కరుణానిధి చెప్పిందే నిజమైంది..!

By Kalyan.S May. 08, 2021, 07:29 am IST
కరుణానిధి చెప్పిందే నిజమైంది..!

పది సంవత్సరాల తర్వాత తమిళనాడులో మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఈ కాలంలో తొలి ఐదేళ్లలో అయితే డీఎంకే పరిస్థితి చాలా దారుణంగా మారింది. నాటి డీఎంకే అధినేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సైతం జయ రాజకీయాల నుంచి పార్టీని గాడిన పెట్టలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ సందర్భంలో ‘పార్టీ భవిష్యత్తు స్టాలినే..’ అంటూ కరుణానిధి ఆరేళ్ల క్రితం వ్యాఖ్యానించారు. ఆ మాట నేడు నిజమైంది.

2016లో డీఎంకే వరుసగా రెండోమారు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలుకావడం, అన్నాడీఎంకే మరింత బలోపేతం కావడం, ఆ పార్టీకి కేంద్రంలోని బీజేపీ తోడవడం, ఇంటిపోరులో భాగంగా సోదరుడు ఎంకే అళగిరి తలనొప్పిగా మారడం తదితర కారణాలతో డీఎంకే కుదేలైపోతుందని అందరూ భావించారు. కానీ, వారి అంచనాలను పటాపంచలు చేస్తూ 68 ఏళ్ల స్టాలిన్‌ పడిలేచిన కెరటంలా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠమెక్కారు. దీంతో నాడు కరుణానిధి చెప్పిన మాటల్ని పలువురు సీనియర్‌ నేతలు గుర్తు చేసుకున్నారు.

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా దివంగత మాజీ సీఎం కరుణానిధి చిన్నకుమారుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయడంతో పార్టీలో జోష్‌ పెరిగింది.‘ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ అనే నేను..’ అంటూ తన తాత, తండ్రుల పేర్లను కలుపుకొని స్టాలిన్‌ ప్రమాణస్వీకారం మొదలుపెట్టగానే ఆయన సతీమణి దుర్గ, కుమారుడు ఉదయనిధి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణస్వీకారం సందర్భంగా స్టాలిన్‌ మొత్తం 33 మంది మంత్రులు, తన కుటుంబీకులతో పాటు రాజకీయ చాణక్యుడు, తనకు సలహాలను అందించిన ప్రశాంత్‌ కిశోర్‌ను కూడా గవర్నర్‌కు ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం, అన్నాడీఎంకే నేత ఒ.పన్నీర్‌సెల్వంలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు. అదేవిధంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తరఫున ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్‌ బెనర్జీ వచ్చి స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం స్టాలిన్‌ మెరీనాబీచ్‌లోనే తన తండ్రి కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, ద్రవిడ సిద్ధాంత రూపకర్త పెరియార్‌ తదితరుల సమాధుల వద్ద అంజలి ఘటించారు. అంతకుముందు తన మాతృమూర్తి దయాళు అమ్మాళ్‌, సవతితల్లి రాజాత్తి అమ్మాళ్‌ల ఆశీస్సులు పొందిన అనంతరం ప్రమాణస్వీకారానికి వచ్చారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్‌ తొలిరోజు ఐదుఫైళ్లపై సంతకం చేశారు. రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులందరికీ కొవిడ్‌సాయంగా రూ.4 వేలు అందిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తొలి విడత తలా రూ.2 వేల చొప్పున ఇచ్చే ఫైల్‌పై సంతకం చేశారు. ఆర్డినరీ సిటీబస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాల ఽధర తగ్గింపు, కరోనా బాధితులకు అయ్యే ఖర్చు ముఖ్యమంత్రి బీమా కింద అందించడం, తన రాష్ట్ర పర్యటన సందర్భంగా అందిన వినతులను పరిష్కరించేందుకు అనువుగా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తూ సంతకం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp