ఈట‌ల మ‌దిలో ఏముంది..?

By Kalyan.S May. 14, 2021, 09:00 am IST
ఈట‌ల మ‌దిలో ఏముంది..?

ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయాలు తెలంగాణ‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మంత్రిగా భ‌ర్త‌ర‌ఫ్ చేసిన అనంత‌రం కేసీఆర్ స‌ర్కార్ పై ధిక్కార స్వ‌రం ఎత్తిన ఆయ‌న రోజుకో నేత‌ను క‌లుస్తూ త‌ర‌చూ వార్త‌ల్లో ఉంటున్నారు. ఇప్ప‌టికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొన‌సాగుతూ, ఆ పార్టీకి వ్య‌తిరేకంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే ప‌నిలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బ‌రిలో నిలిచి స‌త్తా చాటాల‌నేది ఆయ‌న వ్యూహంగా క‌నిపిస్తోంది. రాజీనామాకు ఇది స‌మ‌యం కాద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. కానీ, త‌ర‌చూ ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌ను, ఉద్య‌మ నేత‌ల‌ను, అనుచ‌రుల‌తో భేటీలు మాత్రం కొన‌సాగిస్తున్నారు. పార్టీల‌తో సంబంధం లేకుండా కేసీఆర్ ను వ్య‌తిరేకించే అంద‌రినీ క‌లుస్తుండ‌డం ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. కాంగ్రెస్, బీజేపీ మాజీ నాయ‌కుల‌తో పాటు ప్ర‌స్తుత ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను కూడా ఈట‌ల క‌లుస్తున్నారు.

ఆత్మ గౌరవ పోరా..? ప్ర‌భుత్వ‌ వ్య‌తిరేక పోరా

ఇప్ప‌టికీ ప‌లు మీడియా స‌మావేశాలు, ఇంట‌ర్వ్యూల‌లో కేసీఆర్ ను సార్ అని సంబోధిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేయ‌లేదు. టీఆర్ఎస్ కూడా పార్టీ నుంచి రాజేంద‌ర్ ను స‌స్పెండ్ చేయ‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ స‌మావేశంలో సీఎం కేసీఆర్ ఈట‌ల వ్య‌వ‌హారంపై స్పందిస్తూ.. రాజేంద‌ర్ త‌ప్పు చేసి ఒప్పుకున్నాడ‌ని, అందుకే కొన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అన్నారు. తెలిసి కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే అది ప‌ద్ధ‌తి కాద‌ని, ఇక ఈ విష‌యంపై ఎవ‌రూ చ‌ర్చించ‌వ‌ద్ద‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. రాజేంద‌ర్ మాత్రం ప్ర‌స్తుతానికి స‌ర్కార్ పై సైలెంట్ పోరు కొన‌సాగిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇది ఆత్మ గౌర‌వ పోరాట‌మ‌ని మొద‌ట్లో పేర్కొన్న రాజేంద‌ర్.. ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న తీరు చూస్తే భిన్నంగా క‌నిపిస్తోంది.

వారం రోజులుగా ఈటల వరుసగా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు రాములు నాయక్ త‌దిత‌ర నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌తో కూడా భేటీ అయ్యారు. బుధవారం ఆయన టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. అదే సమయంలో డి శ్రీనివాస్ తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్ తో కూడా ఆయన విడిగా చర్చించారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా ఆయన టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. త్వ‌ర‌లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో కూడా భేటీ అవుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. డి.శ్రీ‌నివాస్ ఇప్ప‌టికీ టీఆర్ఎస్ లోనే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న కూడా కేసీఆర్ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన వాళ్ల‌లో ఒక‌రు. ఈట‌ల భేటీల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

కొత్త పార్టీ అనివార్య‌మా?

భూకబ్జా ఆరోపణలతో సీఎం కేసీఆర్ ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్ప‌టి నుంచీ ఈటల తన భవిష్యత్ రాజకీయ వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు. కొత్త పార్టీ పెడతారా పెడతారా పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలో దిగి ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుతారా అన్న ప్రశ్నలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ఎమ్మెల్యే ప‌ద‌వి రాజీనామాపై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు గానీ, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న పెద‌వి విప్ప‌లేదు.

రోజుకో నేతతో బేటీ అవుతూ ప్రజా హక్కుల సంఘాల నేతలను కలుస్తూ త‌న‌పై కేసీఆర్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించిన తీరు చెబుతూ సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నారు కానీ, తన ఆంతర్యం ఏమిటో బయటకి తెలియకుండా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈటల వ్యవహారాన్ని గమనిస్తున్న రాజకీయ వర్గాలు కొత్తపార్టీ పెట్టడం ఖాయమనే అభిప్రాయానికి వస్తున్నాయి. టీఆర్ ఎస్ లో తాను ఇమడలేనని నిశ్చయించుకోవడంతోనే సీఎం పై తన నిరసన గళాన్ని పెంచుతూ వస్తున్నారని అభిప్రాయప‌డుతున్నారు. కాంగ్రెస్ కు గ‌తంలో రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మ‌దిలో కూడా కొత్త పార్టీ ఆలోచ‌న ఉన్న‌ట్లు ఆయ‌న వ్యాఖ్య‌ల ద్వారా తెలుస్తోంది. ఈయ‌న కూడా ఈట‌ల‌తో ఇటీవ‌ల భేటీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో కొత్త రాజ‌కీయాలు తెర‌పైకి రానున్నాయ‌ని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp