దాంట్లో త‌ప్పేముంది "రాజా". ఆ భూములు వెన‌క్కి తీసుకోవ‌డం స‌బ‌బేగా..!

By Kalyan.S Jul. 02, 2020, 05:20 pm IST
దాంట్లో త‌ప్పేముంది "రాజా".  ఆ భూములు వెన‌క్కి తీసుకోవ‌డం స‌బ‌బేగా..!

రాష్ట్రానికి ఓ కంపెనీ వ‌స్తోందంటే.. ఏ ప్ర‌భుత్వమైనా ఆహ్వానిస్తోంది. కావాల్సిన భూమితో పాటు మ‌రిన్ని ప్రోత్సా‌హ‌కాలు అందిస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ వ‌ల్ల రాష్ట్రానికి, స్థానిక ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో. అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌క‌పోతే.. నిబంధ‌న‌ల‌ను ఆ కంపెనీ పాటించ‌క‌పోతే.. ఆ భూముల‌ను వెన‌క్కి తీసుకునే అధికారం ప్ర‌భుత్వాల‌కు ఉంటుంది. అమ‌ర్ రాజా కంపెనీ విష‌యంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అదే చేసింది.

అస‌లు క‌థ ఏమిటంటే...

అమ‌ర్ రాజా గ్రూపున‌కు చెందిన అమ‌ర్ రాజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ చిత్తూరు జిల్లాలో డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ పేరిట ఓ సెజ్ ను అభివృద్ది చేస్తామ‌ని వైఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో ప్ర‌తిపాద‌న‌లు తీసుకొచ్చింది. వాటిని ప‌రిశీలించిన వైఎస్ఆర్ ప్ర‌భుత్వం ఆ కంపెనీ వ‌స్తే చిత్తూరు జిల్లా వాసుల‌కు ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌డంతో పాటు ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంద‌న్న స‌దుద్ధేశంతో ఆ కంపెనీకి 483.27 ఎక‌రాల‌ను నాటి ప్ర‌భుత్వం అప్ప‌గించింది. 2009 ఫిబ్ర‌వ‌రిలో ఈ మేర‌కు ఉత్త‌ర్వులు ఇచ్చింది. నిబంధ‌న‌ల మేర‌కు దానిని స‌ద్వినియోగం చేయ‌ని ఎడ‌ల వెన‌క్కి తీసుకునే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఉంద‌ని కూడా ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

ఏం జ‌రిగిందంటే...

కంపెనీ ఏర్పాటు పేరుతో 483.27 ఎక‌రాలు తీసుకున్న అమ‌ర్ రాజా ఇన్ ఫ్రాటెక్ దాన్ని పూర్తి స్తాయిలో స‌ద్వినియోగం చేయ‌లేదు. కానీ.. సెజ్‌ ఏర్పాటై పదేళ్లయినా 229.66 ఎకరాలను మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుంది. మిగ‌తా భూమి ఇన్నాళ్లూ నిరుప‌‌యోగంగానే ఉంది. కానీ వైఎస్ఆర్ అనంత‌రం అధికారం చేప‌ట్టిన పాల‌కులెవ్వ‌రూ నిరూప‌యోగ భూముల‌పై దృష్టి పెట్ట‌లేదు. ఇప్పుడు తాజాగా.. చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌కు ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు కేటాయించిన భూమిలో కంపెనీ ఉప‌యోగించ‌ని 253.61 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌. కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించింది.

నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయంటే...

ఏ సంస్థ అయినా ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు ప్ర‌భుత్వం నుంచి భూమి తీసుకున్న‌ప్పుడు ఆయా ప్ర‌భుత్వాలు కొన్ని ష‌ర‌తులు విధిస్తాయి. అలాగే అమ‌ర్ రాజా ఇన్‌ఫ్రా కు కూడా నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. వాటి ప్ర‌కారం... స‌ద‌రు కంపెనీ రెండేళ్ల‌లో ఆ స్థ‌లంలో ఫ్యాక్ట‌రీ నిర్మించాలి. సుమారు 20 వేల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాలి. కానీ.. దాదాపు ప‌దేళ్లు దాటినా.. అమ‌ర్ రాజా కంపెనీ అవేమీ చేయ‌లేదు. అందుకే ప్ర‌భుత్వం ఆ భూముల‌ను వెన‌క్కి తీసుకుంది.

40 ఏళ్ల అనుభ‌వ‌శాలికి ఈ నిబంధ‌న‌లు తెలియ‌వా..!

ప్ర‌భుత్వం చ‌ట్ట ప్ర‌కారం ప‌ని చేయ‌డం కూడా టీడీపీ పెద్ద‌ల‌కు కంటి విడుపుగా ఉండ‌డం లేన‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ తెగ బాధ‌ప‌డిపోతున్నారు. ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌ని చేస్తున్నా.. ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. త‌గ‌దునమ్మా.. అంటూ చోటా నేత‌లు కూడా ప‌ల్ల‌వి అందుకుంటున్నారు. మ‌రోవైపు.. టీడీపీ చేప‌డుతున్న దుష్ప్ర‌చారాల‌పై రాజ‌కీయ విశ్లేష‌కులు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌శాలిని అని చెప్పుకునే చంద్ర‌బాబుకు పారిశ్రామిక నిబంధ‌న‌లు తెలియ‌వా.. అంటూ ఆశ్చ‌ర్యం చెందుతున్నారు. ప్ర‌తి దానికీ రాద్ధాంత చేయ‌డం త‌గ‌ద‌ని, అలా చేస్తే పార్టీ ఉనికికే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp