చంద్రబాబు కుప్పం పర్యటన ఎందుకు రద్దు అయింది...?

By Karthik P Oct. 12, 2021, 01:00 pm IST
చంద్రబాబు కుప్పం పర్యటన ఎందుకు రద్దు అయింది...?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో తలపెట్టిన మూడు రోజుల పర్యటన రద్దు అయింది. దీనికి కార ణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే అని చెబుతూ టీడీపీ కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ పేరుపై పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

రాజకీయ నేతల పర్యటనలు రద్దు అవడం సహజమే అయినా.. తాజాగా చంద్రబాబు పర్యటన రద్దు కావడంపై భిన్నాభిప్రాయాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. ఒక్క రోజు ముందు పర్యటనను అర్థంతరంగా రద్దు చేసుకున్నారు. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే కారణమని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారంపై టీడీపీ మౌనాన్నే ఆశ్రయించింది. సాధారణంగా చంద్రబాబు, లోకేష్‌లపై ఏదైనా అసత్య ప్రచారం జరిగితే.. ఫేక్‌ అంటూ వెంటనే టీడీపీ ఫేస్‌బుక్‌ పేజీలో కౌంటర్‌ ఇచ్చేవారు. కానీ చంద్రబాబుకు అనారోగ్యం అనే ప్రచారం విషయంలో మాత్రం టీడీపీ నుంచి స్పందన లేదు.

Also Read : పొత్తు కుదిరితే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేల‌కు తిప్ప‌లే..!

మరో కారణం.. చంద్రబాబు పర్యటనకు స్థానికంగా అంతా సిద్ధం చేయలేదని వినిపిస్తోంది. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కుప్పం మండల పరిషత్‌ కూడా వైసీపీ వశమయింది. ఈ పరిణామాలను స్థానిక టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. చంద్రబాబు అలసత్వమే పార్టీ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ విజయంపై అక్కసు పెంచుకున్న టీడీపీ శ్రేణులు.. నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశాయి. టీడీపీ ఓటమిపై శ్రేణులను సముదాయించే పని స్థానిక నేతలు చేస్తున్నా.. ఇంకా పరిస్థితి సద్దుమణగలేదు.

పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 89 పంచాయతీలకు గాను 74 చోట్ల వైసీపీ జెండా ఎగిరింది. నష్టనివారణ చేపట్టేందుకు, శ్రేణుల్లో ఆత్మసై్థర్యాన్ని నింపేందుకు ఫలితాల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 25,26,27 తేదీల్లోనూ చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆ సమయంలో పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏకంగా నాయకత్వ మార్పునే టీడీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఎందుటే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను దించాలంటూ తమ్ముళ్లు నినాదాలు చేశారు. ఈ డిమాండ్‌ ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. పలు నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ రావాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

Also Read : చంద్ర‌బాబు రెండు స్థానాల్లో పోటీ చేయ‌నున్నారా?

తాజాగా పరిషత్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ చంద్రబాబు మూడు రోజుల పర్యటనను పెట్టుకున్నారు. పంచాయతీ ఫలితాల తర్వాత చేసిన పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు, తాజా పర్యటనలోనూ తలెత్తుతాయనే ఆందోళన చంద్రబాబులో నెలకొంది. అదే జరిగితే.. మరోసారి జూనియర్‌ ఎన్టీఆర్‌కు పార్టీని అప్పగించాలనే డిమాండ్‌ వినిపిస్తుంది. సొంత నియోజకవర్గంలో రెండోసారి ఈ డిమాండ్‌ వినిపిస్తే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను కట్టడి చేయలేమని, పార్టీపై తన అదుపు పూర్తిగా తప్పుతుందనే భావనతోనే.. శ్రేణులను సముదాయించిన తర్వాతనే పర్యటించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp