రష్యా వ్యాక్సిన్ ప్రామాణికత ఎంత?

By Kiran.G Aug. 12, 2020, 10:08 am IST
రష్యా వ్యాక్సిన్ ప్రామాణికత ఎంత?

ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఆపసోపాలు పడుతుంది. ఎన్నో సంస్థలు వ్యాక్సిన్ తయారీ చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో రష్యా మాత్రం ప్రపంచ దేశాలకు షాకిచ్చింది. కోవిడ్ కి తొలి వ్యాక్సిన్ తయారు చేసినట్లు రష్యా తెలపడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి.

కోవిడ్ 19 కి తొలి వ్యాక్సిన్ తయారు చేశామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అంతేగాక తన కుమార్తెపై వ్యాక్సిన్ ని ప్రయోగించి చూపించారు కూడా. కాగా ఈ వ్యాక్సిన్ పై అనేకమంది శాస్త్రవేత్తలు నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ పై ఉన్న ప్రామాణికతను ప్రశ్నిస్తున్నారు. హ్యూమన్ ట్రయిల్స్ ను సరిగా నిర్వహించలేదన్నది వారి వాదన. నిజానికి వ్యాక్సిన్ అన్ని దేశాల్లో ఉన్న మనుషులకు సరిపోతుందా లేదా అన్నది తెలియకుండా సరైన పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు రావడం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి కూడా. అవన్నీ సక్సెస్ అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. కానీ వ్యాక్సిన్ అభివృద్ధికు సంబంధించిన విషయాలను అత్యంత రహస్యంగా ఉంచిన రష్యా ఇప్పుడు అకస్మాత్తుగా వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని చెప్పడం సందేహాలకు కారణం అవుతుంది. అంతేగాకుండా ఈ వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఎలాంటి ప్రకటన లేకపోవడం కూడా ఇప్పుడు పలువురిలో ప్రశ్నలు లెవనెత్తుతుంది.

రష్యా వ్యాక్సిన్ కి ప్రపంచ దేశాల్లో డిమాండ్

రష్యా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు పుతిన్ ప్రకటించడంతో పాటు తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాల్లో ఆసక్తి మొదలయింది. ఇప్పటికే 20 దేశాలు రష్యా వ్యాక్సిన్ పై ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని 2 బిలియన్ దోసులు కావాలని ఆర్డర్ ఇస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ప్రజలను ఎలాగైనా కాపాడుకోవాలని ఆయా దేశాలు కోరుకోవడం సహజమే. ఈ విషయంపై భారతదేశం కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ప్రధాని మోడీ రష్యా వ్యాక్సిన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఏది ఏమైనా రష్యా వ్యాక్సిన్ కొందరికి ఆషాదీపంలా కనిపిస్తుంటే మరికొందరిలో మాత్రం అనుమానాలు రేకెత్తిస్తోంది. రష్యా వ్యాక్సిన్ సెప్టెంబర్ నుండి తయారీ చేయాలని నిర్ణయించారు. అది అందుబాటులోకి వస్తే తప్ప ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి కావు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp