విశాఖ రైల్వే జోన్ మాటేంటి?

By Kalyan.S Jul. 30, 2021, 09:30 am IST
విశాఖ రైల్వే జోన్ మాటేంటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మూడు రాజధానులు త్వ‌ర‌లో ఏర్పాటు అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే జ‌రిగితే విశాఖ‌ప‌ట్ట‌ణం కార్యనిర్వాహక రాజధాని కానుంది. అంటే.. ఆ ప్రాంత ప్రాధాన్యం మ‌రింత పెరుగుతుంది. ఈ క్ర‌మంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్ప‌డితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. మ‌రి కేంద్రం ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటుందా? విభ‌జ‌న చ‌ట్టంలోని హామీ నెర‌వేరుస్తుందా? పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో అలాంటి ప్ర‌క‌ట‌న ఏమైనా వ‌స్తుందా?

ఏపీలో కీల‌క ప‌రిశ్ర‌మ అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామ‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. గ‌త స‌మావేశాల్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాలేదు. పైగా.. వాల్తేరు లేకుండా రైల్వేజోన్ ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉంటాయ‌న్న సంకేతాలు పంపింది. అంతేకాకుండా రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్దిష్ట గడువు ఏమీ లేద‌ని పేర్కొంది. దీంతో రైల్వే జోన్ ఏర్పాటుపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజా పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా విశాఖ రైల్వేజోన్ కోసం వైసీపీ ఎంపీలు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న సంద‌ర్భంగా 2014లో కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కొన్ని హామీలు ఇచ్చింది. వాటిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఉంది. అయితే, చంద్ర‌బాబు పుణ్య‌మా అని ప్రత్యేక హోదా నుంచి త‌ప్పించుకునేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఓ దిశ‌లో ఇవ్వలేమని కూడా తేల్చేసింది. మ‌రో ప్ర‌ధాన విభజన హామీ విశాఖ రైల్వే జోన్‌. దక్షిణ మధ్య రైల్వేతో పాటు తూర్పు సరిహద్దు రైల్వేలోని నాలుగు డివిజన్లను కలిపి ఈ కొత్త జోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రం రెండేళ్ల ముందు ప్రకటించింది. ఎప్పుడు, ఏంట‌నే నిర్ధిష్ట‌మైన అంశాల‌ను పొందుప‌ర‌చ‌క‌పోవ‌డంతో అది డైలమాలో ప‌డింది.

అయితే.. గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రైల్వే జోన్ పై వివ‌ర‌ణ ఇచ్చినా అందులో ఓ మ‌త‌ల‌బు చేర్చింది. విశాఖలో ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో మొత్తం నాలుగు డివిజ‌న్లు చేర్చాలని గతంలో నిర్ణయించారు. వీటిలో విజయవాడ, వాల్తేరు, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు చేర్చాల్సి ఉంది. కానీ గ‌త స‌మావేశాల్లో మాట్లాడిన రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్... వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వేజోన్‌లో కలిపే అవకాశం లేదన్నారు. అంటే తూర్పు సరిహద్దు రైల్వేలోని ఇది కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వాల్తేరు లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కావడం తథ్యంగా క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే రైల్వే జోన్ విష‌యంలో కూడా ఏపీకి కొంత నిరాశ ఎదురైన‌ట్లే.

ఏపీ ఎంపీలు విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలంటూ కేంద్రాన్ని ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. ప్ర‌స్తుత స‌మావేశాల్లో కూడా ఆ డిమాండ్ ను లేవ‌నెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి 13 వేల కోట్ల రూపాయల ఆదాయం రానుంది. దేశంలోనే అత్యధిక లాభసాటి అయిన జోన్‌గా విశాఖ రాణించే అవ‌కాశాలు ఉన్నాయి. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టులకు ఈ జోన్‌ ద్వారా అందించే రైలు రవాణా సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. దీని వలన రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ఎంతగానో అవసరమైన రవాణా అవసరాలు నెరవేరతాయి. రైల్వేకి కూడా గణనీయమైన ఆదాయం లభిస్తుంది.

ఈ విష‌య‌మై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను క‌లిశారు. రెండేళ్ల ముందు చేసిన ప్ర‌క‌ట‌న‌ను గుర్తుచేశారు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌ల అమలును వేగవంతం చేయాలని కోరుతూ వారంతా సంతకం చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. వాల్తేరు డివిజన్‌ను కూడా విశాఖ కేంద్రగానే కొనసాగించాలన్నారు.

దేశంలోని కొన్ని రైల్వే జోన్లకంటే కూడా వాల్తేరు డివిజన్‌ అత్యధిక ఆదాయం సంపాదిస్తోంది. పోల‌వ‌రం నిధుల‌ను రాబ‌ట్టుకోవ‌డంలో కొంత స‌ఫ‌ల‌మైన వైసీపీ ఎంపీలు విశాఖ రైల్వే జోన్ కోసం త‌మ క‌ర్త‌వ్యం నెర‌వేరుస్తున్నారు. మ‌రి వారి కృషి ఫ‌లించి విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇవ్వాల‌ని ఆశిద్దాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp