అక్కడ వైసీపీ కో ఆర్డినేటర్‌ను మార్చేస్తున్నారట..!!

By Voleti Divakar Dec. 29, 2020, 07:15 pm IST
అక్కడ వైసీపీ కో ఆర్డినేటర్‌ను మార్చేస్తున్నారట..!!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందంటారు. అటు పూర్తిగా పట్టణం కాక, ఇటు పూర్తిగా పల్లెటూరు కాని స్థితిలో ఉండే ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటముల గురించి అంచనా వేయడం క్లిష్టమైన ప్రక్రియగానే ఎప్పుడూ చెబుతారు.

ఇక్కడ గత రెండు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఆకుల వీర్రాజు ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి, దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అనుచరుడిగా, ఆ కుటుంబానికి ఆప్తుడిగా ఉన్న వీర్రాజు 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున బరిలోనిలిచారు. అప్పుడు టీడీపీ అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్యచౌదరితో జరిగిన పోటీలో సుమారు 18వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు. అయితే ఆ తరువాత కూడా పార్టీ కేడర్‌ను అంటిబెట్టుకునే ఉంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు.

2019 ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ తరపున సీటు వీర్రాజునే వరించింది. అయితే ఈ సారి జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్‌ రూపంలో వీర్రాజు విజయాన్ని అడ్డుకున్నారని చెబుతారు పరిశీలకులు. జనసేనకు కంచుకోటగా చెప్పుకున్న రూరల్‌ నియోజకవర్గంలో ఆ పార్టీ 42,000 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం అయిపోయింది. అయితే వీర్రాజు ఈ సారి 10వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ట్రయాంగిల్‌ పోటీల్లో తెలుగుదేశం పార్టీకే మొగ్గు ఉంటుందని ఈ నియోజకవర్గానికి పేరు. 2014లో కూడా అదే నిజమై బీజేపీ పొత్తు, పవన్‌ జనసేన మద్ధతుతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి మరోసారి విజయం సాధించగలిగారు. ఇక్కడ టీడీపీ పార్టీ గొప్పదనాని కంటే కూడా జనసేన కారణంగానే ఆకుల వీర్రాజు ఓటమి పాలయ్యారన్న టాక్‌ నడుస్తుంది. దీనికి వైఎస్సార్‌సీపీలోనే కొందరి నాయకులు లోపాయికారీగా జనసేనకు మద్దతుగా నిలిచారని కూడా అప్పట్లో చెప్పుకునేవారు.

జనసేనకు, టీడీపీకి మాత్రమే పోటీ అంటూ ఎన్నికల ముందు భారీగానే ఊహాగానాలు కూడా చెలరేగాయి. కానీ అందుకు పూర్తిభిన్నంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే పోటీ నడిచింది. ఇందుకు ఆకుల వీర్రాజు వ్యక్తిగత ఇమేజే కారణంగా చెబుతారు. ఓటమి పాలైనప్పటికీ ఆకుల వీర్రాజు కేడర్‌కు పూర్తిస్థాయిలోనే అందుబాటులో ఉంటూ వస్తున్నారు. కరోనా కారణంగా ఎవ్వరూ ఇంట్లో నుంచి బైటకు రావడానికి కూడా భయపడే పరిస్థితుల్లో వీర్రాజుతో పాట అతని కుమారులు ఆకుల బాపిరాజు, విజయ్‌కుమార్‌లు నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వచ్చారు. ఆ తరువాత కూడా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నారు.

పార్టీకి ఇంతగా ఉపయోగపడుతున్న ఆకుల వీర్రాజును కో ఆర్డినేటర్‌ పదవి నుంచి తప్పిస్తారన్న పుకార్లు ఇటీవల ఎక్కువ కావడంతో నియోజకవర్గంలోని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వీర్రాజు వ్యతిరేక వర్గం ఈ పుకార్లను ప్రోత్సహిస్తుండడంతో ఇవి మరింతగా ప్రచారం పొందుతున్నాయంటున్నారు.

మార్చాల్సిన అవసరమేంటి..?

రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ పటిష్ట స్థితిలోనే ఉంది. 151 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన స్థానాల్లో కో ఆర్డినేటర్‌లు పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కో ఆర్డినేటర్లు మార్పులు, చేర్పులకు ఇప్పుడు పార్టీ దృష్టిపెట్టలేదన్న విషయం ఆ పార్టీ ఉన్నత స్థాయి నాయకుల నుంచి విన్పిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆకుల వీర్రాజు మార్చడం అన్న కాన్సెప్ట్‌ను పార్టీ పెట్టుకోలేదంటున్నారు. ఇన్‌ఛార్జి బాధ్యతలు వహిస్తున్న వ్యక్తి తనకప్పగించిన బాధ్యతలకు న్యాయం చేయకపోతేనే మార్పులు, చేర్పులు అన్నవి వస్తుంటాయి. అది కూడా ఎన్నికల ముందు మాత్రమే జరుగుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా రూరల్‌ నియోజకవర్గం కో ఆర్డినేటర్‌ వీర్రాజు పట్ల పుకార్లు షికారు చేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పార్టీ పట్ల నిబద్దతతో పనిచేస్తున్న వారిలో విరక్తిని పుట్టించేందుకు ఆడుతున్న మైండ్‌గేమ్‌గా కూడా పలువురు అభివర్ణిస్తున్నారు.

ఇటీవలే పార్టీలోకి కొందరు నాయకులను ఆకుల వీర్రాజు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు పార్టీలో ఉన్న వారిలో గుబులు మొదలైందని వీర్రాజు వర్గీయులు చెబుతున్నారు. దీంతోనే లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ వీర్రాజుపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని సామాజికవర్గాలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్న ఆకుల వీర్రాజు పట్ల పుకార్లు పుట్టించడం ఆయన అనుచరుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోందంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp