Ex Minister DL-డీఎల్ ఏం ఆశిస్తున్నారు. రాజకీయ ప్రకటనల వెనుక అసలు లక్ష్యం అదేనా

By Raju VS Oct. 17, 2021, 10:45 am IST
Ex Minister DL-డీఎల్ ఏం ఆశిస్తున్నారు. రాజకీయ ప్రకటనల వెనుక అసలు లక్ష్యం అదేనా

దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి రవీంద్రారెడ్డి అంటే చాలామందికి ఆయనెవరో తెలియదు.కానీ డీఎల్ రవీంద్రరెడ్డి అనగానే ఏపీ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ గుర్తుకొస్తారు.. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న కొద్దిమందిలో ఆయన ఒకరు. వైఎస్సార్, చంద్రబాబు వంటి వారితో పాటుగా 1978లోనే ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టిన చరిత్ర ఆయనది. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనానికి ఎదురొడ్డి నిలిచిన కొద్దిమంది కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒకరు. ఆ తర్వాత ఆరు సార్లు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ఆయన ప్రాతినిధ్యం వహించారు. పలు కీలక మంత్రిత్వశాఖలు నిర్వహించారు. కిరణ్‌ కుమార్ రెడ్డి హయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూనే సీఎంతో వివిధ అంశాలపై ఢీకొట్టారు. చివరకు మంత్రి పదవి నుంచి వైదొలిగారు. రాష్ట్ర విభజన అనంతరం గడిచిన రెండు ఎన్నికల్లోనూ ఆయన ప్రభావం ప్రత్యక్షంగా లేదు.

అయినా 2024 అసెంబ్లీ ఎన్నికలపై ఆయన కన్నేశారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరోసారి మైదుకూరు నుంచి బరిలో ఉండాలని ఆయన ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. దానికి అనుగుణంగా బహిరంగ ప్రకటన కూడా చేశారు. 72 సంవత్సరాల వయసు పైబడిన డీఎల్ రాజకీయ జీవితం కూడా 43 ఏళ్లు దాటిపోయింది. అయినప్పటికీ ఆయన క్రియాశీలక రాజకీయాలతో తన ప్రస్థానం ముగించే ఆలోచనకు రాకపోవడం విశేషంగా భావించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా రాబోయే ఎన్నికలను వేదికగా చేసుకోవడం ఆశించడం ఆసక్తికరమే.

డీఎల్ కి మైదుకూరు రాజకీయాల్లో గట్టి పట్టు ఉంది. అయితే ఆయన హయంలో ద్వితీయ శ్రేణీ నేతల పట్ల పెద్దగా శ్రద్ధ పెట్టలేదనే వాదన కూడా ఉంది. ప్రస్తుత తరంలో చక్రం తిప్పుతున్న నేతల పట్ల డీఎల్ కి చిన్నచూపు కూడా ఉంటుందనే విమర్శ వినిపిస్తుంటుంది. దానికి తగ్గట్టుగానే వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగి తన హవా చాటుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. దానికి జనసేనను ఎంచుకోబోతున్నట్టు ప్రచారం మొదలయ్యింది. రాయలసీమలో బలిజల ప్రభావం ఉండే నియోజకవర్గాల్లో మైదుకూరు ఒకటి. మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పరువు నిలిపిన మునిసిపాలిటీ అదే. దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన ఖచ్చితంగా పోటీ చేసే స్థానాల్లో మైదుకూరు ఉంటుందనే అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగా డీఎల్ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.

టీడీపీ, జనసేన మైత్రీ దాదాపు ఖాయమనే వాతావరణం ఉంది. దాంతో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మైదుకూరు సీటు మీద డీఎల్ కన్నేసినట్టు భావిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వం పై విమర్శలకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. నేరుగా జగన్ మీద పల్లెత్తు మాట అనుకుండానే సజ్జల సహా పార్టీకి చెందిన పలువురు నేతల మీద విమర్శలు చేశారు. పాలన గాడి తప్పుతోందంటూ ఆరోపించారు. మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ టీడీపీ, జనసేన కూటమి కన్ఫర్మ్ అయితే మైదుకూరు నుంచి మళ్లీ పోటీ చేసేందుకు డీఎల్ ఉత్సుకత చూపుతున్నారన్నది ఖాయం. మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టే లక్ష్యంతో ఆయన సన్నాహాలు ప్రారంభించినా జనసేన వంటి వన్ మేన్ ఆర్మీలో ఆయన మనుగడ సాధ్యమా అనే సందేహాలున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పొసగడం అంత సులువు కాదనేది నిస్సందేహం.అయితే తన రాజకీయ లక్ష్యాల కోసం డీఎల్ తీసుకునే నిర్ణయం చర్చనీయాంశం కాబోతోంది.

Also Read : DL Ravindra Reddy - మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా: డీఎల్‌

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp