విశాఖపై సినీ పెద్దల వైఖరేమిటీ..?!

By Voleti Divakar Aug. 09, 2020, 06:20 pm IST
విశాఖపై సినీ పెద్దల వైఖరేమిటీ..?!

తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి దన్నుగా ఉన్న తెలుగు చిత్ర సీమ టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు క్రమంగా దూరమవుతోందా?. మూడు రాజధానుల పై చంద్రబాబు గత కొద్దిరోజులుగా ఎంత గగ్గోలు పెడుతున్నా సినీ పెద్దలు గానీ, ఆయన బావమరిది, సినీ హీరో బాలకృష్ణతో సహా, అమరావతిలో పెట్టుబడులు పెట్టిన మా మాజీ అధ్యక్షుడు మురళీమోహన్ కూడా ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. అమరావతి, మూడు రాజధానుల పై ఇప్పటి వరకు తెలుగు చిత్ర సీమ స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు.

రాష్ట్రంలో సినీ చిత్రీకరణపై చర్చించేందుకు ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నతెలుగు చిత్రపరిశ్రమలో పెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, దగ్గుబాటి సురేష్, పొట్లూరి వరప్రసాద్, తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. వారు బస చేసిన అతిధిగృహానికి వచ్చిన రాజధాని అమరావతి ఉద్యమకారులను కలుసుకునేందుకు కూడా వారు ఇష్టపడకపోవడం గమనార్హం. తద్వారా విశాఖ రాజధానికి వారు అనుకూలమన్న సంకేతాలకు బలాన్ని చేకూరుస్తోంది.

విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తామన్న జగన్ ప్రకటన తో సాగర నగరం లో సినీ సందడి మరింత కానుంది. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి, స్టూడియోల నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో పాటు, భూములు కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. చిరంజీవి, నాగార్జున, దగ్గుబాటి సురేష్ కుటుంబాలకు ఎపి, తెలంగాణాల్లో సినీ స్టూడియోలు, థియేటర్లు, పంపిణీ సంస్థలు ఉన్నాయి. వారి కుటుంబాల్లో సినీ హీరోలు కూడా ఉన్నారు. దీంతో వారికి భవిష్యత్ లో ఎపిలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఎంతో అవసరం.

ఎంతో ముందుచూపుతో దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు విశాఖలో తొలి స్టూడియోను నిర్మించారు. చెన్నై నుంచి తరలివచ్చాక తెలంగాణా రాజధాని హైదరాబాద్లోనే ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ కొనసాగుతోంది. అదే విధంగా విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చెందితే అదే రీతిన చిత్ర పరిశ్రమ కూడా అభివృద్ధి
చెందుతుందని సినీ పెద్దలు భావిస్తున్నట్లు ఉన్నారు. సీనీ పెద్దల్లో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారున్నా వారు అమరావతికి అనుకూలంగా ప్రకటన చేయకపోవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp