ఇలాగే అయితే టీడీపీ ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌క‌మే..!

By Kalyan.S Sep. 24, 2020, 07:15 pm IST
ఇలాగే అయితే టీడీపీ ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌క‌మే..!

రాజ‌కీయ నాయ‌కులు పార్టీలు మార‌డం మామూలే. పార్టీ మారిన‌ప్పుడ‌ల్లా కొత్త‌గా చేర‌బోయే పార్టీని పొగ‌డ‌డం.. పాత పార్టీలోని లోపాల‌ను ఎత్తి చూప‌డం సాధార‌ణ‌మే. అయితే ఇటీవ‌ల వైసీపీ గూటికి చేరుతున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ఆరోప‌ణ‌లు మాత్రం మారుతున్నతెలుగుదేశం పార్టీ విధానాల‌ను, చంద్ర‌బాబు అంత‌ర్గ‌త నిర్ణ‌యాల‌ను బ‌హిర్గ‌తం చేస్తుండ‌డం టీడీపీ పునాదుల‌నే క‌ద‌లిస్తున్నాయి. వారు చెబుతున్న వాస్త‌వాల‌ను వింటుంటే చంద్ర‌బాబు ఇలాంటి రాజ‌కీయాలు కూడా చేస్తారా.. అనే అనుమానాలు క‌లిగేలా ఉంటున్నాయి. పార్టీ నాయ‌కుడు చెప్పే ఏ విష‌య‌మైనా ఆయా ప్రాంతాల్లో పార్టీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డేలా ఉండాలి. స్థానిక నేత‌ల ప్రాబ‌ల్యం పెంచేలా చేయాలి.

తాను అనుకున్న‌దే జ‌రిగేలా..

పార్టీ నాయ‌కుడైనంత మాత్రాన ఏ నిర్ణ‌య‌మైనా ఆ పార్టీలోని మెజార్టీ నేత‌ల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలి. కానీ అమ‌రావ‌తి విష‌యంలో టీడీపీలో ఆ ప‌రిస్థితి లేన‌ట్లుగా క‌నిపిస్తోంది. అమ‌రావ‌తే ఏకైక రాజ‌ధానిగా ఉండాల‌నేది కేవ‌లం చంద్ర‌బాబు సొంత నిర్ణ‌మేన‌ని ప‌రిణామాల‌ను చూస్తే స్ప‌ష్టంగా తెలుస్తోంది. అమ‌రావ‌తి కోసం అవ‌స‌ర‌మైతే త‌మ పార్టీ ఎమ్మెల్యేలు అంద‌రూ రాజీనామాకు సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు చేసిన ఆ స‌వాల్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు. ఒక‌వేళ రాజీనామా చేయాల్సి వ‌స్తే మ‌ళ్లీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని వారు భావించ‌డం ఓ కార‌ణ‌మైతే.. అమ‌రావ‌తి ఎజెండా అనేది చంద్ర‌బాబు పార్టీ కోసం కాకుండా కొంద‌రి వ్య‌క్తుల కోసం అమ‌లుచేస్తున్నార‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తించ‌డం మ‌రో కార‌ణంగా తెలుస్తోంది.

లేని ఉద్య‌మాలు చేయ‌మంటే ఎలా..?

ఇప్పుడు తాజాగా వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లికిన విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిని వెలుగులోకి తెచ్చారు. అమ‌రావ‌తి కి మ‌ద్ద‌తుగా విశాఖపట్నంలో ఉద్య‌మాలు లేవ‌నెత్తాల‌ని బాబు విప‌రీత‌మైన ఒత్తిడి తెచ్చేవార‌ని, స్థానిక ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు వ్య‌తిరేకంగా లేని ఉద్యమాలు చేయమంటే ఎలా చేయ‌గ‌ల‌మ‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబుకు ప‌లు మార్లు విన్న‌వించినా ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌కు సంబంధించి కూడా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని చిత్తూరు నేత‌ల‌పై బాబు ఒత్తిడి చేసిన‌ట్లు తెలుస్తోంది. దీన్ని బ‌ట్టి ప‌రిశీలిస్తే టీడీపీకి చెందిన కొంద‌రు నేత‌లు, ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు ఒత్తిడితోనే అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నార‌నేది స్ప‌ష్టం అవుతోంది. అయితే ఇలా ఎన్నాళ్లు పార్టీ నేత‌ల‌పై ఒత్తిడి చేసి రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రు..? ఎన్నాళ్లు అటువంటి రాజ‌కీయాల‌ను నేత‌లు భ‌రిస్తారు..? అనేది చంద్ర‌బాబు గుర్తెర‌గాలి. లేకుంటే టీడీపీ ప‌త‌నానికి వైసీపీ క‌న్నా చంద్ర‌బాబే ప్ర‌ధాన సూత్ర‌ధారి అవుతార‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp