాని అమరావతి చుట్టూ తిరుగుతోంది. రాజకీయ పార్టీల నేతలు, ఏ పార్టీతోనూ సంబంధంలేని మాజీ ప్రజా ప్రతినిధులు మూడు రాజధానుల ప్రతిపాదనపై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. జగన్‌ సర్కార్‌ నిర్ణయం సరైనదేననో, లేక సరికాదనో వ్యాఖ్యానించారు. అయితే గత ఎన్నికల ఫలితాల వరకు రాష్ట రాజకీయాల్లో హల్‌ చల్‌ చేసిన మాజీ ప్రజా ప్రతినిధి ఇప్పుడు కనిపించడంలేదు. అమరావతి ప్రాంతానికే చెందిన సదరు నేత పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. కనీసం ఆయన జాడ కూడా ఎవరికీ తెలియడంలేదు. ఆయన ఎవరో కాదు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌.

లగడపాటి రాజగోపాల్‌ అంటే తెలుగు రాజకీయాల్లో చుపరిచితులు. మీడియాలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన రాజగోపాల్‌ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించడంలేదు. కనీసం సోషల్‌ మీడియా వేదికగా వినిపించలేదు. గత రెండు నెలలుగా అమరావతి ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో లగడపాటి బయటకొస్తారని అందరూ భావించారు. కానీ లగడపాటి కంటికి కనిపించడంలేదు.

రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రకు మద్ధతుగా లగడపాటి ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. నేరుగా తెలంగాణా వాదులతో తలపడ్డారు. ఏపీ విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని, ఇలా జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెగేసి చెప్పారు. అయితే రాజగోపాల్‌ ప్రకటనకు భిన్నంగా విభజన జరిగింది. చెప్పిన మాటకు కట్టుబడి ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా సర్వేల పేరుతో ఆయన ఏపీ రాజకీయాల్లో కొనసాగారు.

రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూనే లగడపాటి ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పేవారు. కొంచె అటో ఇటో ఆయన చెప్పిన సర్వేలు 2014 వరకు నిజయమయ్యాయి. 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న లగడపాటి ఆ ఎన్నికల్లో టీడీపీకి సానుకూలంగా వ్యవహరించారు. లగడపాటి సర్వే ప్రకారమే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబుతో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు.

2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన లగడపాటి బొక్కబోర్లా పడ్డారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ ఏపీలో తిరిగి చంద్రబాబు పార్టీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇక్కడ కూడా లగడపాటి లెక్క తప్పింది. లగడపాటి జోస్యంపై నమ్మకంతో పందేలు కాసిన వారు భారీగా నష్టపోయారు. కనపడితే ఎక్కడ కొడతారోనన్న భయంతో లగడపాటి అప్పటి నుంచి కనిపించడంలేదన్న చలోక్తులు వినిపించాయి. పారిశ్రామిక వేత్త అయినా లగడపాటి ప్రస్తుతం రాజకీయపరమైన అంశాల జోలికి వెళ్లకుండా తన వ్యాపారంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp