పాదయాత్రలో వైఎస్‌కు వైద్యం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బిక్కిన ఇప్పుడు ఏంచేస్తున్నారు..?

By Jaswanth.T Jun. 18, 2021, 06:17 pm IST
పాదయాత్రలో వైఎస్‌కు వైద్యం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బిక్కిన ఇప్పుడు ఏంచేస్తున్నారు..?

రాజకీయాల్లో సీటు తెచ్చుకోవడం దగ్గర్నుంచే పోటీ మొదలవుతుదంటారు విశ్లేషకులు. ఒక సీటు మీద కన్ను ఉన్న ఆశావహులందర్నీ కాదని మనకు సీటు దక్కాలంటే అనేక రకాలైన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారనడంలో సందేహం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తనదైన శైలితో రాణించిన సంగిత వెంకటరెడ్డి (చినకాపు)తో పోటీ పడి 2004లో ఆలమూరు ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న డా. బిక్కిన కృష్ణార్జున చౌదరి అదే ఒరవడిని రాజకీయ జీవితంలో నిలుపుకోలేకపోయారంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.

2004 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హవాలో గెలుపొందినప్పటికీ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకోవడంలో మాత్రం కృష్ణార్జునచౌదరి వెనుకబడ్డారని వివరిస్తుంటారు. మండపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా.. ఒక రకంగా చెప్పాలంటే ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బిక్కిన తాతబ్బాయి రాజకీయ వారసుడిగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇదే క్రమంలో కృష్ణార్జున చౌదరి భార్య బిక్కిన విజయ కూడా మండపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా విజయం సాధించారు.

వైద్యుడిగా కృష్ణార్జున చౌదరికి మండపేట కార్యస్థలమైనప్పటికీ దాదాపు ఆరు నియోజకవర్గాల పరిధిలో ఈయన చేత వైద్యం పొందేందుకు ప్రజలు ఎదురు చూస్తుండేవారు. డబ్బుల ప్రమేయం పెద్దగా లేకుండా వచ్చిన వారికి వచ్చినట్టే పరీక్షించి, మందులు సూచించి పంపించడం కృష్ణార్జునచౌదరి సై్టల్‌. ప్రత్యేకించి తనకంటూ ఒక కేబిన్‌.. ఆ కేబిన్‌లోకి వచ్చాకనే రోగులను పరీక్షించడం.. లాంటి కాన్సెప్టులేమీ ఆయన వద్ద ఉండేవి కాదు. మెడలో స్టెత్‌ వేసుకుని తన కోసం వేచి చూస్తున్న రోగుల దగ్గరకు స్వయంగా వచ్చి పరీక్షించేవారు. పక్కనే నర్సులు ఉండి ఆయనకు అవసరమైన పరికరాలను అందిస్తుండేవారు. ఈ రకమైన ట్రీట్‌మెంట్‌ సై్టల్‌ ఆయన్ను సామాన్యులకు అత్యంత దగ్గర చేసిందనే చెప్పాలి. ప్రతి రోజు వందల సంఖ్యలోనే ఈయన వద్ద వైద్యం పొందేందుకు ప్రజలు వస్తుండేవారు.

Also Read : పూర్తిగా సైలెంట్‌ అయిన చిట్టూరి రవీంద్ర

స్వతహాగా కాంగ్రెస్‌ పార్టీకి ఫాలోవర్స్‌గా ఉన్న బిక్కన కుటుంబం అదే ఒరవడిని కొనసాగింది. ఈ క్రమంలోనే 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మధురపూడి వద్దకు వచ్చేసరికి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారం రోజుల పాటు రాత్రింబవళ్ళు ఆయన వద్దే ఉండి కృష్ణార్జునచౌదరి వైద్యం అందించారు. తద్వారా రాష్ట్రవాప్తంగా ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగింది.

అప్పటికే ఆలమూరు నియోజకర్గ నుంచి రాజకీయ ఉద్దండులు సంగిత వెంకటరెడ్డి ఎమ్మెల్యే టికెట్టుకు పోటీలో ఉన్నారు. అయితే యువకుడికి అవకాశం కల్పించే ఉద్దేశంతో డా. బిక్కినకు 2004 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇదే క్రమంలో బిక్కిన ఘన విజయం దక్కించుకున్నారు. అయితే ఆ తరువాత 2009లో కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలు పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో మూడో స్థానంతోనే కృష్ణార్జునచౌదరి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లో సైలెంట్‌ అయిపోయారు. అంతకు ముందు 1999లో కూడా పోటీ చేసి ఓటమిచెందారు.

ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. అడపాదడపా రాజకీయ కార్యక్రమాలకు మినహా పెద్దగా జనబాహుళ్యంలో కన్పిస్తున్న దాఖలాల్లేవు. ఉద్దండులతో పోటీ పడి విజయాలు సాధించినప్పటికీ దానిని నిలుపుకోవడంలో కృష్ణార్జునచౌదరి వెనుకబడిన కారణంగానే ఆయన రాజకీయ జీవితం తెరమరుగైనట్లుగా ఆ నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. విజయం సాధించినప్పుడు తనదైన వర్గాన్ని తయారు చేసుకోవడంలో ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించలేదని వివరిస్తున్నారు. ఏది ఏమైనా మంచి వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన కృష్ణార్జునచౌదరి రాజకీయాల్లో అదే ఒరవడిని నిలుపుకోకపోవడం బాధాకరమనే చెప్పాలి.

Also Read : ఎమ్మెల్సీ ఆశావాహులు ఆగాల్సిందేనా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp