పెన్షనర్స్‌ ప్యారడైజ్‌కి ఏమైంది..?

By Kotireddy Palukuri Jan. 13, 2020, 04:08 pm IST
పెన్షనర్స్‌ ప్యారడైజ్‌కి ఏమైంది..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతమైన వాతావరణానికి మారు పేరు గోదావరి జిల్లాలు. రాష్ట్రంలో మిగతా జిల్లాలో రాజకీయం ఒక ఎత్తేయితే.. ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం మరో ఎత్తు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా ఏస్థాయి నేతలైనా సరే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోరు. ఒకవేళ చేసినా అవి చాలా సున్నితంగా ఉంటాయి. వేర్వేరు పార్టీలలో ఉండే నాయకులు ఆయా పార్టీకలు అనుగుణంగా కార్యక్రమాలు, విమర్శలు చేసుకున్నా.. అవి తమ స్నేహాలు చెడిపోయే విధంగా ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇక్కడ నేతలు రాష్ట్ర స్థాయి నేతలు, ముఖ్యమంత్రులపై తీవ్ర విమర్శలు చేస్తారు కానీ స్థానికంగా ఉండే తమ రాజకీయ ప్రత్యర్థులను మాత్రం పల్లెత్తు మాట కూడా అనరు.

అధికారంలో ఎవరు ఉన్నా అన్ని పార్టీల నాయకులకు పనులు జరుగుతాయి. అనధికారిక భవన నిర్మాణాలైనా, లేదా నిబంధనలకు విర్ధుంగా జరిగే మరే ఇతర పనులైనా సరే ఎంచక్కా జరిగిపోతాయి. అధికారంలో ఎవరున్నా దందాల్లో వాటాలు మాత్రం అందరికీ రావడం రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో బహు అరుదుగా చూస్తుం టాం. కానీ పశ్చిమ గోదావరిలో 15, తూర్పు గోదావరిలో 19 వెరసి 34 నియోజకవర్గాల్లో మాత్రం దాదాపు 90 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల మధ్య భాగపంపకాలు అత్యంత సహజం. కాకపోతే అధికారంలోకి ఉన్న వారికి ప్రతిపక్షంలో ఉన్న వారి కన్నా ఓ పది శాతం ఎక్కువ ఉంటుందంతే. గత ప్రభుత్వ హాయంలో జరిగిన ఇసుక, మట్టి, మద్యం దందాల్లో అందరికీ వాటాలు వచ్చిన విషయం జగద్వితమే.

ఇలాంటి వాతావరణం ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో తాజాగా కాకినాడలో వైఎస్సార్‌సీపీ, జనసేన కార్యకర్తల మధ్య జరిగిన కోట్లాట ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. పెన్షనర్స్‌ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడలో ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కాకినాడలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతారు. ఇక్కడే సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటారు. అందుకే ఒకప్పటి కోకనాడ, నేటి కాకినాడకు పెన్షనర్స్‌ పార్యడైజ్‌గా పేరొచ్చొంది. అయితే ఇది చరిత్రగా మిగిలిపోయేలా నిన్న జరిగిన పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

శనివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ‘‘ ఒక రాజధాని వద్దు – మూడు రాజధానులు ముద్దు’’ అనే పేరుపై వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమయంలో ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, క్షమాపణలు చెప్పాలంటూ ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆదివారం చేపట్టింది.

ఈ కార్యక్రమం కాకినాడ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సీఎం జగన్, ఎమ్మెల్యే ద్వారపూడి దిష్టిబొమ్మలు తగులపెట్టిన జనసేన అక్కడ నుంచి ఎమ్మెల్యే ఇంటికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. రాళ్లు రువ్వడాలు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు, పిడిగుద్దులు.. ఇలా దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాకినాడలోని భానుగుడి సెంటర్, సిటీ ఎమ్మెల్యే ప్రాంతమైన భాస్కర నగర్‌ రణరంగంగా మారాయి. ఈ ఘనటతో కాకినాడ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రశాంతమైన నగరంలో ఇలాంటి ఘటన గతంలో జరగిన దాఖలాలు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందారు.

జనసేన పార్టీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఒకతీరైతే.. ఉభయ గోదావరి జిల్లాలో మరోలా ఉంటుంది. ఇక్కడ ఆ పార్టీ ఇతర జిల్లాల్లో కన్నా బలంగా ఉంది. నాయకులతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తల బలం ఉంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సామాజికవర్గ ప్రజలు ఈ జిల్లాలో అధికం కావడం ఈ బలానికి ప్రధాన కారణం. అందుకే గతంలో పవన్‌ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు పలు జిల్లాలో విమర్శలు చేసినా.. ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు.

రాజకీయంలో పార్టీల సిద్ధాంతాలపై, ఆ పార్టీల అధినేతలు అంశాల వారీగా వ్యవహారిస్తున్న తీరుపై విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజం. అయితే ఇవి మాటల వరకు మాత్రమే ఉంటే ఫర్వాలేదు కానీ చేతల వరకు వస్తే సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల కన్నా అధికారంలో ఉన్న పార్టీకి బాధ్యత అధికం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విమర్శలు, ఆరోపణలు చేయడం తమను గెలిపించిన ప్రజలకు, తమ ప్రభుత్వానికి ఎంతో శ్రేయష్కరం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp