మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇక పార్టీ పదవికే పరిమితం కావాల్సిందేనా..?

By Jaswanth.T Jun. 11, 2021, 11:15 am IST
మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇక పార్టీ పదవికే పరిమితం కావాల్సిందేనా..?

మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలుపొందిన సుబ్రహ్మణ్యంకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిప్యూటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు.

ఎర్రబుగ్గకారుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్‌ లభించిన సుబ్రహ్మణ్యంది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు పరిధిలోని కొత్తపేట సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ తరపున చిర్ల గడ్డిరెడ్డి 2014లో గెలుపొందడంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన రెడ్డి సుబ్రహ్మణ్యం అధికారం చెలాయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ హోదాలో రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో చిర్ల జగ్గిరెడ్డిల మధ్య ప్రతి విషయానికీ అగ్గిరాజుకునేది. శిలాఫలకంపై పేరు మొదలుకుని, ప్రోటోకాల్‌ వరకు వీరి మధ్య వివాదం రాష్ట్రస్థాయిలో మారుమోగిపోయేది. ఇందుకు రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహారశైలే కారణమని ప్రత్యర్ధులు ఆరోపిస్తుంటారు. ఎవరెన్ని అనుకున్నాగానీ, తనదైనశైలిలో సుబ్రహ్మణ్యం వ్యవహారం సాగుతుందని ఆయన వర్గీలు మద్దతుగా నిలుస్తుంటారు.

1983లో కొత్తపేట గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో రెడ్డి సుబ్రహ్మణ్యం రాజకీయాలు ఊపందుకున్నాయని చెబుతారు. తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయాలు కొనసాగించిన ఆయన తదనంతర కాలంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ పార్టీకి మారారు. తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ రేసులో నిలబడ్డారు. అయితే తన సొంత మండలమైన కొత్తపేటను కాదనుకుని రావులపాలెం నుంచి జెడ్పీటీసీగా బరిలోకి దిగారు. అప్పట్లో కొత్తపేట బీసీ రిజర్వు కాగా, రావులపాలెం జనరల్‌కు కేటాయించారు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం.. జనరల్‌ స్థానం నుంచి పోటీకి దిగడం అప్పట్లో జిల్లాలో సంచలనంగా మారింది. ఈ పోటీలో ఓటమిపాలు కావడంతో జెడ్పీ ఛైర్మన్‌ పదవిని కూడా కోల్పోయారు. అప్పట్లో రాజోలు నుంచి జెడ్పీటీసీగా గెలిచిన ప్రస్తుత సాంఘిక సంక్షేమశాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు జెడ్పీ ఛైర్మన్‌గా అవకాశం దక్కింది. తదనంతర కాలంలో వేణు రాజకీయ భవిష్యత్తుకు ఈపదవి ఆసరగా నిలిచిందని చెబుతారు. ఉభయగోదావరి జిల్లాల గౌడ,శెట్టిబలిజ సంఘం అధ్యక్షులుగా కూడా సుబ్రహ్మణ్యం పనిచేసారు.

అనంతరం కాలంలో టీడీపీలోకి మారిన ఆయన 2009లో కొత్తపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం, టీడీపీ ముక్కోణపు పోటీలో 37,250 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎనభైశాతానికి పైగా ఓట్లు పోలైన ఈ ఎన్నికల్లో 22 శాతం ఓట్లు సుబ్రహ్మణ్యం దక్కించుకోగలిగారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో ఆయన భార్య రెడ్డి అనూరాధ కొత్తపేట ఎంపీపీగా గెలుపొందారు. రెడ్డి సుబ్రమణ్యం శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవిలో ఉంటూ పార్టీ పదవుల్లో ఉండకూడని కారణంగా ఆయన భార్య ప్రస్తుతం అమలాపురం పార్లమెంటు జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

మరో రెండు నెలల్లో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిపోతున్న నేపథ్యంలో రెడ్డి భవిష్యత్తు డోలాయమానంలో పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ.. పార్టీ ఏదైనా గానీ అత్యంత ప్రభావవంతమైన రాజకీయాలు నడిపిన సుబ్రహ్మణ్యం భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. తనకు పదవినిచ్చిన తెలుగుదేశం పార్టీయే ప్రస్తుతం డక్కామొక్కీలు తింటున్న నేపథ్యంలో ఆయన ఆలోచన ఏంటన్నదానిపై చర్చనడుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్‌ పదవికాలం పూర్తయ్యాక పార్టీ పదవిలోకి మారతారేమో? అన్న చర్చకు కూడా అవకాశం ఇస్తోంది. క్రియాశీలక పొలిటీషియన్‌గా కెరీర్‌ మొత్తం వ్యవహరిస్తూ వచ్చిన ఆయన పడుతూ లేస్తూ.. నడుస్తున్న తెలుగుదేశం పార్టీ పదవిని భుజానికెత్తుకుని ఇతర పార్టీలతో పోరాటం చేయడానికి ముందు వరుసలో నిలుస్తారా? లేక తన సొంత భవిష్యత్తును వెతుక్కుంటూ ‘ఇతర’ నిర్ణయాలను పరిశీలిస్తారా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంటుందని నియోజకవర్గంలో ప్రస్తుతం టాక్‌ నడుస్తోంది.

Also Read : ఉండవల్లి ఏం చేస్తున్నారు ? ! 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp