అచ్చెం నాయుడు ఆస్పత్రిని వదలాల్సిన సమయం వచ్చిందా..?

By Kotireddy Palukuri Jul. 29, 2020, 12:34 pm IST
అచ్చెం నాయుడు ఆస్పత్రిని వదలాల్సిన సమయం వచ్చిందా..?

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన మాజీ మంత్రి అచ్చెం నాయుడు ఇక ఆస్పత్రిని వదలాల్సిన సమయం వచ్చిందా..? జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందా..? అంటే తాజా పరిస్థితులను బట్టి అవుననే సమాధానాలు వస్తున్నాయి. అచ్చెం నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై పలుమార్లు సుదీర్ఘంగా విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఈ రోజు తన నిర్ణయాన్ని వెల్లడించింది. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈ కేసులో అచ్చెం నాయుడు భవిష్యత్‌ ఏమిటి..? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

మొలలు ఆపరేషన్‌ అని చెబుతూ ప్రస్తుతం అచ్చెం నాయుడు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జుడిషియల్‌ రిమాండ్‌లో ఉంటున్నారు. జూన్‌ 13వ తేదీన అరెస్ట్‌ అయినప్పటి నుంచి 30వ తేదీ వరకూ అచ్చెం నాయుడు గుంటూరు సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌)లో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి విజయవాడకు నిరంతరంగా ప్రయాణం చేయడంతో అప్పటికే జరిగిన మొలల ఆపరేషన్‌ వల్ల అచ్చెం నాయుడకు రక్తస్రావం అయిందని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పడంతో విజయవాడ ఏసీబీ కోర్టు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించాలని ఆదేశించింది. జీజీహెచ్‌లో అచ్చెం నాయుడు మొలలకు మరోమారు శస్త్ర చికిత్స చేశారు. చికిత్స తాలుకూ గాయాలు మానడంతో ఈ నెల 1వ తేదీన జీజీహెచ్‌ వైద్యులు డిశ్చార్జి చేశారు. అయితే తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, కరోనా పరీక్ష కూడా చేయాలని ఆ సమయంలో అచ్చెం నాయుడు డిమాండ్‌ చేశారు. అయితే వైద్యులు డిశ్చార్జి చేయడంతో పోలీసులు అయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

విజయవాడ జిల్లా జైలు నుంచి.. తనకు మెరుగైన వైద్యం అందిచాలంటూ, ప్రవేటు ఆస్పత్రికి తరలించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రోజు వారీ పనులు కూడా చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని అచ్చెం నాయుడు తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కోర్టు అచ్చెం నాయుడు వినతిని మన్నించడంతో ఈ నెల 8వ తేదీన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జుడిషియల్‌ రిమాండ్‌లో ఉంటున్నారు.

Read Also : మాజీ మంత్రి అచ్చెం నాయుడుకు షాక్‌

మొత్తం 46 రోజుల్లో మొదటి 18 రోజులు జీజీహెచ్‌లో ఉన్న అచ్చెం నాయుడు, ఆ తర్వాత ఓ వారం రోజులు విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. మళ్లీ మొలలు సమస్య చెబుతూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. గుంటూరులోని పెరెన్నికగన్న సదరు ఆస్పత్రికి వెళ్లి ఈ రోజు బుధవారం నాటికి 18 రోజులవుతోంది. జీజీహెచ్‌ లో ఆపరేషన్‌ జరిగిన తర్వాత వెళ్లికలా పడుకోలేక.. బెడ్‌పై ఓ పక్కకు తిరిగి పడుకున్న అచ్చెం నాయుడు.. డిశ్ఛార్జి సమయంలో మాత్రం వీల్‌ చైర్‌లో సౌకర్యవంతంగా కూర్చుకున్నారు. మొలలకు చేసిన శస్త్రచికిత్స తాలుకూ గాయం మానకపోతే ఆయన అలా కూర్చునే అవకాశమే లేదని వైద్యులు చెబుతున్నారు. జీజీహెచ్‌లో చేరిన వారం రోజులకే అచ్చెం నాయుడుకు మళ్లీ ఆపరేషన్‌ చేశారు. అంటే.. ఇప్పటికి ఆపరేషన్‌ జరిగి 40 రోజులు అవుతోంది. 40 రోజుల్లో ఆ గాయం మానకుండా ఉందా..? అనే ప్రశ్న వైద్య నిపుణుల నుంచి వినిపిస్తోంది.

అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది ఎవరికీ తెలియడంలేదు. అచ్చెం నాయుడు ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నారు..? తదితర అంశాలపై ప్రతి రోజూ హెల్త్‌ బులిటన్‌ విడుదల చేస్తూ.. మాజీ మంత్రి, ప్రజా ప్రతినిధి అయిన అచ్చెం నాయుడు పరిస్థితిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత పోలీసు శాఖపై ఎంతైనా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp