Pamula Rajeswari - కుమారుడు భవిష్యత్‌ కోసం మహిళా మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..?

By Prasad Oct. 20, 2021, 03:25 pm IST
Pamula Rajeswari - కుమారుడు భవిష్యత్‌ కోసం మహిళా మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..?

రాజకీయాల్లో అమె అత్యంత అదృష్టవంతురాలు. ఎంపీటీసీగా మొదలైన ప్రస్థానం.. సర్పంచ్‌గా... రెండుసార్లు శాసనసభ్యురాలిగా... తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యురాలిగా సాగింది. తొలినాళ్లలో కలిసి వచ్చిన అదృష్టం తరువాత కాలంలో మొఖం చాటేయడంతో పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవికి ఎక్కడైతే అధికారం చెలాయించిందో... ఇప్పుడు అక్కడే తన రాజకీయ ఉనికి కోసం తాపత్రయ పడాల్సి వస్తోంది.

రాజోలు మండలం వేగివారిపాలానికి చెందిన రాజేశ్వరిదేవి అతి సాధారణ కుటుంబం. పెద్దగా రాజకీయ నేపథ్యం లేదు. గ్రామం నుంచి ఆమె ఎంపీటీసీగా, సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటికీ ఆమెకు రాజకీయంగా గుర్తింపు లేదు. 2004లో నాటి నగరం ఎస్‌సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ దక్కించుకున్నారు. నియోజకవర్గ పునర్విభజనకు ముందు తూర్పు గోదావరి జిల్లాలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా మహిళలకు సీటు కేటాయించే పరిస్థితి లేదు. ఇదే సమయంలో నాటి అధికార తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఏకంగా ఐదుగురు మహిళలకు సీట్లు కేటాయించింది. కనీసం పి.గన్నవరంలోనైనా మహిళలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. దీనికితోడు నాడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బోళ్ల సత్యనారాయణ చక్రం తిప్పడంతో రాజేశ్వరిదేవికి అవకాశం దక్కింది.

సీటు సంపాధించడంలోనే కాదు.. గెలుపులో కూడా ఆమెకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఆ ఎన్నికల్లో నగరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. ఆ పార్టీ తరపున మానేపల్లి అయ్యాజీ వేమ గెలుపొందారు. పొత్తుల్లో భాగంగా టీడీపీ 2004లో ఈ సీటును రెండవసారి కూడా బీజేపీకి కేటాయించింది. అప్పటికే ఒకసారి ఈసీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మరోసారి బీజేపీ కేటాయించడంతో ఆగ్రహంతో టీడీపీ రెబల్‌గా బరిలో దిగారు. ఇండిపెండెంటెడ్‌గా నారాయణమూర్తి ప్రభావం పెద్దగా ఉండదనుకున్నా ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు చీల్చారు. ఆయనకు ఏకంగా 22,226 ఓట్లు వచ్చాయి. నారాయణమూర్తి పోటీ చేయడం రాజేశ్వరి దేవికి వరమయ్యింది. ఓట్లు చీలిపోవడంతో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమా ఓటమి చెందాల్సి వచ్చింది.

Also Read : P Gannavaram Aqueduct - రాజోలు దీవి చరిత్రను మార్చిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..? 

నియోజకవర్గ పునర్విభజనతో నగరం కాస్తా పి.గన్నవరం నియోజకవర్గంగా మారింది. 2009లో జరిగిన ఎన్నికల్లో రాజేశ్వరిదేవికి కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అవకాశం ఇచ్చింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పోటీ చేయగా, ప్రజారాజ్యం పార్టీ నుంచి జంగా గౌతమ్‌ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, పీఆర్పీకి ఇంచుమించు సమానంగానే ఓట్లు వచ్చాయి. నారాయణమూర్తికి 41వేల 651 ఓట్లు రాగా, పీఆర్పీకి 41 వేల 359 ఓట్లు వచ్చాయి. రాజేశ్వరి దేవికి 44 వేల 756 ఓట్లు రాగా, కేవలం 3 వేల 105 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించింది. కౌటింగ్‌లో మధ్యలో వెనుకబడడంతో రాజేశ్వరిదేవి ఓటమి కాయనుకున్నారు. నియోజకవర్గంలో కొత్తగా కలిసిన అయినవిల్లి మండలంలో మెజార్టీ రావడంతో తక్కువ మెజార్టీతో ఆమె గట్టెక్కారు. అలాగే ఈ నియోజకవర్గంలో తొలినాళ్ల నుంచి టీడీపీకి మద్దతుగా నిలిచే కాపు సామాజికవర్గం పూర్తిగా పీఆర్పీ వైపు వెళ్లడంతో రాజేశ్వరికి మరోసారి వరమైంది. రెండవసారి అధికారంలో ఉన్న సమయంలోనే ఆమె టీటీడీ సభ్యురాలిగా ఉన్నారు.

2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేయాలని ఆమె భావించారు. జిల్లాలో జగన్‌ నిర్వహించిన ఓదార్పులో పాల్గొన్న ఆమె కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నుంచి వత్తిడితో ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మరోసారి పోటీలో ఉన్నారు. అయితే విభజన పాపం మూటగట్టుకున్న ఆ పార్టీ తరపున ఆ ఎన్నికల్లో ఆమె వెయ్యి ఓట్లకే పరిమితమయ్యారు. 2019కి ముందు మరోసారి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేయాలని భావించి ఎన్నికల ముందు పార్టీలో చేరారు. టిక్కెట్‌ వచ్చే అవకాశం లేదని తెలిసి జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 36 వేల 259 ఓట్లతో మూడవస్థానంలో నిలిచారు. ఎన్నికల తరువాత నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి సైతం ఆమె గైర్హాజర్‌ అయ్యింది. రాజకీయంగా చురుగ్గా లేని ఆమె ప్రజలకు క్రమేపీ దూరమవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే మరోసారి వైఎస్సార్‌సీపీలో చేరి తన ఉనికిని చాటుకోవాలనే యత్నాలలో ఉన్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఈ నియోజవకర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ నుంచి ఎమ్మెల్యేగా కొండేటి చిట్టిబాబు ఉండగా, పి.గన్నవరం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిన విప్పర్తి వేణుగోపాలరావు జెడ్పీ చైర్మన్‌ అయ్యారు. వేణుగోపాల్‌ గతంలో ఇదే నియోజకవర్గం పార్టీ కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే పండుల రవీంద్రబాబు సైతం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంతమంది మధ్యలో తనకు ఆకాశం వస్తుందనే నమ్మకం లేని రాజేశ్వరిదేవి తన స్థానంలో తన కుమారుడు పాముల ప్రకాష్‌ను వైఎస్సాఆర్‌సీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే రాజేశ్వరి దేవికి రాజకీయాల్లో కలిసి వచ్చిన అదృష్టం.. పదవీయోగం కుమారుడు ప్రకాష్‌కు వస్తుందో లేదో కాలం తేల్చాల్సి ఉంది.

Also Read : Amalapuram Ex MLA - జెడ్పి పీఠంపై ఆశతో జెడ్పిటిసిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp