పార్టీ మారి కనపడకుండా పోయిన జూపూడి

By Karthik P Feb. 20, 2020, 12:26 pm IST
పార్టీ మారి కనపడకుండా పోయిన జూపూడి

అధికారం ఎక్కడ ఉంటే ఆ నేత అక్కడుంటారన్న పేరుంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారి సరసనే చేరి అందలం ఎక్కడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మారాడంతో ఆయన కూడా ప్లేట్‌ తిప్పేశారు. అధికార వైఎస్సార్‌సీపీలో చేరిన తర్వాత ఆ నాయకుడు పత్తాలేకుండా పోయారు. అయన ఎవరో కాదు మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న జూపూడి ప్రభాకర్‌ మాల మహానాడు అధ్యక్షులుగా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసి వెలుగులోకి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్‌ చలువతో ఎమ్మెల్సీ అయ్యారు. వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉన్న నేతల్లో జూపూడి ఒకరు. మంచి వాగ్ధాటి కలిగిన జూపూడి వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించారు. అప్పట్లో అంబటి రాంబాబు, జూపూడి ప్రభాకర్‌లే వైఎస్సార్‌సీపీ గొంతును మీడియాలోనూ, టీవీ ఛానెల్‌ చర్చల్లోనూ వినిపించారు. వైఎస్‌ జగన్‌పై ఈగ కూడా వాలనిచ్చే వారు కాదు. కాంగ్రెస్‌ పార్టీని, చంద్రబాబును జూపూడి ప్రభాకర్‌ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు.

2014 శాసన సభ ఎన్నికల్లో జూపూడి ప్రకాశం జిల్లా కొండపి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. జూపూడిపై టీడీపీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి 4,436 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన ఓటమిపై జూపూడి ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ఓటమి తర్వాత ఆయన వైఎస్సార్‌సీపీని వదిలి టీడీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌పై, వైఎస్సార్‌సీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక దశలో వైఎస్సార్‌సీపీ అసలు పార్టీయే కాదని, వైఎస్‌ జగన్‌ నాయకుడే కాదంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో.. టీడీపీలోకి వెళ్లిన తర్వాత వైఎస్‌ జగన్‌పై కూడా అదే స్థాయిలో దుమ్మెత్తిపోశారు. జగన్‌ తిడితే చాలు పదవి వస్తుందని టీడీపీ నేతలు భావించేలా.. జూపూడిని చంద్రబాబు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. 2019లో టీడీపీ తరఫున కొండపి అసెంబ్లీ సీటు జూపూడి ఆశించినా దక్కలేదు.

2019లో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో గెలిసింది. ఇక ఒక్క క్షణం ఆగకుండా జూపూడి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. స్వయంగా వైఎస్‌ జగనే జూపూడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపూడిని పార్టీలో చేర్చుకోవడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వైఎస్‌ జగన్‌ను, పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించిన జూపూడిని ఎలా పార్టీలోకి తీసుకుంటారని సోషల్‌ మీడియాలోనూ ప్రశ్నల వర్షం కురిచింది. అయితే బాస్‌ నిర్ణయమే ఫైనల్‌ కావడంతో ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది.

అయితే పార్టీలో చేరినప్పటి నుంచీ జూపూడి కనిపించడంలేదు. ఎప్పుడూ మీడియా సమావేశాలు, టీవీ డిబేట్లలో చురుకుగా కనిపించే జూపూడి పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. ప్రారంభంలో పార్టీ కార్యాలయంలో ఒకటి రెండు సార్లు ప్రెస్‌మీట్‌లు పెట్టేందుకు యత్నించినా పార్టీ నుంచి అనుమతి రాలేదట. వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో మౌనంగా ఉండడమే మేలని మిన్నుకుండిపోయారని పరిశీలకులు చెబుతున్నారు. పలు కార్యక్రమాలకు కొండపి వెళ్లివస్తున్నట్లు చెబుతున్నారు.

తిరిగి కొండపిపై జూపూడి దృష్టిపెట్టడంతో స్థానిక కో ఆర్డినేటర్‌ వెంకయ్య వర్గంలో అలజడి రేగుతోంది. జూపూడి ఏదైనా పదవి కోసం చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, 2019లో చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడంతో కొండపి స్థానం వైఎస్సార్‌సీపీ చేజార్చుకుంది. తాజాగా జూపూడి రాకతో.. కొండపిలో మళ్లీ గ్రూపు రాజకీయం ప్రారంభమయ్యే అవకాశం స్పషంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత.. కొండపి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp