గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రెకి దారెటు?

By Ritwika Ram Jun. 23, 2021, 12:30 pm IST
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రెకి దారెటు?

కొట్రికె మధుసూదన్ గుప్తా.. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసి నేషనల్ మీడియాకు ఎక్కిన జనసేన లీడర్. ‘మర్డర్లు చేయడం నాకు కొత్తకాదు’ అంటూ బహిరంగంగా కామెంట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే. అయితే నాటి ఎన్నికల్లో ఎంత హడావుడి చేసినా.. మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ మీదుగా జనసేనలోకి వెళ్లిన కొట్రికె.. ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు.

పెద్ద వ్యాపారస్తుల ఫ్యామిలీ నుంచి వచ్చిన కొట్రికె మధుసూదన్ గుప్తా.. 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదంతో ఎన్నికల్లో పోటీ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన గుంతకల్లు నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హవాలో టీడీపీ సీనియర్ నేత సాయినాథ్ గౌడ్‌పై 9 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తన తండ్రి పద్మనాభయ్య శెట్టికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తను ఎమ్మెల్యేగా నెగ్గడం వైఎస్సార్ చలువే అని మధుసూదన్ గుప్తా గతంలో చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం కావడంతో 2014 ఎన్నికల్లో ఈయన ఏ పార్టీ తరఫునా పోటీ చేయలేదు. కానీ 2017లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర గుంతకల్లు నియోజకవర్గంలో జరుగుతున్న సమయంలో జగన్ను గుప్తా కలిశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ తో కలిసి పని చేసిన అనుభవం ఉందని.. ఆ అనుబంధంతోనే జగన్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించినట్టు అప్పట్లో చెప్పారు. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, పార్టీ టికెట్ పై పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. వైసీపీ తరఫున పోటీ చేసేందుకు ఆయనకు కూడా ప్రయత్నాలు సాగించారు. కానీ ఏమైందో ఏమో అలాంటిదేమీ జరగలేదు. 2014లో పోటీ చేసిన వై.వెంకటరామరెడ్డినే మరోసారి బరిలో నిలిపారు జగన్.

Also Read : వీర్రాజు.. ఇలా అయితే కష్టం..!

2019 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మధుసూదన గుప్తా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి ద్వారా గుంతకల్లు టికెట్ తెచ్చుకోవాలని గుప్తా ప్రయత్నాలు చేశారు. టీడీపీ టికెట్ తనకే వస్తుందని భావించి ప్రచారం కూడా చేశారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. అప్పటికే కొన్ని సార్లు మధుసూదన గుప్తా, జితేంద్రగౌడ్ వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి.

టీడీపీ టికెట్ తనకు దక్కకపోవడంతో చివరికి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గుప్తా. ఆ వెంటనే జనసేన పార్టీ ఆయనకు టికెట్ కూడా ఇచ్చింది. ఎన్నికల్లో బాగానే హడావుడి చేశారు. పోలింగ్ సమయంలో ఏకంగా ఈవీఎం పగులగొట్టి వివాదం రేపారు. గుత్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను నేలకేసి కొట్టారు. అంత ప్రచారం.. ఇంత హడావుడితోపాటు వివాదాలు రేపినా.. మూడో స్థానంలో నిలిచారు. కనీసం 20 వేల ఓట్లు కూడా సాధించలేదు.

2019 ఎన్నికల తర్వాత మధుసూదన గుప్తా మళ్లీ సైలెంట్ అయ్యారు. గతంలో 2014 ఎన్నికల తర్వాత కూడా ఆయన ఇలానే రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు యాక్టివ్ అయ్యారు. రాబోయే 2024 ఎన్నికలకు ముందు మళ్లీ జనంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ 10 ఏళ్లు పూర్తిగా ప్రజా జీవితానికి దూరంగా ఉండటం, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు హడావుడి చేయడం.. గుప్తాకు మైనస్ పాయింట్. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీనే అక్కడ పూర్తవైభవం కోసం కొట్టుమిట్టాడుతోంది. ఇక పునాదులే సరిగ్గాలేని జనసేనలో ఉండటం, జనాల్లో తిరగకపోవడం, అధికార పార్టీకి ప్రజల్లో మరింత నమ్మకం పెరగడం.. ఆయనకు ప్రతికూల అంశాలు.

Also Read : 2019 ఎన్నికలను బాబు సీరియస్‌గా తీసుకోలేదా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp