కందుల దుర్గేష్ కు కాలం కలిసి వస్తుందా..?

By Voleti Divakar Apr. 02, 2021, 06:42 pm IST
కందుల దుర్గేష్ కు కాలం కలిసి వస్తుందా..?

ఆకట్టుకునే ప్రసంగాలు చేసే జన సేన అధికార ప్రతినిధి, పిఏసి సభ్యుడు కందుల దురేష్ ప్రజాక్షేత్రంలో మాత్రం ఓటర్లను ఆకట్టుకులేకపోతున్నారు. దుర్గేష్ ముత్తాత కెవిఆర్‌స్వామి, తాత పోతుల వీరభద్రరావులు మున్సిపల్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా సేవలందించారు. ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసినా వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం మాత్రం దుర్గేష్ కు దక్కలేదు.

దివంగత ఎమ్మెల్యే, రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ఎసివై రెడ్డి హయాంలో డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా కందుల దుర్గేష్ సేవలందించారు. ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ , దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ప్రోద్బలంతో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి లభించింది. 2007-2013 వరకు దురేష్ ఈ పదవిలో కొనసాగారు. ఆ తరువాత నుంచి ఆయనకు చట్ట సభలో అడుగుపెట్టే అవకాశం లభించలేదు.

రాజకీయ తప్పటడుగుల వల్లే కందుల దుర్గేష్ కు పదవులు వరించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ ద్వారా దురేష్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎస్ఎస్ యుఐ, యువజన కాంగ్రెస్ లో వివిధ పదవులు నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా దుర్గేష్ పనిచేశారు. మరోవైపు తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల సంక్షేమానికి, పర్యావరణ పరిరక్షణకు స్రవంతి స్వచ్చంద సంస్థ ద్వారా కృషిచేస్తున్నారు .

వైసిపి తరఫున పోటీ చేయాలని భావించినా..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరహాలోనే దుర్గేష్ వ్యవహారశైలి కూడా చిత్రంగా ఉంటుందని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తారు . రాష్ట్ర విభజన నేపథ్యంలో దుర్గేష్ రాజకీయ గురువు ఉండవల్లి అరుణ్ కుమార్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు . వైసిపిని స్థాపించిన నాటి నుంచి జక్కంపూడి రామ్మోహనరావు కుటుంబం ఆపార్టీని వెన్నంటి ఉంది. దుర్గేష్ మాత్రం కాంగ్రెస్ నే అంటి పెట్టుకునే ఉన్నారు. పార్టీ ఒత్తిడి మేరకు 2014 లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజమహేంద్రవరం లోక్ సభ కు పోటీ చేసి, ఊహించిన విధంగానే ఓటమిపాలయ్యారు. చివరకు కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని తేల్చుకుని కొద్దికాలానికే దుర్గేష్ వైసిపిలో చేరారు.

Also Read : వరుసగా మూడుసార్లు ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కు ఎంపీ అయ్యే యోగం ఉందా..?

వైసీపీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా పదవి పొందారు. వైసీపీ లో చేరే సమయంలోనే ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన ఆంకాంక్షను బహిరంగంగా వ్యక్తపరిచారు దుర్గేష్‌. అయితే ఎన్నికలకు ముందు పరిస్థితులు మారిపోయాయి.

ఆకుల వీర్రాజు జక్కంపూడి వర్గంగా ఉన్నారు. జక్కంపూడి రామ్మోహన్‌రావుకు కందుల దుర్గేష్‌ అనుచరుడు అయినా.. ఆయన మరణం తర్వాత ఆ కుటుంబానికి దూరంగా జరిగారు. రాజమండ్రి సిటీలో ఉండే కందుల దుర్గేష్‌.. ఎమ్మెల్సీ పదవీ కాలంలో రాజమండ్రి రూరల్‌పై ఎక్కుద దృష్టి పెట్టారు. అక్కడే అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు కేటాయించారు.

ఆ నియోజకవర్గంలో జక్కంపూడి రామోహ్మన్‌ రావు సతీమణి విజయలక్ష్మీ పోటీ చేసి ఓడిపోయారు. తమకు పోటీగా కందుల దుర్గేష్‌ వస్తున్నారనే భావనలో వారిలో నెలకొంది. ఈ కారణం వారి మధ్య దూరాన్ని పెంచింది. అది ఆ తర్వాత కూడా కొనసాగింది. అందుకే వైసీపీలో చేరినా.. పోటీ చేసే అవకాశం ఉన్నా.. దుర్గేష్‌ అయిష్టంగానే వైసీపీని వీడారు.

2009లో రాజమండ్రి రూరల్‌ నుంచి పోటీ చేసిన జక్కంపూడి విజయలక్ష్మీ మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఇక్కడ చందన రమేష్‌ టీడీపీ తరఫున గెలిచారు. ప్రజా రాజ్యం రెండో స్థానం పొందింది. ఈ ఎన్నికల తర్వాత జక్కంపూడి విజయలక్ష్మీ రాజమండ్రి పక్కనే ఉన్న రాజానగరం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. రాజా నగరం లో 2014లోను విజయలక్ష్మీ ఓడిపోయారు.

ఇటీవల ఆకుల వీర్రాజు స్థానంలో వైసీపీ కో ఆర్డినేటర్‌గా ఎంపికైన చందన నాగేశ్వర్‌.. చందన రమేష్‌ కుమారుడే. 2014, 2019 రెండు ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన ఆకుల వీర్రాజుకు అవకాశం ఇవ్వగా.. ఈ సారి రూటు మార్చింది. బీసీ సామాజికవర్గానికి చెందిన నాగేశ్వర్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. అయితే 2024 నాటికి పరిణామాలు మారవన్న గ్యారెంటీ లేదు.

Also Read : దటీజ్ దొరబాబు !

పార్టీని వీడొద్దంటూ ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి విన్నవించినా పరిస్థితుల ప్రభావం దుర్గేష్‌ను జనసేనలో చేరేలా చేసింది. దుర్గేష్‌ పార్టీ మారితే.. ఓట్లు చీలిపోయి.. అది టీడీపీకి మేలు జరుగుతుందని వైసీపీ నేతలు భావించినట్లుగానే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి త్రిముఖ పోరులో పది వేల పైచిలుకు మెజారిటీతో బయటపడ్డారు.

టీడీపీ తరఫున పోటీ చేసిన బుచ్చయ్య చౌదరికి 74,166 ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుకు 63,762, జనసేన తరఫున పోటీ చేసిన కందుల దుర్గేష్‌కు 42,685 ఓట్లు వచ్చాయి. దుర్గేష్, ఆకుల వీర్రాజులు వైసీపీలోనే ఉంటే.. ఇక్కడ వైసీపీ విజయం నల్లేరు మీద నడకేనన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. అయితే దుర్గేష్‌ జనసేన అభ్యర్థి కావడంతో రెండో సారి కూడా ఆకుల వీర్రాజుకు ఓటమి తప్పలేదు.

సీటు కోసం సోదరుడితోనే పోటీ ఉంటుందా ?

దుర్గేష్ బంధువు మేడా గురుదత్ ప్రసాద్ కూడా అదే పార్టీలో చురుగ్గానే ఉంటున్నారు. జిల్లాలో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో మిత్రపక్షం బిజెపి కన్నా.. జన సేన పార్టీకే ఎక్కువ ఓట్లు లభించాయి. రాజమండ్రి రూరల్ పంచాయతి ఎన్నికల్లోనూ జనసేన సత్తా చాటింది. నేపధ్యంలో రానున్న ఎన్నికల్లో సీటు కోసం ఆయన సోదరుడితోనే పోటీ పడే పరిస్థితులు రావచ్చని కూడా విశ్లేషిస్తున్నారు. ఈసారైనా ఆయనకు కాలం కలిసి వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారా అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.

Also Read : కాపుల కోసం ఆకుల స్కీమ్ ..... అందుకేనా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp