రాముల‌మ్మ‌.. ఏమైంద‌మ్మా..!

By Kalyan.S Oct. 29, 2020, 09:30 am IST
రాముల‌మ్మ‌.. ఏమైంద‌మ్మా..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్ విజ‌య‌శాంతి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్ప‌నున్నారంటూ కొద్ది రోజులుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. లేదు.. లేదు.. కాంగ్రెస్ లోనే ఉంటారంటూ తాజాగా మ‌రో వార్త వెలువ‌డింది. ఇంత‌కీ రాముల‌మ్మ మ‌న‌సులో ఏముందో అంతుచిక్క‌డం లేదు. గ‌త అసెంబ్లీ, ఎంపీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారంలో పాల్గొన్న విజ‌య‌శాంతి ఆ త‌ర్వాత పెద్ద‌గా క‌నిపించ‌లేదు. రాజ‌కీయ స‌మావేశాలు, వేదిక‌ల‌పై మాట్లాడిన దాఖ‌లాలు లేవు. హోరాహోరీగా సాగుతున్న దుబ్బాక ఎన్నిక‌కు కూడా ఆమె దూరంగా ఉన్నారు. ప్ర‌చార క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్ అయి ఉండి కూడా ఆమె ప్ర‌చారంలో పాల్గొన‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలోనే ఆమె కాంగ్రెస్ ను వీడుతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఆమెతో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి భేటీ కావ‌డం ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చింది. 

బుజ్జ‌గింపులు ఫ‌లించాయా..?

విజయశాంతి బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుండ‌డంతో టీపీసీసీ రంగంలోకి దిగింది. ఆమె ఇంటికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ వెళ్లారు. రాములమ్మతో ఆయన సంప్రదింపులు జ‌రిపారు. విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. విజయశాంతితో భేటీ అనంతరం మాట్లాడుతూ... ‘విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అంటే ఎంతో గౌరవం. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమె పార్టీలోనే ఉంటారు. పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమే. విజయశాంతిని మేమంతా ఎంతో గౌరవిస్తాం. కరోనా కారణంగానే కొత్త ఇన్‌ఛార్జ్‌ను కలవలేకపోయినట్లు చెప్పారు’ అని అన్నారు. దీంతో ఆమె బీజేపీలో చేర‌తార‌న్న‌ప్ర‌చారానికి తెర ప‌డిన‌ట్లేన‌ని భావిస్తున్నా.. ఆమె మాత్రం స్వ‌యంగా ఏ నిర్ణ‌య‌మూ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

మ‌రి ప్ర‌చారం ఏమైంది..?

గతంలో విజయశాంతి మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అందువల్ల దుబ్బాక ఎన్నికలో విజయశాంతి ప్రభావం ఉంటుందని బీజేపీ భావించింది. విజయశాంతికున్న సినీగ్లామర్, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇప్పటికే విజయశాంతితో కిషన్‌రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి కొద్ది రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం. విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని బీజేపీతోనే ప్రారంభించారు. భారతీయ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. తర్వాత ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్‌లో చేరారు. నాటి నుంచి కాంగ్రెస్ లోనే కొన‌సాగుతున్న విజ‌య‌శాంతి దుబ్బాక ప్ర‌చారానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో విజయశాంతి, బీజేపీలోకి వెళ్తారా లేక.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా అనే స‌స్పెన్స్ వీడాలంటే స్వ‌యంగా ఆమె చెప్పాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp